ఒకరికి బదులు మరొకరిపై ఐటీ దాడులు చేశారా..? అసలు టార్గెట్ అత్తర్ వ్యాపారి కాదా..?
కాన్పూర్: ఉత్తర్ ప్రదేశ్ అత్తర్ వ్యాపారి పీయూష్ జైన్ ఇంటిపై జరిగిన ఐటీ దాడులు ఏదో పొరపాటున జరిగినవి కావని... పక్కా సమాచారం అందడం ఆ పై దర్యాప్తు చేశాకే దాడులు నిర్వహించినట్లు జీఎస్టీ ఎగవేతలను ఇన్వెస్టిగేట్ చేసే సంస్థ పేర్కొంది. గత కొన్ని రోజులుగా ఈ కాన్పూర్ అత్తర్ వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ శాఖ అతని నివాసం నుంచి రూ.196 కోట్లు నగదు మరియు 23 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
ఇక ఉత్తర్ ప్రదేశ్‌లో ఎన్నికల వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో పీయూష్ జైన్ ఇంట్లో ఇంత భారీ మొత్తంలో నగదు దొరకడంతో రాజకీయరంగు పులుముకుంది. అధికార బీజేపీ ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగారు. అత్తర్ వ్యాపారి పీయూష్ జైన్‌కు సమాజ్ వాదీ వారితో కనెక్షన్లు ఉన్నాయని బీజేపీ తమ ప్రచారంలో చెబుతుండగా... బీజేపీతోనే పీయూష్ రాసుకుతిరుగుతున్నాడంటూ సమాజ్ వాదీ పార్టీ చెప్పుకొచ్చింది.

పీయూష్ జైన్ ఈ మధ్యనే సమాజ్‌వాదీ పర్ఫ్యూమ్‌ను తీసుకొచ్చారని బీజేపీ ఆరోపించింది. ఇక కాన్పూర్‌లో పర్యటించిన ప్రధాని మోదీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కాన్పూర్‌లో ఈ మధ్యే కట్టలు కట్టలుగా కరెన్సీ నోట్లు వెలుగు చూశాయని అయితే ఇక్కడి ప్రజలకు వ్యాపారం వాణిజ్యం మధ్య తేడా బాగా తెలుసని చెప్పుకొచ్చారు. 2017కు ముందు అవినీతి అనే అత్తరును ఉత్తర్ ప్రదేశ్‌లో వెదజల్లిందని అది అంతా చూశారంటూ పరోక్షంగా సమాజ్‌వాదీ పార్టీని టార్గెట్ చేశారు ప్రధాని మోదీ. ఈ ఎపిసోడ్‌ను నిశితంగా పరిశీలిస్తోన్న కాంగ్రెస్ నేత చిదంబరం మాత్రం రెండు పార్టీలు కామెడీ చేస్తున్నాయని చెప్పారు. ఈ కామెడీ ఇక్కడితోనే ముగియదని ఇంకా కొత్త క్యారెక్టర్లు బయటకు వస్తాయంటూ సెటైర్ వేశారు.
ఇదిలా ఉంటే పీయూష్ జైన్‌తో తనను అంటగట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు పుష్పరాజ్ జైన్. రాజకీయాలు మరీ దిగజారిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దాడులు తనకోసమే చేసిఉంటారని అయితే పొరపాటున లెక్కతప్పిందని చెప్పుకొచ్చారు. అయితే ఇది పొరపాటు చేసిన సోదాలు కాదని , పక్కా సమాచారం వచ్చాకే ఫోకస్ పెట్టి దర్యాప్తు చేశాకే దాడులు చేశామని జీఎస్టీ అధికారులు వెల్లడించారు. పీయుష్ జైన్ పన్ను ఎగవేస్తున్నట్లు శిఖర్ పాన్ మసాలా గ్రూప్ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకే దర్యాప్తు చేసి ఆ తర్వాతే సోదాలు నిర్వహించినట్లు జీఎస్టీ అధికారులు తెలిపారు. పీయూష్ జైన్ అత్తర్‌కు వినియోగించే ముడిసరుకును శిఖర్ గ్రూప్‌కు సప్లయ్ చేసేవాడని, ఇందుకు క్యాష్ రూపంలోనే చెల్లింపులు చేయాల్సిందిగా పట్టుబట్టేవాడని అధికారులు తెలిపారు. ఇక ఇందులో పొరపాటు ఏముందని అధికారులు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications