నాకు న్యాయం జరగదు, అందుకే: రాజ్యసభకు మాల్యా రాజీనామా
న్యూఢిల్లీ: బ్యాంకులకు రుణాలను ఎగవేసిన కేసును ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్త విజయ మాల్యా సోమవారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. రాజ్యసభ నైతిక విలువల కమిటీ సమావేశమై, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేయడానికి ఒకరోజు ముందు ఈ నిర్ణయం తీసుకున్నాడు.
తన పేరు ప్రతిష్టలకు మరింత బురద అంటించడం ఇష్టం లేకనే ఈ చర్య తీసుకున్నట్లు రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖ పంపాడు. ఈ సందర్భంగా మాల్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన పేరు, ప్రతిష్ఠలపై మరింత రొంపిలోకి లాగదల్చుకోలేదన్నాడు.
ఈ మధ్య చోటుచేసుకున్న వరుస సంఘటనలు, పరిణామాలను బట్టి చూస్తే భారత్‌లో తనకు న్యాయం లభిస్తుందన్న నమ్మకం లేదని రాజీనామా లేఖలో మాల్యా పేర్కొన్నాడు. అందుకే తన పార్లమెంట్ సభ్యత్వానికి తక్షణమే అమలులోకి వచ్చేలా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించాడు.

రాజ్యసభ ఎథిక్స్ కమిటీ చైర్మన్ కరణ్ సింగ్ తనకు లేఖ రాశాడని, ఆ లేఖకు జవాబిచ్చినట్లు మాల్యా రాజీనామా లేఖలో ప్రస్తావించారు. రాజ్యసభ ఎంపీగా ఎన్నికవడం మాల్యాకిది వరుసగా రెండోసారి. రాజీనామా చేయకపోయి ఉంటే మాల్యా పదవీకాలం జూలై 1తో ముగిసి ఉండేది.
గతనెల 25న సమావేశమైన ఎథిక్స్ కమిటీ.. ఈ నెల 3న సమావేశమై మాల్యా సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ సభకు సిఫారసు చేయాలని నిర్ణయించింది. ఈ వారం గడువులో సభ్యత్వ రద్దుపై తన వాదనను విన్పించుకునే అవకాశమిచ్చింది. కానీ ఆయనే స్వయంగా రాజీనామా సమర్పించాడు.
రెండు టర్మ్‌ల్లోనూ తనకు సహకరించిన సహ సభ్యులతోపాటు రాజ్యసభ చైర్మన్‌కు రాజీనామా లేఖలో మాల్యా ధన్యవాదాలు తెలిపారు. కరణ్ సింగ్‌కు రాసిన జవాబు లేఖను సైతం రాజీనామా పత్రానికి జత చేస్తూ ఫ్యాక్స్ చేశాడు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అబద్ధాలని, నిరాధారమైనవన్నాడు. ఆర్థిక సేవల విభాగం, ఆర్థిక శాఖ, కేంద్ర ప్రభుత్వం కూడా తనపై పార్లమెంట్ కమిటీకి తప్పుడు సమాచారం ఇవ్వడం షాక్ గురి చేసిందన్నారు.












Click it and Unblock the Notifications