వసుంధరా రాజే వర్సెస్ దియా కుమారీ ? రాజస్తాన్ సీఎం పీఠం కోసం రాజకుటుంబీకుల పోటీ..
రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. విపక్షంలో ఉన్న బీజేపీ పక్కా వ్యూహాలతో అధికార కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి రాజస్తాన్ ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే రాజస్తాన్ ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీలో గట్టిపోటీ కనిపిస్తోంది. అందులోనూ ఇద్దరు రాజవంశీయులు ఇప్పుడు ఈ కీలక పదవి కోసం పోటీ పడుతున్నారు.
రాజస్దాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియాతో పాటు బీజేపీ ఎంపీ, రాజకుటుంబానికి చెందిన దియా కుమారీ కూడా సీఎం రేసులో ఉన్నారు. వీరితో పాటు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా రాజస్తాన్ సీఎం రేసులో నిలిచారు. అయితే ఇందులో మాజీ సీఎం వసుంధరా రాజేకు మాత్రం మరోసారి అవకాశం ఇవ్వడంపై బీజేపీ అధిష్టానం ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన వారిలో ఒకరికి సీఎం అవకాశం దక్కబోతోంది.

మరోవైపు రాజకుటుంబ నేపథ్యం ఉన్న రాజ్ సమంద్ ఎంపీ దియా కుమారీ కూడా రాజస్తాన్ సీఎం రేసులో ఉన్నారు. మహిళ కావడం, ఆమె రాజరిక నేపథ్యం కారణంగా వసుంధర రాజేతో పోటీ పడేందుకు ఆమెకు అవకాశం దక్కింది. గాయత్రీ దేవి మనవరాలు, సవాయ్ మాధోపూర్ మాజీ ఎమ్మెల్యే కూడా అయిన దియా కుమారి సామాజిక సేవలో పేరు తెచ్చుకున్నారు. ఆమె మొదట్లో సవాయి మాధోపూర్‌లో బయటి వ్యక్తిగా భావించినా... నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కారణంగా ఆమెకు విపరీతమైన ప్రజాదరణ లభించింది.
రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందిన దియా కుమారీని రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఘనత వసుంధరా రాజేదే. అయితే ఆ తర్వాత వసుంధర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారిద్దరి మధ్య తీవ్ర ఆస్తి వివాదం నెలకొంది. అప్పటి నుంచీ వీరిద్దరి మధ్య వైరం సాగుతోంది. అయితే ఇప్పుడు బీజేపీకి వసుంధరా రాజేకు సీఎం పదవి ఇవ్వడం ఇష్టం లేకపోతే దియాకుమారిని పరిగణనలోకి తీసుకోవచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications