ఉప ముఖ్యమంత్రి అక్రమాస్తులు మాకు తెలీవా ?, కేంద్ర మంత్రి సవాల్ తో షాక్
అన్యాయానికి గురైన వారి ఆస్తులను వరుసగా మింగేస్తున్న ఓ వ్యక్తి నా ఆస్తి గురించి, మా నాన్న ఆస్తుల గురించి మాట్లాడుతున్నాడు, మా గురించి ప్రజలకు తెలుసు, మేము ఎలా కష్టపడ్డాము, ఇన్ని సంవత్సరాలు ప్రజలకు ఎలా సేవ చేశాము అని ప్రజలకే తెలుసు, అయితే పనికిమాలిన రాజకీయాలు చెయ్యడానికి తన మీద, తన తండ్రి మీద నిందలు వేస్తే చూస్తూ ఊరుకోనని కేంద్ర మంత్రి హెచ్ డీ కుమారస్వామి ఉప ముఖ్యమంత్రికి బహిరంగ సభలో వార్నింగ్ ఇచ్చారు.
మా గురించి మాట్లాడే ముందు జగన్మాత చాముండేశ్వరి లేదా నోనవినకెరె అజ్జయ్య ముందుకు వచ్చి ప్రమాణం చెయ్యాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ కు కేంద్ర మంత్రి, జేడీఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హెచ్ డీ. కుమారస్వామి సవాల్ విసిరారు.మైసూర్ చలో పాదయాత్ర మూడో రోజు మార్గం మధ్యలోని చెన్నపట్టణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి హెచ్ డీ. కుమారస్వామి మాట్లాడుతూ కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ మీద విరుచుకుపడ్డారు.

నీ బుడ్డ బెదిరింపులకు బెదిరిపోవడానికి, నీ అధికారానికి లొంగిపోవడానికి నేను మీ పార్టీ నాయకుడు కాదని హెచ్ డీ. కుమారస్వామి వ్యంగంగా అన్నారు. నా గురించి ఏం బయటపెట్టాలనిపిస్తే అది బయటపెట్టండి. మీ చేతనైంది చేసుకోండి అంటూ కేంద్ర మంత్రి హెచ్ డీ. కుమారస్వామి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు సవాలు చేశారు.
బెంగళూరులోని సదాశివనగర్‌లో ఐదుగురు వితంతు తల్లులతో వారి ప్లాట్‌ల విక్రయాల అగ్రిమెంట్ కుదుర్చుకుని వారికి పూర్తి సొమ్ము చెల్లించకుండా మోసం చేసింది ఇదే డీకే శివకుమార్ అని కేంద్ర మంత్రి కుమారస్వామి ఆరోపించారు.
ముందుగా కాంగ్రెస్ నేత అల్లం వీరభద్రప్ప ప్లాట్ కొనుక్కోవడానికి ఆ తల్లులకు అడ్వాన్స్ ఇస్తాడు. కానీ ఆ కాంగ్రెస్ నాయకుడు పూర్తి మొత్తాన్ని ఆ మహిళలకు చెల్లించలేదని, అప్పుడు డీకే శివకుమార్ జోక్యం చేసుకున్నాడని కుమారస్వామి ఆరోపించారు. తరువాత డీకే. శివకుమార్ మంత్రి అయ్యాక రాత్రిపూట ఆ మహిళలను ఇంటికి పిలిచి వారిని తుపాకీతో బెదిరించి సేల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడని, అలాంటి డీకే శివకుమార్ ఇప్పుడు తన తండ్రి, మాజీ ప్రధాని హెచ్ డీ. దేవెగౌడ గురించి మాట్లాడతాడా అని కేంద్ర మంత్రి హెచ్ డీ కుమారస్వామి విరుచుకుపడ్డారు.
ఒకరి ఆస్తిని అన్యాయంగా లాక్కోవాలనే నీచమైన నేపథ్యం నుండి వచ్చిన డీకే శివకుమార్ నా గురించి, తన తండ్రి గురించి మాట్లాడుతుంటే నాకే నవ్వు వస్తోందని కేంద్ర మంత్రి హెచ్ డీ. కుమారస్వామి వ్యంగంగా అన్నారు. మీరు ఎంతో నమ్ముకున్న నోనవినకెరె అజ్జయ్య తాతగారి ముందు మనం ఇద్దరం ప్రమాణం చేద్దాం రా, లేదా జగన్మాత చాముండేశ్వరి అమ్మవారి ముందు ప్రమాణం చేద్దాం రా అంటూ కేంద్ర మంత్రి హెచ్ డీ. కుమారస్వామి కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ కు సవాలు చేశారు.
అక్రమ ఆస్తుల విషయంలో చర్చించేందుకు విధానసౌధకు రావాలని తనను డీకే శివకుమార్ ఆహ్వానించారని, నేను కూడా విధానసౌధకు వచ్చి చర్చ జరపడానికి సిద్ధంగా ఉన్నానని, అక్రమాస్తుల గురించి అక్కడే చర్చిద్దాం అని హెచ్ డీ. కుమారస్వామి చెప్పారు.
ఇప్పుడు అన్న డీకే శివకుమార్, ఆయన తమ్ముడు డీకే. సురేష్ ఏదో ఉద్దరిద్దామని చెన్నపట్టణకు వచ్చారని, వారి అక్రమాలు ఇక్కడి నుంచి సాగుతున్నాయియని కాబట్టి వాటిని కాపాడుకోవడానికి ఇక్కడి వచ్చారని కేంద్ర మంత్రి హెచ్. డీ కుమారస్వామి ఆరోపించారు.
చెన్నపట్టణని కాపాడటానికి మీరు ఇక్కడి రాలేదని ఇక్కడి ప్రజలకు బాగా తెలుసు, ఇక్కడ మట్టికెరె సమీపంలో మీకు క్వారీ గోడౌన్ ఉంది, అక్కడికి ఎన్ని రాళ్లు తెచ్చి ఇక్కడ క్వారి దిబ్బలు పెట్టారు, దానిని ఎక్కడెక్కడికి పంపిస్తున్నారో నాకు తెలియదా? అని డీకే శివకుమార్ ను నిలదీశారు. బహిరంగ సభలో ఆ క్వారీ గోదాముల ఫోటో చూపించిన కేంద్ర మంత్రి కుమారస్వామి దీనికి సమాధానం చెప్పగలరా అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ కు సవాలు చేశారు. కేంద్ర మంత్రి హెచ్ డీ. కుమారస్వామి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ల మద్య రోజురోజుకు వివాదం ముదురుతోంది.












Click it and Unblock the Notifications