విజయ్ కు మద్దతు తెలిపే పార్టీలు ఇవే
తమిళనాడులో సంచలన విజయం సాధించింది.. తమిళగ వెట్రి కజగం (టీవీకే). 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 108 స్థానాల్లో జెండా ఎగురవేసింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఏఐఏడీఎంకే- 73, డీఎంకే- 53 స్థానాలకు పరిమితం అయ్యాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ కు 10 సీట్ల దూరంలో నిలిచారు విజయ్. కాంగ్రెస్ మద్దతును తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
కాగా- ఈ పరిణామాల మధ్య తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై టీవీకే చర్యలు ప్రారంభించింది. ప్లాన్ బీ అమలు చేయనుంది. ఈ విషయంలో ఇప్పటికే అంతర్గత చర్చలు ప్రారంభమయ్యాయి కూడా. కాంగ్రెస్, పట్టాళి మక్కల్ కచ్చి (PMK) టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీలు కూడా రెండేసి మంత్రి పదవులను ఆశిస్తున్నట్లు సమాచారం.

వామపక్షాలతో కూడా టీవీకే సంప్రదింపులు జరుపుతోంది. దీనిపై ఆ పార్టీలు తుది నిర్ణయం తీసుకోలేదు. వీటితో పాటు విడుదై చిరుతైగల్ కచ్చి (VCK), దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (DMDK) వంటి ఇతర చిన్న పార్టీలు సైతం విజయ్ కు మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్- 5, పీఎంకే- 4 స్థానాల్లో విజయం సాధించాయి.
ఈ తొమ్మిది సీట్లతో పాటు, వీసీకే, డీఎండీకే కలిసి వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు ఎటువంటి ఇబ్బందులు ఉండబోవని టీవీకే అగ్రనాయకత్వం భావిస్తోంది. ఆయా పార్టీలు పెట్టే షరతులకు అంగీకరించాల్సి వస్తుందనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో.. విజయ్ ఈ ఉదయం తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. వారితో చర్చించేందుకు ఈ ఉదయం 10 గంటలకు టీవీకే కార్యాలయానికి వెళ్లనున్నారు. వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ సమావేశం ముగిసిన తర్వాత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం ఫ్లోర్ టెస్ట్ కు వెళ్లే అవకాశం ఉంది. ఈ లోగా కాంగ్రెస్, పీఎంకే, వీసీకే, డీఎండీకేలతో చర్చలు జరిపి, వారి నుంచి స్పష్టమైన హామీని పొందాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తోన్నాయి.












Click it and Unblock the Notifications