నాటి భరతుడే.. నేటి మోదీ!
సిమ్లా: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనను భరతుడితో పోల్చారు. భారత్ ఎప్పుడూ శాంతి-సౌభ్రాతృత్వాలను కోరుకునే దేశమని పేర్కొన్నారు. సింహం దంతాలను లెక్కించ గల గొప్ప వీరుడు భరతుడు కాగా.. నమీబియా నుంచి చిరుతలను స్వదేశానికి రప్పించిన ప్రధాని మోదీ ఈ యుగపు భరతుడని కీర్తించారు. భారత్ శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటుందే గానీ.. యుద్ధానికి భయపడి వెనకడుగు వేయబోదని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా భరోలిలో అమరవీరుల కుటుంబాలను ఆయన సన్మానించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. తాము ఆధునిక భారత్‌ను నిర్మిస్తోన్నామని, తమతో స్నేహాన్ని కోరుకునే దేశాలకు భద్రత, భరోసాను ఇస్తుందని వ్యాఖ్యానించారు. భారత్‌కు నష్టం కలిగించాలనుకునే వారు లేదా అలాంటి ఉద్దేశాలను కలిగి ఉన్నవారు తగిన భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ఏ దేశ స్వేచ్ఛా-స్వాతంత్ర్యాలు, సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడానికి భారత్ ఎప్పుడూ ప్రయత్నించలేదని గుర్తు చేశారు. భారత ఆత్మగౌరవానికి హాని కలిగించే ప్రయత్నాలు చేస్తే మాత్రం అందుకు తగిన విధంగా బుద్ధి చెబుతామని రాజ్‌నాథ్ సింగ్ పరోక్షంగా చైనా, పాకిస్తాన్‌లను ఉద్దేశించి చెప్పారు. దేశ రక్షణ వ్యవస్థ, సైనిక శక్తి సామర్థ్యాలకు 1971 నాటి యుద్ధం ఓ నిలువెత్తు నిదర్శనమని, అది చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు.
ఆ సమయంలో అప్పటి ప్రభుత్వం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై నిర్ణయం తీసుకుని ఉంటే అది శతృదేశంతో కాకుండా భారత్‌తో విలీనమై ఉండేదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సరిహద్దులకు అవతలి వైపు నుంచి పక్కా ప్లానింగ్‌తో ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆయన పాకిస్తాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి.. దేశ సరిహద్దు రాష్ట్రాలకు మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications