విజయ్ యూ టర్న్.. వివాదాస్పద జీవో రద్దు చేస్తూ ఆర్డర్స్
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారానికి దారితీసిన ఒక కీలక నిర్ణయంపై విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సమాచార హక్కు చట్టం పరిధి నుంచి పబ్లిక్ (లా అండ్ ఆర్డర్) శాఖను తప్పిస్తూ కొద్ది రోజుల క్రితం జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వులను ప్రభుత్వం అధికారికంగా రద్దు చేసింది. దీనివల్ల ప్రజలకు ఎలాంటి సమాచార హక్కు కోల్పోయే ప్రమాదం లేకుండా మళ్లీ పాత పద్ధతే కొనసాగనుంది. తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ యూ-టర్న్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
నిర్ణయం వెనక అసలు వివాదం ఏంటి?
ఆర్టీఐ చట్టం-2005 లోని సెక్షన్ 24(4) ప్రకారం పబ్లిక్ (లా అండ్ ఆర్డర్) శాఖను ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్‌గా పేర్కొంటూ తమిళనాడు ప్రభుత్వం ఇటీవల జీవో నెం. 57 ను జారీ చేసింది. ఈ శాఖ పరిధిలోకి పోలీసు కాల్పులు, కస్టడీ మరణాలు, చిత్రహింసల విచారణ నివేదికలు వంటి అత్యంత కీలకమైన అంశాలు వస్తాయి. ఒకవేళ ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటే, లా అండ్ ఆర్డర్ విభాగానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సాధారణ ప్రజలు ఆర్టీఐ ద్వారా అడిగి తెలుసుకునే అవకాశం ఉండేది కాదు. ఈ నిబంధనపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి.

ప్రజా వ్యతిరేకతే కారణం.. వెనక్కి తగ్గిన ప్రభుత్వం
ఈ నిర్ణయంపై సీపీఎం ఎంపీ వెంకటేశన్, కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరంతో పాటు పలువురు ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది తమిళనాడును 'పోలీస్ స్టేట్'గా మార్చే కుట్ర అని, ప్రజాస్వామ్య జవాబుదారీతనానికి ఇది విఘాతమని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో తెచ్చిన ఆర్టీఐ చట్టాన్ని బలహీనపరిచేలా ఇలాంటి నిర్ణయాలు ఉండకూడదని హితవు పలికారు. ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అసంతృప్తిని, వ్యతిరేకతను గమనించిన టీవీకే ప్రభుత్వం.. ప్రజాభావాలకు గౌరవం ఇస్తూ ఆ ఉత్తర్వులను తక్షణమే వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
ప్రభుత్వ వివరణ, మంత్రుల స్పందన
ఈ నిర్ణయంపై తొలుత వివరణ ఇచ్చిన టీవీకే మంత్రులు సీటీఆర్ నిర్మల్ కుమార్ , రాజ్ మోహన్.. సమాచార హక్కు చట్టాన్ని పూర్తిగా ఎత్తేయలేదని, కేవలం వర్గపోరాటాలు, కొన్ని సున్నితమైన శాంతిభద్రతల అంశాలకు మాత్రమే మినహాయింపు ఇవ్వాలని భావించామని తెలిపారు. భావప్రకటన స్వేచ్ఛకు ఎక్కడా భంగం కలగకుండా పారదర్శక పాలన అందిస్తామని స్పష్టం చేశారు. ఏదేమైనప్పటికీ, ప్రజల నుంచి వచ్చిన తీవ్ర నిరసనల కారణంగా ప్రభుత్వం క్షణాల వ్యవధిలోనే పునరాలోచించి ఈ వివాదానికి తెరదించింది.














Click it and Unblock the Notifications
