Tomato: ప్రజలకు శుభవార్త.. దిగిరానున్న టమాటా ధరలు..!
దేశంలో టమాటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు టమాటా కొనలేని స్థితికి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు టమాటా ధరల తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. టమాటా ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రాల నుంచి టమాటా సేకరించాలని నిర్ణయించింది. దీంతో టమాటా ధరలు తగ్గే అవకాశం ఉంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ చర్యలతో టమాటా ధరలు సగానికి తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రణాళిక ప్రకారం టమాటా ఎక్కువగా పండించే రాష్ట్రాల నుంచి వాటిని సేకరించనున్నారు. టమాటా అన్ని రాష్ట్రాల్లో పండిస్తున్నా.. ఆంధ్రప్రదేశ్, కర్ణాట, మహారాష్ట్రలో భారీగా టమాటా పండిస్తారు. దేశంలో పండించే టమాటాల్లో 58 శాతం టమాటా ఈ మూడు రాష్ట్రాల నుంచి వస్తుంది. కేంద్ర వినియోదారుల వ్యవహారాల శాఖ ఈ మూడు రాష్ట్రాల నుంచి టమాటాను పెద్ద మొత్తం సేకరించాలని నిర్ణయించింది.

ఆయా రాష్ట్రాల్లో పండిస్తున్న టమాటాలను వెంటనే కొనాలని నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆదేశాలు వెళ్లాయి. గుజరాత్, మధ్యప్రదేశ్ కు మహారాష్ట్ర నుంచి, ఢిల్లీ, ఎన్సీఆర్, హిమాచల్ ప్రదేశ్ కు కర్ణాటక నుంచి టమాటా తరలిస్తామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది. మహారాష్ట్రంలోని సతారా, నారాయణంగావ్, నాసిక్ జిల్లాలో నుంచి ఎక్కువ టమాటా కొనుగోలు చేయనున్నారు.
టమాటా ధరలు గత జూన్ నుంచి పెరుగుతూ వస్తున్నాయి. టమాటా ధర జులైలో భారీగా పెరిగింది. కొద్ది రోజుల క్రితం ఉత్తరా ఖండ్ లో కిలో టమాటా రూ.250 పలికింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో టమాటా రూ. 100 నుంచి 120 పలుకుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు ప్రాంతాల్లో టమాటాను సబ్సిడీలో ప్రజలకు అందిస్తోంది.
ఇటు పచ్చి మిర్చి ధరలు కూడా భారీగానే ఉన్నాయి. కిలో పచ్చి మిర్చి రూ. 120 నుంచి రూ.140 పలుకుతుంది. అల్లం కిలో రూ. 250 నుంచి రూ.300 పలుకుతోంది.












Click it and Unblock the Notifications