సీఎం విజయ్ సీరియస్, వాళ్ల వెన్నులో వణుకు పుట్టాలి
తమిళనాడులో వరుసగా జరుగుతున్న ఘోర నేరాలు, ముఖ్యంగా మహిళలు, మైనర్ బాలికలపై సాగుతున్న లైంగిక దాడుల ఘటనలపై ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటీవల 10 ఏళ్ల బాలికపై జరిగిన హత్యాచార ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన నేపథ్యంలో, సోమవారం సచివాలయంలో ఆయన పోలీసు, న్యాయ, సామాజిక సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో అత్యవసర ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
మహిళలు, పిల్లలపై నేరాలకు పాల్పడే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ దయ దాక్షిణ్యాలు చూపవద్దని, కేసులు వేగంగా నమోదు చేసి దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిందితులకు విధించే శిక్షలు భవిష్యత్తులో ఇలాంటి పాపానికి ఒడిగట్టాలనుకునే వారికి గుణపాఠంలా, ఒక బలమైన హెచ్చరికలా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ కీలక సమావేశంలో ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ, లైంగిక నేరాల కేసులను అత్యంత ప్రాధాన్యతతో వేగంగా పరిష్కరించి, నిందితులకు చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా చూడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. "నేరస్థులకు సరైన పద్ధతిలో కఠిన శిక్షలు పడితే, భవిష్యత్తులో అలాంటి నేరాలకు పాల్పడాలని ఆలోచించేవారికి అది నిరోధకంగా పనిచేస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ము. సాయికుమార్, హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ క. మణివాసన్, ప్రభుత్వ ప్రధాన న్యాయవాది వి. నారాయణ్‌లతో పాటు డీజీపీ డాక్టర్ సందీప్ రాయ్ రథోర్, అదనపు డీజీపీ అనితా హుస్సేన్, ఐజీ సి. రాజేశ్వరి వంటి పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు.
'ఇన్‌స్టాగ్రామ్ రీల్స్' ప్రభుత్వం.. ఎడప్పాడి పళనిస్వామి తీవ్ర విమర్శలు
ముఖ్యమంత్రి విజయ్ ఈ సమీక్షా సమావేశం నిర్వహించడానికి ముందే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై వ్యూహాత్మక దాడికి దిగాయి. మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మధురైలో పదో తరగతి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన అధికార తవకా (TVK) పార్టీ నాయకుడి అరెస్టు, తాంబరంలో కాలేజీ విద్యార్థినిని వేధించిన మరో తవకా నేత ఉదంతం, తిరువొత్తియూరులో విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ ఇంటిపై తవకా సభ్యుల బెదిరింపుల వంటి సంఘటనలను ఆయన ఎత్తిచూపారు.
"డీఎంకే గతంలో ట్విట్టర్ ద్వారా ప్రజల దృష్టిని మళ్లిస్తే, ప్రస్తుత పాలక పక్షం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా అదే పని చేస్తోంది.. అంతే తేడా!" అని పళనిస్వామి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కోటలోకి రావడం, లంచ్ బాక్స్ భోజనం చేయడం వంటి సొంత ప్రచార ప్రపంచంలో మునిగిపోయారని, కానీ రాష్ట్రం మాత్రం రక్తపాతంగా మారుతోందని ఆయన మండిపడ్డారు.
15 రోజుల్లో 38 హత్యలు.. ప్రతిపక్షాల ప్రశ్నల వర్షం
కేవలం రాజకీయ ఆరోపణలే కాకుండా, ప్రతిపక్షాలు గణాంకాలతో సహా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. గత 15 రోజుల్లోనే తమిళనాడు వ్యాప్తంగా దాదాపు 38 హత్యలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. మధురై మీనాక్షి అమ్మన్ ఆలయం సమీపంలో 17 ఏళ్ల బాలుడి దారుణ హత్య, అలాగే చోటుచేసుకున్న ఒక పరువు హత్య ఘటనలు రాష్ట్ర ప్రజలను భయాందోళనలకు గురిచేశాయి. కోయంబత్తూరు, విల్లుపురం మరాక్కానం వంటి ప్రదేశాలలో పిల్లలు, బాలికలపై జరిగిన నేరాలపై కూడా ప్రతిపక్షాలు వరుస ప్రశ్నలు సంధిస్తున్నాయి. మరోవైపు, సేలం జిల్లా ఓమలూరులో రైల్వే అండర్‌పాస్‌లో నీరు మునిగి దంపతులు మరణించిన ఘటనపై కూడా ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది.
రక్షణ చర్యలు చేపట్టాల్సిందే!
తమిళనాడు ప్రజలు మార్పును ఆశించి ఓటు వేశారని, వారికి కనీస రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని ఎడప్పాడి పళనిస్వామి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం డిఫెన్స్‌లో పడకుండా ఉండేందుకు, నేరస్థులపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి విజయ్ పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. భవిష్యత్తులో మహిళలు, చిన్నారులపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని, ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு.ச.ஜோசப் விஜய் அவர்கள் தலைமையில் இன்று (25.05.2026) தலைமைச் செயலகத்தில், பெண்கள் மற்றும் குழந்தைகளுக்கு எதிரான குற்றங்கள் குறித்தும், வழக்கினை விரைவுபடுத்துவது குறித்தும், முன்னெச்சரிக்கை நடவடிக்கைகள், விழிப்புணர்வு ஏற்படுத்துவது குறித்தும்,… pic.twitter.com/taQuSiDwPa
— CMOTamilNadu (@CMOTamilnadu) May 25, 2026














Click it and Unblock the Notifications