జైల్లో దావూద్ అనుచరుల హత్య: నలుగురి అరెస్టు
మంగళూరు: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులను జైల్లో అతిదారుణంగా హత్య చెయ్యడానికి ఆయుధాలు సరఫరా చేసిన నలుగురిని కర్ణాటకలోని మంగళూరు నగర పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
ఆకాశభవన్ లో నివాసం ఉంటున్న మహేష్ కుమార్ (35), లతీష్ (23) బంట్వాళకు చెందిన కమలాక్ష పూజారి (42), సతీష్ ఆచార్య (42) అనే నలుగురిని అరెస్టు చేశామని మంగళవారం మంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎస్. మురుగన్ చెప్పారు.
మంగళూరు సెంట్రల్ జైలు గొడల పై నుంచి మహేష్, లతీష్ తదితరులు ఆయుధాలు జైల్లోకి విసిరి వేశారు. తరువాత ఖైదీలు ఆయుధాలను గుట్టుచప్పుడు కాకుండా దాచి పెట్టి 2015 నవంబర్ 2 తేది సోమవారం ఉదయం బయటకు తీశారు.

అదే జైలులో ఉన్న మాఫియా ముఠా సభ్యుడు, దావూద్ ఇబ్రహీం అనుచరుడు మాడూరు యూసబ్ (42), ఛోటా షకీల్ సన్నిహితుడు గణేష్ శెట్టి (47)లను అతి దారుణంగా నరికి చంపేశారు. ఇప్పటికే జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురి మీద జంట హత్యల కేసు నమోదు చేశారు.
ఇప్పుడు ఈ కేసుల అరెస్టుల సంఖ్య 9కి చేరిందని మంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎస్. మురగన్ చెప్పారు. ఆయుధాలు సరఫరా కావడానికి జైలు సిబ్బంది సహకరించారా అనే కోణంలో విచారణ జరుగుతున్నదని మురగన్ వివరించారు.












Click it and Unblock the Notifications