
రాజకీయాల నుంచి తప్పుకోవాలనిపిస్తోంది-గడ్కరీ షాకింగ్ కామెంట్స్
కేంద్రంలోని అధికార ఎన్డీయేలో కీలకపాత్ర పోషిస్తున్న మంత్రుల్లో నితిన్ గడ్కరీ కూడా ఒకరు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీ కాకుంటే మరెవరన్న ప్రశ్నకు కూడా ఆయనే సమాధానం. ఇప్పటికీ మోడీ కేబినెట్లో స్వతంత్రంగా వ్యవహరించగల అతికొద్దిమంత్రుల్లోనూ నితిన్ గడ్కరీ ముందువరుసలో ఉంటారు. అలాంటి గడ్కరీ తాజాగా దేశంలో చోటు చేసుకుంటున్న రాజకీయాల నేపథ్యంలో వైరాగ్యం ప్రదర్శించారు. తాజాగా రాజకీయాల నుంచి తప్పుకోవాలనిపిస్తోందన్నారు.
ఈ మధ్య తనకు రాజకీయాల నుంచి తప్పుకోవాలని తరచుగా అనిపిస్తోందని, సమాజానికి తాను చేయాల్సిన ఎన్నో పనులు మిగిలి ఉన్నాయని కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజకీయాలంటే అధికారంలో ఉండటమే అన్నట్లుగా మారిపోతోందని, కానీ సామాజిక మార్పు, అభివృద్ధికి వాహకంగా మాత్రమే తాను ఉండాలనుకుంటున్నట్లు గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలంటే ఏంటో మనమంతా అర్ధం చేసుకోవాలని గడ్కరీ కోరారు. ప్రభుత్వంలో ఉండాలా లేక సమాజం, దేశాభివృద్ధికి పనిచేయాలా అనే దాని గురించి తాను ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

మహాత్మాగాంధీ కాలం నుంచి కూడా రాజకీయాలు సమాజ హితం కోసమే ఉన్నాయని, అప్పట్లో అవి జాతిహితం కోసం, అభివృద్ధి లక్ష్యాల కోసమే ఉన్నాయని గడ్కరీ గుర్తుచేశారు. ఇప్పుడు మాత్రం అధికారంలోకి రావడం, దాన్ని అనుభవించడం కోసమే రాజకీయాలు ఉన్నట్లు నేతలు భావిస్తున్నారని గడ్కరీ చురకలు అంటించారు. ఇప్పటికైనా విద్య, అభివృద్ధి వంటి అంశాలపై రాజకీయ నేతలు ఫోకస్ పెట్టాలని ఆయన కోరారు. నాగ్ పూర్ లో మాజీ రాజకీయ నేత గిరీష్ గాంధీని సన్మానించిన సందర్భంగా గడ్కరీ ఈ వ్యాఖ్యలుచేశారు.