విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఐసిస్ గాలం
న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు కార్పొరేట్ శైలిలో యువకులకు గాలం వేసి తమ సంస్థలో చేర్చుకుంటున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అంటున్నారు.
విదేశాల్లో ఉద్యోగాలు, అధిక మొత్తంలో వేతనాలు ఇస్తామని యువతను నమ్మిస్తున్నారని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూసింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో గత శుక్రవారం నుంచి ఐఎస్ఐఎస్ సానుభూతి పరులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
దర్యాప్తు చేస్తున్న అధికారులకు దిమ్మ తిరిగే విషయాలు తెలిశాయి. అనేక వెబ్ సైట్ లలో ఉద్యోగాల కోసం యువత పెట్టుకున్న అర్జీలను ఉగ్రవాదులు సేకరిస్తున్నారు. తరువాత యువకులను ఆన్ లైన్ లోనే సంప్రదిస్తున్నారు.

అనంతరం ఆన్ లైన్ లో యువకులతో చర్చించి తాము మంచి ఉద్యోగాలు, అధిక మొత్తంలో వేతనాలు ఇస్తామని, మా తత్వ సిద్దాంతాలను ప్రచారం చెయ్యాలని వారిని లొంగదీసుకుంటున్నారు. సౌదీ అరేబియా, టర్కీలలో ఉద్యోగాలు చెయ్యాలని చెబుతున్నారు.
యువకులు విదేశాలకు వెల్లడానికి ఉగ్రవాదులే సహాయం చేస్తున్నారు. సౌదీ అరేబియా, టర్కీ చేరుకున్న యువకులను తరువాత అక్కడి నుంచి ఇరాక్, సిరియాలకు తీసుకు వెళుతున్నారని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూసింది.
గత శుక్రవారం దేశవ్యాప్తంగా 14 మంది అనుమానిత ఉగ్రవాదులను అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. విచారణ తరువాత ఐదు మంది ఉగ్రవాదులను అధికారికంగా అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఎన్ఐఏ అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications