భారత ప్రజాస్వామ్యంపై దాడి: ఉగ్రవాద దాడులపై మోడీ
హజారీబాగ్: ఉగ్రవాదులు భారత ప్రజాస్వామ్యంపై దాడి చేశారని, అయితే దేశ భద్రతను రక్షించడానికి మన జవాన్లు దైర్యసాహసాలు ప్రదర్శించారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మిలిటెంట్ల దాడిలో మరణించిన సైనికులకు ఆయన నివాళులు అర్పించారు. ఉగ్రవాదులు భారత ప్రజాస్వామ్యంపై దాడికి పూనుకున్నారని, మన సాహసోపేత సైనికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి దేశ భద్రతను కాపాడారని ఆయన అన్నారు.
ప్రాణాలు అర్పించిన జార్ఖండ్ సాహసపుత్రుడు సంకల్ప్ కుమార్ శుక్లాకు, ఇతర అమర జవాన్లకు నివాళులు అర్పిస్తున్నానని ఆయన అన్నారు. రాష్ట్రంలోని భవిష్యత్తు తరాలు సంకల్ప్ కుమార్ శుక్లా త్యాగాన్ని గుర్తు చేసుకుంటాయని ఆయన అన్నారు.

కాశ్మీర్ లోయలో శుక్రవారం ఉగ్రవాదులు నాలుగు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఉరి సైనిక శిబిరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో లెఫ్టినెంట్ కల్నల్ సంకల్ప్ కుమార్ మరణించారు. సోమవారం కాశ్మీర్ లోయలో మోడీ ప్రచారం సాగించనున్నారు. రెండు విడతల ఎన్నికల్లో భారీగా ఓటింగ్ జరిగిన నేపథ్యంలో నిస్పహకు గురైన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని ఆయన అన్నారు.
కాశ్మీర్‌లో శుక్రవారం జరిగిన నాలుగు దాడుల్లో 13 మంది మరణించారు. వారిలో ఓ పౌరుడు, 9 మంది సైనికులు, ముగ్గురు పోలీసులు ఉన్నారు. రెండు దాడులు ఉరి, ట్రాల్‌ల్లో జరిగాయి. జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన రెండు విడతల పోలింగులో 71 శాతం ఓట్లు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications