పుల్వామాలో గ్రనేడ్ తో ఉగ్రమూక దాడి .. నలుగురు జమ్మూ పౌరులకు గాయాలు
జమ్మూకాశ్మీర్లో నిత్యం ఏదో ఒక అలజడి కొనసాగుతూనే ఉంది. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి, 24 గంటలు కంటి మీద కునుకు లేకుండా పహారా కాస్తున్నప్పటికీ ఏదో ఒక రకంగా ఉగ్ర మూక భారత భద్రతా దళాలపై దాడులకు ప్రయత్నాలు సాగిస్తోంది. కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఇప్పటికే భారతదేశంలోకి అనేక రహస్య మార్గాల ద్వారా చొరబడిన ఉగ్రవాదులను ఏరివేయడానికి జమ్మూకాశ్మీర్లో భద్రతా బలగాలు నిత్యం కూంబింగ్ ఆపరేషన్లను చేస్తూనే ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ బోర్డర్ లో భద్రతను మరింత పెంచాయి. అయినప్పటికీ ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాలపై మంగళవారం ఉగ్రవాదులు గ్రనేడ్ తో దాడి చేశారు. ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్ దాడిలో కనీసం నలుగురు పౌరులు గాయపడ్డారని సమాచారం. నివేదికల ప్రకారం, ఉగ్రవాదులు పుల్వామా చౌక్ గుండా ప్రయాణిస్తున్న భద్రతా దళాల వాహనం వైపు గ్రనేడ్ విసిరారు. భద్రతా బలగాలను టార్గెట్ చేస్తూ వారు గ్రనేడ్ ను విసిరినప్పటికీ అది వారి వాహనం మీద కాకుండా రోడ్డు పక్కన పేలింది . ఈ ఘటనలో దాదాపు నలుగురు పౌరులు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఒక్కసారిగా భద్రతా బలగాలపై గ్రనేడ్ దాడి జరగడంతో పుల్వామా ప్రాంతాన్ని ఇప్పుడు భద్రతా అధికారులు చుట్టుముట్టారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు . ఇటీవల, జమ్మూ లోయలో ఉగ్రవాదుల గ్రనేడ్ దాడులు పెరుగుతున్నాయి. గత వారం, శ్రీనగర్‌లోని చానపోరా ప్రాంతంలో గ్రెనేడ్ దాడిలో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు గాయపడ్డారు. సోమవారం, జాతీయ రహదారి 44 యొక్క బిజీగా ఉన్న పరిమిపిరా-పంథాచౌక్ వద్ద ఉగ్రవాదులు భద్రతాదళాలను టార్గెట్ చేస్తూ ఆరు గ్రెనేడ్‌లను పాతి పెట్టినట్లుగా గుర్తించిన ఆర్మీ వాటిని నిర్వీర్యం చేసింది.
ఇటీవల జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాద చర్యలు తీవ్రంగా పెరుగుతున్నాయని తాజా పరిణామాలతో అర్థమవుతుంది. ఆదివారం నాడు పట్టపగలు నడివీధిలో ఒక పోలీసు అధికారిని ఉగ్రవాది బహిరంగంగా కాల్పులు జరిపి హతమార్చాడు. మొన్న మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో టెర్రరిస్టులు ఖాన్యర్ లోని పోలీసు పార్టీపై కాల్పులు జరిపారు. ఇక ఈ ఘటనలో ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ అర్షిద్ అహ్మద్ బుల్లెట్ గాయాలతో కుప్పకూలిపోయాడు. అతడిని ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది . తీవ్ర గాయాలపాలైన ఇన్స్పెక్టర్ మృతి చెందారు. ఇక ఈ ఘటన నేపథ్యంలో ఖాన్యర్ ప్రాంతంలో పోలీసులు ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. ఇప్పుడు తాజాగా గ్రనేడ్ దాడితో మరోమారు జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల దాడుల కలకలం రేగింది.












Click it and Unblock the Notifications