తింటే జబ్బులే: అక్కడ పానీపూరీ అమ్మకాలపై నిషేధం విధించిన మున్సిపల్ శాఖ
సాయంకాలం సమయం... అలా పార్కు దగ్గరకు వెళితే మనకు పక్కనే కనిపించేది ఛాట్ బండి. అందులో నోరూరించే ఐటెం పానీపూరీ. బండి కనపడితే చాలు ఇక మనసు ఆగదు.. ఒకటి లేదా రెండు ప్లేట్ల పానీపూరీ లాగించాల్సిందే అన్న ఆరాటం మొదలవుతుంది. ఇక ప్రేమలో పడ్డ ప్రేమికులు ప్రియుడు ప్రియురాలకంటే ఈ పానీ పూరీలనే ఎక్కువగా ప్రేమిస్తారు... ఆ తర్వాతే వారీ లవ్ స్టోరీ. అంతలా టెంప్ట్ చేస్తాయి పానీ పూరీలు. మన దగ్గర ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లు లాగించేయొచ్చు.... మరి ఈ సోది అంతా ఎందుకు చెబుతున్నామనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నాం.
గుజరాత్‌లోని వడోదర మున్సిపల్ కార్పోరేషన్ పానీపూరీల అమ్మకంపై నిషేధం విధించింది. ఇందుకు కారణం తెలిస్తే మన తెలుగు రాష్ట్రాల్లో దొరికే పానీపూరీలపై కూడా అనుమానం వస్తుంది. వడోదరాలో పానీపూరీలు చాలా అపరిశుభ్రంగా ఉంటాయని స్వయంగా మున్సిపల్ కార్పోరేషన్ అధికారులే ధృవీకరించారు. పరిశుభ్రత లేని ప్రాంతాల్లో పానీపూరీలను తయారు చేసి... సాయంత్రం అవగానే అమ్ముతారట. అక్కడ పానీపూరీలు తిన్నవారు టైఫాయిడ్, కామెర్లు, ఫుడ్ పాయిజనింగ్ బారిన పడి ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నట్లు కార్పోరేషన్ ఆఫీస్ తెలిపింది.

వడోదర మున్సిపల్ పరిధిలో నివసిస్తున్న ప్రజలు చాలా మందికి వైరల్ ఫీవర్లు, కామెర్లు సమస్య తలెత్తడంతో అధికారులు ఆరా తీశారు. అందులో చాలామంది పానీపూరీ తిన్నాకనే ఇలాంటి వ్యాధులు వచ్చాయని చెప్పారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న మున్సిపల్ శాఖ అధికారులు పానీపూరీలు తయారీకేంద్రాలపై దాడులు చేశారు. దాడులు చేసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. కొన్ని నెలలుగా నిల్వలో ఉన్న పదార్థాలను పానీపూరీ తయారు చేసేందుకు వినియోగిస్తున్నారు. వాటిని కలిపేందుకు వాడుతున్న నీళ్లు కూడా కుల్లిపోయాయి.
మొత్తం 50 పానీపూరీ తయారీ కేంద్రాలపై దాడి చేసిన మున్సిపల్ శాఖ అధికారులు 4వేల కిలోల పూరీలు, 3500 కిలోల ఆలుగడ్డలు, బటానీ,1200 లీటర్ల పానీపూరీ నీటిని పడేసింది. మున్సిపల్ శాఖ నుంచి తదుపరి ఆదేశాలు అందేవరకు పానీపూరీలు విక్రయించకూడదని చెబుతూ నిషేధం విధించింది.












Click it and Unblock the Notifications