కామరాజర్ అల్పాహార పథకం, బడి పిల్లలతో కలిసి సీఎం విజయ్ బ్రేక్ ఫాస్ట్
తమిళనాడు పాఠశాల విద్యారంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. బడికి వచ్చే పేద చిన్నారుల ఆకలి బాధలను తీర్చి, వారి చదువుకు కొండంత అండగా నిలిచే ఉచిత అల్పాహార పథకాన్ని ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్ మరింత విస్తరించారు. చెన్నై తిరువాన్మియూర్‌లోని గాంధీ గ్రామం ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో నిర్వహించిన పండుగ లాంటి వాతావరణంలో సీఎం విజయ్ ఈ విస్తరించిన కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ, చిన్నారుల మధ్య కూర్చుని స్వయంగా అల్పాహారాన్ని వడ్డించారు. పసిపిల్లల మొహాల్లో వెల్లివిరిసిన నవ్వులు, సీఎం ప్రేమగా వడ్డిస్తున్న దృశ్యాలు తమిళనాడు వ్యాప్తంగా విశేషంగా ఆకట్టుకున్నాయి
నుండి 8వ తరగతి వరకు ఉచిత అల్పాహారం.. 15 లక్షల మందికి లబ్ధి!
ఇప్పటివరకు 1 నుంచి 5వ తరగతి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మాత్రమే పరిమితమైన ఈ ఉచిత అల్పాహార పథకాన్ని, ఇప్పుడు 6 నుంచి 8వ తరగతి చదువుతున్న మాధ్యమిక విద్యార్థులకు కూడా విస్తరిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ సరికొత్త నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15,454 ప్రభుత్వ, ప్రభుత్వ ఆధారిత (ఎయిడెడ్) పాఠశాలల్లోని సుమారు 15.30 లక్షల మంది అదనపు విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. బడిపిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించి, వారి హాజరు శాతాన్ని పెంచడంతో పాటు చదువుపై శ్రద్ధ వహించేలా రూపుదిద్దిన ఈ పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
అదనంగా రూ. 217 కోట్లు కేటాయింపు.. 'కామరాజర్' పేరుతో కొంగొత్త రూపం!
ఈ బృహత్తర కార్యక్రమ విస్తరణ కోసం తమిళనాడు ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ. 217.63 కోట్ల నిధులను కేటాయించింది. దీనితో ఈ అల్పాహార పథకానికి మొత్తం బడ్జెట్ భారీగా పెరిగి రూ. 724 కోట్లకు చేరింది. గతంలో 'ముఖ్యమంత్రి అల్పాహార పథకం'గా ఉన్న దీనికి.. తమిళనాడులో పేద పిల్లలకు బడిబాట పట్టించి మధ్యాహ్న భోజన పథకానికి ఆద్యుడిగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి కె. కామరాజ్ జ్ఞాపకార్థం 'పెరుంతలైవర్ కామరాజర్ ఉచిత అల్పాహార పథకం'గా నామకరణం చేశారు. ఉప ఎన్నికల కోడ్ అమలులో ఉన్న చెంగల్పట్టు, తిరుప్పూర్ జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ పథకం విస్తరణ తక్షణమే అమలులోకి వచ్చింది.














Click it and Unblock the Notifications
