కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం..శిథిలాల మధ్య చిక్కుకున్న కార్మికులు
బెంగళూరు: కర్ణాటకలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న అయిదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు భవన నిర్మాణ కార్మికులు దుర్మరణం పాలైనట్లు ప్రాథమికంగా అందిన సమాచారం. 50 మంది వరకు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. భవన శిథిలాల కింద మరో 15 మంది కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కర్ణాటకలోని ధార్వాడలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.

ధర్వాడలోని కుమరేశ్వర నగర ప్రాంతంలో ఉన్న కేవీజీ బ్యాంగ్ సమీపంలో అయిదు అంతస్తుల భవనం కొద్దిరోజులుగా నిర్మాణంలో ఉంది. ఏడాది కాలంగా ఈ భవన నిర్మాణం కొనసాగుతోంది. మధ్యాహ్నం 3:40 నిమిషాల సమయంలో పెద్దగా శబ్దం చేస్తూ ఒక్కసారిగా ఈ భవనం కుప్పకూలిపోయింది. ఈ సమయంలో పలువురు కార్మికులు నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భవనం కుప్పకూలిన వెంటనే సంఘటనాస్థలంలో పెద్ద ఎత్తున హాహాకారాలు చెలరేగాయి.

సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. మూడు జేసీబీలను తెప్పించారు. వాటి సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా రప్పిస్తున్నామని పోలీసులు చెప్పారు. కనీసం 15 మంది కార్మికులు శిథిలాల చిక్కుకుని ఉండొచ్చని తమకు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని అన్నారు. గాయపడ్డ వారిని అంబులెన్సుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారి సంఖ్య అధికంగా పోలీసులు ఏకంగా 10 అంబులెన్స్ లను అందుబాటులోకి తీసుకొచ్చారు.












Click it and Unblock the Notifications