బెంగాల్లో తృణమూల్ క్లీన్ స్వీప్-4 అసెంబ్లీ సీట్లూ కైవసం-ద్వేషంపై అభివృద్ధి గెలిచిందన్న దీదీ
పశ్చిమబెంగాల్లోని నాలుగు అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉపఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ సత్తా చాటుకుంది. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తృణమూల్ ఈ ఉపఎన్నికల్లోనూ తన జోరు కొనసాగించింది. దీంతో విపక్ష బీజేపీ, సీపీఐ కకావికలయ్యాయి. గతంలో సాధించిన విజయాల కంటే మెరుగైన మెజారిటీతో టీఎంసీ ఈసారి విజయాలు నమోదు చేసుకుంది.
గోసబా అసెంబ్లీ స్దానంలో 1,43,051 ఓట్ల తేడాతో టీఎంసీకి చెందిన సబ్రతా మోండల్ బీజేపీ అభ్యర్థి పలాష్ రాణాపై విజయం సాధించారు. అలాగే దిన్‌హటా నియోజకవర్గంలో బీజేపీకి చెందిన అశోక్ మండల్‌పై టీఎంసీ అభ్యర్థి ఉదయన్ గుహా 1,64,089 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఖర్దా స్ధానంలో టీఎంసీ అభ్యర్ధి సోవన్ దేవ్ ఛటోపాధ్యాయ్ 94 వేల భారీ ఆధిక్యంతో తర్వాతి స్ధానంలో ఉన్న సీపీఐ అభ్యర్ధిని ఓడించారు. శాంతిపూర్ స్ధానంలో టీఎంసీ అభ్యర్ధి బీజేపీపై 64వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో నాలుగు అసెంబ్లీ సీట్లలో టీఎంసీ క్లీన్ స్వీప్ చేసినట్లయింది.

ఎన్నికల ఫలితాలపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. బెంగాల్ ప్రజలు ఎప్పుడూ ద్వేష రాజకీయాల కంటే అభివృద్ధి, ఐక్యతేనే కోరుకుంటారనేది మరోమారు రుజువైందన్నారు. ఉపఎన్నికల్లో గెలుపొందిన నలుగురు అభ్యర్ధులకు తన హార్ధిక అభినందనలు చెబుతూ ఆమె ట్వీట్ చేశారు. బెంగాల్ ప్రజల మద్దతుతో రాష్ట్రాన్ని మరిన్ని శిఖరాలకు తీసుకెళ్తామని మమత హామీ ఇచ్చారు. ఇవాళ టీఎంసీ గెల్చుకున్న నాలుగు సీట్లలో రెండు సీట్లు దిన్ హటా, శాంతిపూర్ లో బీజేపీ సిట్టింగ్ అభ్యర్దులున్నా... అక్కడ తృణమూల్ విజయం సాధించడం విశేషం.












Click it and Unblock the Notifications