చనిపోయాడనుకున్న వ్యక్తి పాడె మీద నుంచి లేచాడు.. ఆపై ఏం జరిగిందంటే..
చనిపోయిన వాళ్ళు లేచి కూర్చోవడం ఎక్కడైనా చూసారా? మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కి సమీపం లో ఉన్న ధార్ లో మరణించాడు అనుకున్న ఒక వ్యక్తి స్మశానానికి తీసుకు వెళుతుండగా ఒక్కసారి లేచి కూర్చున్న ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఈ ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపే విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే...

గుండెపోటుతో మరణించిన వ్యక్తి
మధ్యప్రదేశ్లోని ఇండోర్ కు సమీపంలో ధార్ లో నివసించే 52 సంవత్సరాల సంతోష్ అనే వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆయనను వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఎమర్జెన్సీ విభాగంలో సంతోష్ కు వైద్యులు చికిత్స అందించారు. ఆ తర్వాత మరుసటి రోజు అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సంతోష్ మరణవార్తతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంతో ఆయన మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు.

పాడె పై స్మశానానికి తీసుకు వెళ్తుండగా లేచి కూర్చున్న మృతుడు
బంధుమిత్రులు అందరూ మృతదేహం వద్ద రోదించి, ఆపై జరగాల్సిన కార్యక్రమాలని నిర్వహించేందుకు రంగంలోకి దిగారు . అంత్యక్రియలకు సిద్ధం చేసుకుని పాడెపై స్మశాన వాటికకు తీసుకువెళ్లడానికి బయలుదేరారు. ఇక మార్గమధ్యలో సంతోష్ ఒక్కసారిగా దగ్గుతూ పాడె పైనుండి పైకి లేచాడు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే పాడె దించి అతను తాగటానికి నీటిని ఇచ్చి, కాస్త అనారోగ్యంగా ఉందని చెప్పడంతో హుటాహుటిన మరో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అక్కడికి వెళ్లి లోపే సంతోష్ మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు.

చనిపోకున్నా చనిపోయాడని చెప్పిన ఆస్పత్రిపై చర్యలకు డిమాండ్
పాడె పైనుండి పైకి లేవడంతో సంతోష్ బ్రతికి ఉన్నాడు అని భావించడం వల్ల కుటుంబ సభ్యులకు కలిగిన సంతోషం మరి కొన్ని క్షణాలలోనే ఆవిరైపోయింది. ఆసుపత్రి వైద్యులు చనిపోక ముందే సంతోష్ చనిపోయాడంటూ ధృవీకరించారు అని కుటుంబ సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మొదటి సారి వైద్యం అందించిన ఆసుపత్రి పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సంతోష్ కు సరైన వైద్యసేవలు అందిస్తే ఆయన బతికే వాడని, బ్రతికి ఉన్న మనిషిని చనిపోయాడని చెప్పి చివరకు లేకుండా చేశారని సంతోష్ కుటుంబ సభ్యులు సదరు ఆసుపత్రి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంతోష్ విషయంలో వైద్యుల కన్ఫ్యూజన్ ..
ఇక ఈ ఘటన నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేసి ఆసుపత్రి పై చర్య తీసుకోవాలని సంతోష్ కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. చనిపోయిన వాళ్ళు లేచి కూర్చోరు కానీ వాళ్ళు చనిపోక ముందే చనిపోయారని భ్రమ పడుతుంటారు.. ఇక సంతోష్ విషయంలో ఏకంగా వైద్యులే కన్ఫ్యూజ్ అయ్యారు.
బ్రతికి ఉన్న వ్యక్తి చనిపోయాడని ధ్రువీకరించారు. దీంతో కుటుంబం నిజమని నమ్మి అంత్యక్రియలు చేసేందుకు వెళ్తుండగా ఆయన లేచి కూర్చున్నారు. ఆపై కొద్ది సేపటికే మరణించారు.












Click it and Unblock the Notifications