దటీజ్ విజయ్..! ప్రియాంక అడగ్గానే ఏమాత్రం కాదనకుండా..!
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ (Vijay) తాను ఎంత పెద్ద స్ధానంలో ఉన్నా సామాన్యులకు మాత్రం అందుబాటులోనే ఉంటానని మరోసారి నిరూపించారు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా చిన్న వ్యక్తులతో సైతం కలిసిపోయేందుకు ఏమాత్రం సంకోచించరు. అలాంటిదే మరో ఘటన తాజాగా చోటు చేసుకుంది. దీనికి నిన్న ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుస్తకావిష్కరణ కార్యక్రమం వేదికగా నిలిచింది.
తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ ది బిలాంగింగ్ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ, సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ.. విజయ్ ను ఆప్యాయంగా పలకరించారు. ఆమెతో పాటు తీసుకొచ్చిన తన ఇంట్లో 22 ఏళ్లుగా పనిచేస్తున్న ఓ మహిళను తీసుకొచ్చారు. ఆమెను విజయ్ కు పరిచయం చేశారు. అంతే కాదు ఆమెకు విజయ్ తో ఫొటో దిగాలన్నది ఆ మహిళ చిరకాల కోరిక అని ప్రియాంక గాంధీ తెలిపారు. దీంతో విజయ్ కూడా కాదనలేదు.

ప్రియాంక గాంధీ అభ్యర్థనను మన్నించిన ముఖ్యమంత్రి విజయ్.. ఆ మహిళతో కలిసి ఫోటోకు పోజులిచ్చి, ఆమె యోగక్షేమాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా విజయ్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ముఖ్యమంత్రి స్ధాయిలో ఉండి కూడా ఓ సాధారణ పని మనిషితో ఫొటో దిగేందుకు, యోగ క్షేమాలు అడిగేందుకు సంకోచించని విజయ్ తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ప్రశంసలు అందుకుంటోంది. గతంలో పలుమార్లు నేతల ఇళ్లకు వెళ్లినప్పుడు వారి ఇళ్లలో పనిచేసే వారితో ఫొటోలు దిగేందుకు ఏమాత్రం సంకోచించలేదు. దీంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ప్రియాంక గాంధీ ఇంట్లో పని మనిషి విషయంలో మరోసారి అది నిరూపితమైంది. తన అభిమాన హీరో విజయ్ తనతో ఫొటో దిగడంతో ఆ మహిళ ఆనందం వ్యక్తం చేస్తోంది.














Click it and Unblock the Notifications
