మిత్రుడికే టోపీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాపారి అరెస్టు

హైదరాబాద్‌లోని బండ్లగూడలో అర్భాజ్ ట్రేడర్స్ పేరుతో ఓ షాపును నిర్వహిస్తూ దున్నపోతు కొమ్ములతో చేసిన ఒక రకమైన పలకలను ఎగుమతి చేస్తున్నాడు అతీఖ్ స్నేహితుడు మహ్మద్ అన్వర్. 2012లో లక్సెంబర్గ్ పరిశ్రమలోని తన ప్రతినిధికి పంపించాలని నమ్మించి అన్వర్ దగ్గర్నుంచి 48లక్షల రూపాయల విలువైన ఆర్డర్‌ను పంపించాడు అతీఖ్.
మొదట లక్సెంబర్గ్ పరిశ్రమలోని తన ప్రతినిధికి దున్నపోతు కొమ్ముల పలకలను పంపించాలని చెప్పి అన్వర్‌కు అతీఖ్ ఓ మెయిల్ పంపించాడు. అతీఖ్ ఆర్డర్ ప్రకారం అంతర్జాతీయ కొరియర్ సర్వీసు ద్వారా 2012 అక్టోబర్‌లో లక్బెంబర్గ్‌లోని పరిశ్రమకు సరుకును పంపించాడు అన్వర్. అయితే తాము ఆ ఆర్డర్ చేయలేదని లక్బెంబర్గ్‌లోని పరిశ్రమ వస్తువులను తీసుకునేందుకు నిరాకరించింది. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన అన్వర్ సైబరాబాద్ కమిషనరేట్‌లోని సైబర్ క్రైం విభాగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఐపిసిలోని పలు సెక్షన్లు, ఐటి యాక్ట్ కింద పోలీసులు కమిషనరేట్‌లో కేసు నమోదు చేశారు. నిందితుని కోసం విచారణ చేపట్టిన పోలీసులు ఆ మెయిల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చినట్లు గుర్తించారు. ప్రత్యేకంగా ఏర్పాటైన ఓ పోలీసుల ప్రత్యేక బృందం నిందితుని ఇంటికి వెళ్లి ఆ కంప్యూటర్‌ను సీజ్ చేసి హార్డ్ డిస్క్‌ను ఫోరెన్సిక్ పరీక్ష కోసం ఏపిఎఫ్ఎస్ఎల్‌కు పంపించారు. ఫోరెన్సిక్ పరీక్షలో నేరం రుజువుకావడంతో సోమవారం నిందితుడు అతీఖ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా అతీఖ్ కూడా అన్వర్ చేస్తున్న వ్యాపారాన్నే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్నాడు. అన్వర్ కూడా అతీఖ్ గ్రామానికి చెందినవాడే కావడం గమనార్హం. అతీఖ్ నుంచి ముడి సరుకును దిగుమతి చేసుకునే అన్వర్ గత కొంతకాలంగా ఇతర వ్యాపారస్తుల నుంచి దిగుమతి చేసుకుంటుండటతో అతీఖ్‌కు వ్యాపారంలో నష్టాలు రావడం మొదలయ్యాయి. దీంతో అన్వర్ వ్యాపారాన్ని నష్టాల్లోకి నెట్టేయాలనే ఉద్దేశంతో అతీఖ్ ఈ చర్యకు పూనుకున్నట్లు పోలీసులు తమ విచారణలో తేల్చారు.












Click it and Unblock the Notifications