వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్‌లోని ఆజాద్ హింద్ ఫౌజ్ 'చివరి సైనికుడు' ఎహసాన్ ఖాదిర్ కథ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఎహసాన్ ఖాదిర్

ఆయన పాకిస్తాన్‌లోని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీకి కమాండెంట్‌గా ఉండేవారు. వార్తాపత్రికలు చదవడం, అవసరమైన వార్తల కటింగ్స్ సేకరించడం లాంటి పనుల్లో నిమగ్నమై ఉండేవారు.

ఆయన త్వరగానే రాజకీయ ప్రసంగాలు చేయడం ప్రారంభించారు. రాష్ట్రపతి ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్‌ను విమర్శించేవారు.

ఆయనపై ఓ నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులు అయూబ్ ఖాన్‌కు సమర్పించారు. సైనిక నియంత (అయూబ్ ఖాన్) ఆయనపై ఏవిధమైన చర్యలూ తీసుకోకుండా, "ఆయనను మాట్లాడనివ్వండి ఎలాంటి చర్యలూ అవసరం లేదు" అని ఫైల్ మీద రాసి వెనక్కి పంపారు.

ఆయనే ఎహసాన్ ఖాదిర్, సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ కమాండెంట్‌.

ఇంతకీ ఎహసాన్ ఖాదిర్ ఎవరు? అది తెలుసుకోవాలంటే మనం చరిత్రలోకి వెళ్లాలి.

ఆయన సర్ షేక్ అబ్దుల్ ఖాదిర్ పెద్ద కుమారుడు. సర్ షేక్ అబ్దుల్ ఖాదిర్ 1901లో ప్రముఖ ఉర్దూ సాహిత్య పత్రిక 'మఖ్జాన్' ప్రచురించారు.

సాహిత్య ప్రపంచంలో మఖ్జాన్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అల్లామా ముహమ్మద్ ఇక్బాల్ రాసిన చాలా పద్యాలు మొదట మఖ్జాన్‌లోనే ప్రచురించారు.

సర్ షేక్ అబ్దుల్ ఖాదిర్‌కు ముగ్గురు కుమారులు... ఎహసాన్ ఖాదిర్, మంజూర్ ఖాదిర్, అల్తాఫ్ ఖాదిర్.

భార్య, కుటుంబ సభ్యులతో కల్నల్ ఎహసాన్ ఖాదిర్

సైన్యంపై మక్కువతో...

1912 సెప్టెంబర్ 12న జన్మించారు ఎహసాన్ ఖాదిర్. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరినప్పటికీ, సైన్యంలో పనిచేయాలనే కోరికతో 1934లో ఇండియన్ ఆర్మీలో చేరారు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు, ఎహసాన్ ఖాదిర్‌ను మలయాకు పంపించారు.

1939 నుంచి 1941 వరకు సింగపూర్‌లోని బ్రిటీష్ ఆర్మీలో ఎహసాన్ ఖాదిర్ పనిచేశారని, ఆ సమయంలో ఆయన భార్య కూడా ఆయనతో పాటే ఉండేవారని ఇమ్దాద్ సబ్రీ రాశారు.

ఆయన చిన్న కుమార్తె పర్వీన్ ఖాదిర్ సింగపూర్‌లోనే జన్మించారు. జపాన్ సింగపూర్‌పై దాడి చేసినప్పుడు, భార్యాపిల్లలతో కలిసి భారతదేశానికి తిరిగి వచ్చారు. తరువాత, ఎహసాన్ ఖాదిర్ అదృశ్యమయ్యారు.

అహ్మద్ సలీం తన 'తారిఖ్ కా ఏక్ గుంషుదా వర్క్' పుస్తకంలో దీని గురించి వివరించారు.

ఎహసాన్ ఖాదిర్ హఠాత్తుగా అదృశ్యమైన సమయం స్పష్టపరచలేదుగానీ, 1941 చివరి నుంచి 1942 ప్రారంభం వరకు కొన్ని నెలలపాటు ఆయన అజ్ఞాతంలో ఉండి ఉండవచ్చని భావించారు.

1942 ఫిబ్రవరి 3న సైగాన్‌లో జనరల్ మోహన్ సింగ్ స్థాపించిన ఆజాద్ హింద్ రేడియో కార్యక్రమాలను నిర్వహించడంతో ఎహసాన్ ఖాదిర్ మళ్లీ తెర పైకి వచ్చారని ఇమ్దాద్ సబ్రీని కోట్ చేస్తూ అహ్మద్ సలీం పేర్కొన్నారు.

ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రారంభ దశ, పునర్వ్యవస్థీకరణ

"రేడియోలో భారతీయ సైనికుల సందేశాలను ప్రసారం చేసేవారు. వాటిని లక్షలాది మంది భారతీయులు ఎంతో ఆసక్తిగా విన్నారు. భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వం ఈ కార్యక్రమాలను ఆపలేకపోయింది. కానీ, వీటిని వినడాన్ని నిషేధించింది. అయినప్పటికీ, ఈ రేడియో ప్రసారం రోజు రోజుకూ ప్రాచుర్యం పొందుతూ వచ్చింది. ఇది ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రారంభ దశ.

తొలి దశలో ఆజాద్ హింద్ ఫౌజ్ నాయకుడు జనరల్ మోహన్ సింగ్, పంజాబ్ రెజిమెంట్‌కు చెందిన కంపెనీ కమాండర్‌గా జపాన్ సైన్యం చేతికి చిక్కారు. జపనీయుల చేతిలో చనిపోయే బదులు, వారి సహాయంతో భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు పోరాడవచ్చని ఆయన భావించారు" అని అహ్మద్ సలీం రాశారు.

జపనీయులు ఆయనకు మద్దతిస్తామని హామీ ఇచ్చారు. బదులుగా, జనరల్ మోహన్ సింగ్ భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడటానికి అంగీకరించిన 15,000 మంది భారతీయ యుద్ధ ఖైదీలను జపాన్‌కు అప్పగించారు.

జపాన్, ఈ యుద్ధ ఖైదీలకు జనరల్ మోహన్ సింగ్‌ను చీఫ్‌గా చేసింది. అయితే, జపాన్ స్వప్రయోజనాలకు తమను ఉపయోంచుకుంటోందని, వారిని నమ్మలేమని జనరల్ మోహన్ సింగ్‌ త్వరగానే గ్రహించారు.

దాంతో, ఈ మొదటి ఆజాద్ హింద్ ఫౌజ్‌ని రద్దు చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. జపనీయులు జనరల్ మోహన్ సింగ్‌ను అరెస్టు చేసి సుమత్రాలో గృహనిర్బంధంలో ఉంచారు. ఆజాద్ హింద్ ఫౌజ్‌ రద్దయిపోయింది. దానికి సంబంధించిన పత్రాలన్నింటినీ కాల్చేశారు.

ఎహసాన్ ఖాదిర్‌తో సహా ఇతర అధికారులు జరుగుతున్న విషయాలను గమనిస్తూనే ఉన్నారు. ఈ ఘర్షణల్లో ఆజాద్ హింద్ ఫౌజ్‌ను విచ్చిన్నం కానివ్వలేదు సరి కదా, దాని పునర్వ్యవస్థీకరణలో ముఖ్య పాత్ర పోషించారు ఎహసాన్ ఖాదిర్.

అతని సహచరులలో కల్నల్ భోంస్లే, కల్నల్ కయానీ, లోక్ నాథన్, రాష్ బిహారీ బోస్ ముఖ్యులు.

ఆజాద్ హింద్ ఫౌజ్‌ పరేడ్‌లో సుభాష్ చంద్ర బోస్

ఆజాద్ హింద్ ఫౌజ్ నాయకుడిగా సుభాస్ చంద్రబోస్

1934, జూన్ 13న సుభాస్ చంద్రబోస్ ఓ జలాంతర్గామి ద్వారా జర్మనీ నుంచి టోక్యో చేరుకున్నారు. ఆయనకు జపాన్ ప్రధానమంత్రి కూడా స్వాగతం పలికారు.

ఆజాద్ హింద్ ఫౌజ్ పగ్గాలను చేపట్టడానికి సుభాష్ చంద్రబోస్‌ను ఒప్పించారు రాస్ బిహారీ బోస్. ఆ విధంగా రెండవ ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పడింది.

సుభాస్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్‌ను బలోపేతం చేయడమే కాకుండా 1943 అక్టోబర్ 21న భారతదేశంలో స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని జపాన్, బర్మా, జర్మనీతో సహా తొమ్మిది దేశాలు గుర్తించాయి.

రెండు రోజుల తరువాత, భారతదేశ స్వతంత్ర ప్రభుత్వం బ్రిటన్, అమెరికాలపై యుద్ధం ప్రకటించింది. అనంతరం, దీని కార్యాలయాన్ని రంగూన్‌కు మార్చారు. అక్కడి నుంచి భారత సరిహద్దులపై దాడి చేసేందుకు వ్యూహరచన చేశారు.

చరిత్ర క్రమాన్ని పరిశీలిస్తే, 1944 ఫిబ్రవరి 4న, ఆజాద్ హింద్ ఫౌజ్ బర్మా సరిహద్దు నుంచి భారతదేశంపై దాడి చేసింది. 1944 మార్చి 18న అస్సాం ప్రాంతంలోని అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకుని, అక్కడ స్వతంత్ర భారత ప్రభుత్వ పతాకాన్ని ఎగురవేసింది.

కానీ, అదే సమయంలో జపాన్ పసిఫిక్ ప్రాంతం నుంచి వైదొలగడం ప్రారంభించింది. దాంతో, ఆజాద్ హింద్ ఫౌజ్‌కు తమ మద్దతును ఉపసంహరించుకోవలసి వచ్చింది.

సుభాష్ చంద్ర బోస్

ఆజాద్ హింద్ ఫౌజ్ వెనక్కి అడుగేసినప్పుడు...

నాలుగు నెలల తర్వాత, 1944 జూలై 18కల్లా, ఆజాద్ హింద్ ఫౌజ్ కూడా వెనక్కి తగ్గవలసి వచ్చింది. వారు గెలిచిన భూభాగాలను మళ్లీ బ్రిటిష్ భారత సైన్యం స్వాధీనం చేసుకుంది.

1945 మే 13న బ్రిటిష్ వారు బర్మా రాజధాని రంగూన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇది ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రధాన కార్యాలయం. దాంతో, ఆజాద్ హింద్ ఫౌజ్ అధికారులు, సైనికులు కూడా బలవంతంగా లొంగిపోయారు. వారిని యుద్ధ ఖైదీలుగా ప్రకటించారు.

అయితే, సుభాష్ చంద్రబోస్ కొందరు సహచరులతో కలిసి రంగూన్ నుంచి తప్పించుకోగలిగారు.

దురదృష్టవశాత్తూ, 1945 ఆగస్టు 18న, బోస్ సైగాన్ నుంచి జపాన్‌కు వెళుతుండగా, దారిలో తైవాన్‌లోని తై హోకు విమానాశ్రయంలో ఆయన ఎక్కిన విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన మరణించారు.

యుద్ధ ఖైదీలుగా పట్టుబడిన వారందరినీ భారతదేశానికి తీసుకువచ్చారు. 1945 నవంబర్ 5న వారిపై విచారణ జరిగింది.

మున్షీ అబ్దుల్ ఖదీర్ రాసిన పుస్తకం 'తారిఖ్-ఎ-ఆజాద్ హింద్ ఫౌజ్' ప్రకారం, ఈ యుద్ధ ఖైదీలలో జనరల్ షానవాజ్ ఖాన్, కెప్టెన్ పీలే సెహగల్, లెఫ్టినెంట్ జీఎస్ ఢిల్లాన్ పేర్లు అగ్రస్థానంలో ఉన్నాయి.

ఈ విచారణ 1945 డిసెంబర్ 31 వరకు కొనసాగింది. అధికారులు, సైనికులకు వివిధ శిక్షలు విధించారు. కానీ, ప్రజా ఉద్యమం, నిరసనల తరువాత బ్రిటిష్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవలసి వచ్చింది.

విడుదలైన యుద్ధ ఖైదీలలో ఎహసాన్ ఖాదిర్ కూడా ఉన్నారు. కానీ ఆయన్ను జైల్లో ఎంతగా శిక్షించారంటే విడుదల సమయంలో ఆయన మానసిక స్థితి క్షీణించింది.

విడుదలైన తరువాత, కుటుంబం ఆయన్ను లాహోర్‌కు తీసుకువెళ్లి చికిత్స ఇప్పించింది. మెల్ల మెల్లగా ఆయన కోలుకున్నారు.

1946 ఏప్రిల్ 26న ఎహసాన్ ఖాదిర్ గౌరవార్థం సర్ అబ్దుల్ ఖాదిర్ నివాసంలో స్వాగత సత్కారాలు నిర్వహించారు.

విడుదలైన తరువాత తన భార్యతో ఎహసాన్ ఖాదిర్

విభజనను వ్యతిరేకించారు

భారతదేశ విభజనను ఎహసాన్ ఖాదిర్ పూర్తిగా వ్యతిరేకించారు.

ఆయన సుభాస్ చంద్రబోస్ ఫౌజ్‌లో సైనికుడు, విధేయుడు. భారతదేశానికి హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవుల ఐక్యత అవసరమని విశ్వసించారు.

1947లో భారతదేశ విభజన జరిగినప్పుడు ఆయన చాలా బాధపడ్డారు. కానీ, పాకిస్తాన్‌లో ఉండేందుకే నిర్ణయించుకున్నారు.

ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరడం తప్పని అంగీకరించి, అందుకు క్షమాపణలు కోరితే, క్షమించి తిరిగి సైన్యంలో చేర్చుకుంటామని పాకిస్తాన్ కమాండర్ ఇన్ చీఫ్, ఎహసాన్ ఖాదిర్‌కు సందేశం పంపారు. కానీ, అందుకు ఆయన అంగీకరించలేదు.

"ఆ తరువాత, పాకిస్తాన్ తొలి విదేశాంగ మంత్రి సర్ జఫరుల్లా ఖాన్, ఎహసాన్ ఖాదిర్‌ను విదేశాంగ మంత్రిత్వ శాఖలో చేరమని, విదేశాల్లో ఉండవచ్చని ప్రతిపాదించారు. దేశం విడిచి వెళ్లే ఉద్దేశం లేదని తెలుపుతూ ఆ ప్రతిపాదనను కూడా ఎహసాన్ ఖాదిర్ తిరస్కరించారు" అని అహ్మద్ సలీం రాశారు.

"ఎహసాన్ ఖాదిర్ సోదరుడు మంజూర్ ఖాదిర్ విజయవంతమైన న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. ఎహసాన్ ఖాదిర్ కూడా అదే బాట పట్టేందుకు ప్రయత్నించారు. న్యాయశాస్త్రం పూర్తి చేసి, ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు. కానీ, పాకిస్తాన్ పరిస్థితి చాలా మారిపోయింది. న్యాయవాద వృత్తిలోని సూక్ష్మబేధాలు ఎహసాన్ ఖదీర్‌కు పెద్ద అబద్ధంలా తోచాయి. కపటత్వం ఆయనకు చేతకాలేదు. అందుకే న్యాయవాద వృత్తిలో నిలదొక్కుకోలేకపోయారు."

సివిల్ డిఫెన్స్ కమాండెంట్‌గా..

ఎహసాన్ ఖాదిర్ మానసికంగా సైనిక జీవితం నుంచి వేరు కాలేకపోయారు. విడుదలైన తరువాత కూడా కొంతకాలం పాటు ఆజాద్ హింద్ ఫౌజ్ యూనిఫాంను వదిలిపెట్టలేదు.

క్షమాపణలు చెప్పకుండా ఎహసాన్ ఖాదిర్‌ను సాయుధ దళాలలో చేర్చుకునేందుకు కొత్తగా స్వతంత్రం పొందిన ఇస్లామిక్ స్టేట్ బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ ఇష్టపడలేదు.

చివరికి ఆయనకు సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ స్కూల్ కమాండెంట్ పదవి దక్కింది. ఈ కొత్త ఉద్యోగంలో యూనిఫాం సైన్యం యూనిఫాంలాగే ఉండేది.

" భారతదేశ విభజన తరువాత సివిల్ డిఫెన్స్ కూడా అన్ని విభాగాల్లాగే సమస్యలతో సతమతమైంది. వాటిని పరిష్కరించేందుకు కల్నల్ ఎహసాన్ ఖాదిర్ చాలా కష్టపడ్డారు. డిపార్ట్‌మెంట్ నిర్వహణ కోసం రాత్రింబవళ్లు శ్రమించారు. కుటుంబానికి దూరంగా ఉంటూ విధులను నిర్వర్తించారు. రావల్పిండిలోని పాఠశాలకు ప్రిన్సిపాల్‌గా పోస్టింగ్ వచ్చిన తరువాత, ఆయన కొంత కాలం మురీలో గడపవలసి వచ్చింది. తరువాత ఈ పాఠశాల లాహోర్‌కు మారింది. దీని తరువాత ఆయన సివిల్ డిఫెన్స్ అకాడమీకి కమాండెంట్ అయ్యారు. ఇన్ని పనులు చేస్తున్నా ఆయనలో ఏదో అశాంతి. ఆయన గంభీరంగా ఉండేవారు. కోపమంతా అణుచుకుని మౌనముద్ర దాల్చేవారు. సివిల్ డిఫెన్స్, పౌరుల రక్షణ కోసం పనిచేయడం లేదని భావించేవారు. బహుసా ఇది ఆయనకు సరైన ఉద్యోగం కాదు" అని అహ్మద్ సలీమ్ రాశారు.

ఇంతలో అయూబ్ ఖాన్‌పై విమర్శలు, ఎహసాన్ ఖాదిర్‌పై నివేదిక అయూబ్ ఖాన్‌కు చేరడం జరిగింది.

ఎహసాన్ ఖాదిర్‌కు జవహర్లాల్ నెహ్రూ రాసిన లేఖ

ఆజాద్ హింద్ ఫౌజ్ లేని ప్రపంచం

1967లో ఎహసాన్ ఖాదిర్ పదవీ విరమణ పొందారు. తరువాత ఎక్కువ సమయం ఇంట్లోనే గడిపేవారు. ఆజాద్ హింద్ ఫౌజ్ చరిత్రలో కలిసిపోయింది.

విడుదలైన తరువాత, దేశ విభజనకు ముందు ఏడాదిన్నర కాలంలో ఆయన జాతీయ స్థాయి రాజకీయ నాయకుడిగా ఎదిగారు.

కానీ, విభజన తరువాత ఆయన స్వయంగా చీకట్లోకి వెళ్లిపోయారు.

సైనిక నియంత అయూబ్ ఖాన్‌కు వ్యతిరేకంగా అస్థిరమైన, అసంఘటిత పోరాటం ఆయన్ను మరింత ఒంటరి చేసింది.

ఎహసాన్ ఖాదిర్ సోదరులు జస్టిస్ మంజూర్ ఖాదిర్, జనరల్ అల్తాఫ్ ఖాదిర్ తమ తమ రంగాలలో ఎత్తులకు చేరుకున్నారు. వారు ఎటువంటి వైఫల్యాన్నీ ఎదుర్కోలేదు.

"కల్నల్ ఎహసాన్ ఖాదిర్ ఒంటరితనం, నిరాశ తనకు తాను తెచ్చిపెట్టుకున్నవి కావు. ఆయన నిజమైన సైనికుడు. నాయకుడిగా ఒక వెలుగు వెలిగారు. తరువాత, మారిన పరిస్థితుల్లో సర్దుకోలేకపోయారు" అని అహ్మద్ సలీం అంటారు.

ఎహసాన్ కుమార్తెలు జీవితంలో బాగా స్థిరపడ్డారు. పెద్ద కుమార్తె ఇంగ్లండ్‌లో ఉండేవారు. రిటైర్ అయిన తరువాత ఎహసాన్ ఖాదిర్‌కు గుండెపోటు వచ్చింది. చికిత్స కోసం పెద్ద కూతురి దగ్గరకు ఇంగ్లండ్ వెళ్లారు. కొంతకాలం తరువాత స్వదేశానికి తిరిగి వచ్చారు. 1969 డిసెంబర్ 23న తుదిశ్వాస విడిచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
The story of Ehsan Qadir, the 'last soldier' of the Azad Hind Fauj in Pakistan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X