ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం: చార్‌ధామ్ దేవస్థానం బోర్డు రద్దు, అర్చకుల హర్షం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చార్‌దామ్ దేవస్థానం బోర్డును రద్దు చేయాలని నిర్ణయించింది. ఉన్నతస్థాయి కమిటీ ఆధ్వర్యంలో సమస్యకు సంబంధించిన అన్ని అంశాలను అధ్యయనం చేసిన తర్వాత.. చార్‌దామ్ బోర్డు చట్టాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు.
2019లో మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ హయాంలో ఏర్పాటైన ఈ బోర్డు.. రాష్ట్ర వ్యాప్తంగా 51 దేవాలయాల వ్యవహరాలను నిర్వహించింది. వీటిలో ప్రసిద్ధ కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఆలయాలపై తమ సంప్రదాయ హక్కులను ఉల్లంఘించారంటూ.. బోర్డు ఏర్పాటుపై పూజారులు నిరసనలు చేపట్టారు. బోర్డు రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో సీఎం ధామి ఏర్పాటు చేసిన మనోహర్ కాంత్ ధ్యాని నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ.. ఈ విషయంపై అధ్యయనం చేసింది. ఇటీవల తన నివేదికను సమర్పించింది. ప్యానల్ సిఫార్సులను పరిశీలించిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.
ప్రభుత్వ తాజా నిర్ణయంపై చార్‌దామ్ పూజారులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై తమ నిరంతర ఒత్తిడి ఫలితమే తాజా నిర్ణయమని పేర్కొంటున్నారు. ఇది ఒక చారిత్రక నిర్ణయం.. భారత ప్రజాస్వామ్యంలో ఒక అపూర్వ సంఘటన అని చార్‌దామ్ తీర్థ పురోహిత్, హక్ హకూక్ ధారి మహాపంచాయత్ ప్రతినిధి బ్రజేష్ సతి అభివర్ణించారు.
తాజా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీపై మండిపడింది. బీజేపీ దురహంకార వైఖరికి మరోసారి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించే ఈ నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ నేత, రాష్ట్ర మాజీ సీఎం హరీశ్ రావత్ అన్నారు. కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications