పెట్రోల్ లో కలిపే ఇథనాల్ ధర పెంపు-లీటరుకు రూ.1.47- కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
తాజాగా దీపావళి కానుక పేరుతో చమురు ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ లో కలిపే ఇథనాల్ ధరను లీటరుకు రూ.1.47 చొప్పిన పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలో దిగుమతి చేసుకుంటున్న చమురును కొంతమేరకైనా తగ్గించుకునేందుకు వీలు కలుగుతుంది.
దేశవ్యాప్తంగా చెరకు నుంచి ఉత్పత్తి అవుతున్న ఇథనాల్ ను పెట్రోల్ లో కలిపేందుకు వీలుగా దాని ధరను లీటరుకు రూ.1.47 చొప్పున పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలతో ప్రారంభమయ్యే మార్కెటింగ్ సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానుంది. 2025 నాటికి పెట్రోల్ లోకి 20% ఇథనాల్ డోపింగ్‌ను సాధించాలనే లక్ష్యంలో భాగంగా, డిసెంబర్‌లో ప్రారంభమయ్యే 2021-22 మార్కెటింగ్ సంవత్సరానికి చెరకు నుండి పెట్రోల్‌లో కలపడం కోసం సేకరించిన ఇథనాల్ ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌లో ఇథనాల్‌ను ఎక్కువగా కలపడం వల్ల భారతదేశం చమురు దిగుమతి బిల్లును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే చెరుకు రైతులకు అలాగే చక్కెర మిల్లులకు కూడా ప్రయోజనం చేకూరుతుంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ డిసెంబర్ 2021 నుంచి ప్రారంభమయ్యే మార్కెటింగ్ సంవత్సరానికి చెరకు రసం నుంచి సేకరించిన ఇథనాల్ ధరను లీటరుకు ₹62.65 నుండి ₹63.45కి పెంచింది. సి-హెవీ మొలాసిస్ నుండి ఇథనాల్ ధర ప్రస్తుతం లీటరుకు ₹ 45.69 నుండి ₹ 46.66 కు మరియు బి- హెవీ నుండి లీటరుకు ₹ 57.61 నుండి ₹ 59.08 కు పెంచినట్లు సమాచార మరియు ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
దీంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇథనాల్‌ను కొనుగోలు చేస్తాయి.
2020-21 మార్కెటింగ్ సంవత్సరంలో (డిసెంబర్-నవంబర్) పెట్రోల్‌తో ఇథనాల్ డోపింగ్ 8 శాతానికి చేరుకుందని, వచ్చే ఏడాదిలో ఇది 10 శాతానికి చేరుకుంటుందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు.2014-15 నుండి 2020-21 వరకు పత్తి సీజన్‌లో (అక్టోబర్ నుండి సెప్టెంబర్ వరకు) పత్తికి ఎమ్‌ఎస్‌పి ఆపరేషన్ల కింద నష్టాన్ని భర్తీ చేయడానికి అయ్యే ఖర్చును కూడా కేంద్ర మంత్రివర్గం ఇవాళ ఆమోదించింది.2014-15 నుండి 2020-21 వరకు పత్తి సీజన్‌లకు కాటన్ కమిషన్ ఆఫ్ ఇండియా కి రూ.17,400 కోట్ల మద్దతు ధరను కూడా ఇవాళ్టి కేబినెట్ భేటీలో ఆమోదించారు.












Click it and Unblock the Notifications