నోరు తీపి చేయని నిర్మలమ్మ: చేదు బడ్జెట్‌కు సంకేతమా?: ఆ సంప్రదాయానికి బ్రేక్
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సమీపిస్తోన్నాయి. ఇంకో రెండు రోజులే మిగలి ఉన్నాయి. సోమవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 11 గంటలకు కేంద్రం ఈ ప్రతిపాదనలను సభకు సమర్పిస్తుంది. భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించడం ఇది 10వ సారి.

నిర్మలమ్మకు నాలుగోసారి..
నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతుండటం, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బడ్జెట్‌లో మోడీ సర్కార్ ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనలను చదివి వినిపిస్తారు. నిర్మల సీతారామన్ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి. ఇప్పటిదాకా మూడుసార్లు బడ్జెట్‌ను ప్రతిపాదనలను సమర్పించారు. 2020, 2021 తరహాలోనే ఈ దఫా కూడా బడ్జెట్ సమావేశాలు కోవిడ్ ఆంక్షల మధ్య కొనసాగనున్నాయి.

హల్యా తయారీకి బ్రేక్
సాధారణంగా- బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించడానికి ముందు హల్వాను తయారు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ఈ రెండు సంవత్సరాల్లో కూడా హల్వా తయారీ సంప్రదాయం కొనసాగింది. ఇప్పుడు దీనికి బ్రేక్ పడింది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. హల్వా తయారీని రద్దు చేసింది. దీనికి బదులుగా స్వీట్లు పంచి పెట్టనుంది. హల్వా తయారీ లేకుండా బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించడం చరిత్రలో ఇదే తొలిసారి.

నార్త్ బ్లాక్‌లో
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం కొనసాగుతోన్న ఢిల్లీ నార్త్ బ్లాక్ బేస్‌మెంట్‌లో హల్వా తయారీతో బడ్జెట్ ప్రతిపాదనల రూపకల్పనను చేపడుతుంటారు అధికారులు. ఆర్థికమంత్రి స్వయంగా దీని తయారీలో పాల్గొంటుంటారు. ప్రతిపాదనలను రూపొందించే ప్రక్రియ ముగిసేంత వరకూ ఇందులో పాల్గొనే అధికారులు ఈ బేస్‌మెంట్‌లోనే నివసించాల్సి ఉంటుంది. ఫోన్లు కూడా అందుబాటులో ఉండవు. కుటుంబ సభ్యులతోనూ మాట్లాడే వీలు ఉండదు.

పేపర్‌లెస్ బడ్జెట్..
బడ్జెట్‌లో పొందుపరిచే వివరాలేవీ బయటికి పొక్కకుండా తీసుకునే ముందుజాగ్రత్త చర్యల్లో భాగమే ఇది. హల్వా తయారీ లేనందున..అందులో పాల్గొనే అధికారులకు స్వీట్లను పంచి పెట్టనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. కాగా- ఈ సంవత్సరం కూడా పేపర్‌లెస్ బడ్జెట్ ప్రతిపాదనల తెరమీదికి రానున్నాయి. గత సంవత్సరం నిర్మల సీతారామన్..పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సంప్రదాయానికి భిన్నంగా బహీ ఖాతాను సమర్పించారామె.

యాప్‌లో బడ్జెట్ కాపీలు..
దీనికోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ పేరుతో రూపొందించిన ఈ యాప్‌లో బడ్జెట్ ప్రతిపాదనలన్నింటినీ ఉంచారు. ఈ సారి కూడా అదే తరహాలో పేపర్‌లెస్ బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టనున్నారు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ బడ్జెట్ కాపీలను యాప్‌లో అందుబాటులో ఉంచుతామని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌పై స్మార్ట్‌ఫోన్లను వినియోగించే వారు ఈ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications