విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ: పాల సముద్రంలా కనువిందు చేస్తున్న పొగమంచు, ఇక్కడే ఎందుకిలా ఏర్పడుతోంది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వంజంగి వద్ద ఏర్పడిన పాలసముద్రం

అందమైన బీచ్‌లు, పార్కులు, వలిసె పువ్వులు, జలపాతాలు చూసేందుకు ఇంతకుముందు విశాఖకు టూరిస్టులు వచ్చేవారు. కానీ ఇప్పుడు పాల సముద్రాల్ని చూసేందుకు పర్యటకులు తరలి వస్తున్నారు.

విశాఖ సమీపంలోని గిరి శిఖరాలపై పాలసముద్రంలా కనిపించే పొగమంచును చూసేందుకు వందల సంఖ్యలో టూరిస్టులు వస్తున్నారు. ఈ అందాల్ని చూసేందుకు కిలోమీటర్ల మేర కొండల్ని ట్రెక్కింగ్ చేస్తున్నారు.

కొండల మధ్య పొగమంచు మేఘాలను చూసేందుకు ప్రకృతి ప్రేమికులు ఆసక్తి చూపుతున్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లోనే కాకుండా నగరంలో కూడా ఈ తరహా ప్రకృతి అందాలు కనిపిస్తున్నాయి.

లంబసింగితో మొదలై...

విశాఖలో ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలైన అరకు, పాడేరు, చింతపల్లితో పాటు సిటీలో కూడా అనేక టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి. ఏటా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకూ విశాఖకు వివిధ ప్రాంతాల నుంచి టూరిస్టులు వస్తుంటారు.

ముఖ్యంగా ఒడిశా, వెస్ట్ బెంగాల్, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి టూరిస్టులు వస్తుంటారు. వారు ఈ పొగమంచును చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

“పదేళ్ల క్రితం చింతపల్లి వెళ్లినప్పుడు లంబసింగి మీదుగా వెళ్లాం. అప్పటికే అక్కడ అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేపర్లో వార్తలు చూడటంతో కాసేపు అక్కడ ఆగాం. అక్కడ వాతావరణం బాగా ఎంజాయ్ చేశాం. తాజాగా సమీపంలోని చెరువుల వేనం కొండపైకి వెళ్లాం. ఆ దృశ్యాలు చూడటమే కానీ...చెప్పడానికి మాటలు చాలవు" అని విశాఖ ఆర్టీసీలో పని చేస్తున్న రామనారాయణ అన్నారు.

"అవి మేఘాలో, మంచు తెరలో తెలియదు కానీ క్యూలో నిలబడినట్లు ఉన్న తెల్లని మేఘాల వరుసను చూస్తే కంటి ముందు పాలసముద్రమే కనిపిస్తున్నట్లు అనిపించింది. నేను సోషల్ మీడియాలో వీడియోలు చూశాను. వచ్చే ఏడాది కుటుంబంతో సహా ఆ ప్రదేశాలకు వెళ్తాను” అని ఆయన అన్నారు.

తెల్లని రంగులో కనిపించే మేఘాలను చూసి టూరిస్టులు మైమరచి పోతున్నారు.

'రాత్రికి పాడేరు...వేకువజామున వంజంగి’

పాడేరులో ఉన్న వంజంగి కొండను పాల సముద్రం అని పిలుస్తున్నారు. చెరువుల వేనం తర్వాత ప్రచారంలోకి వచ్చిన ఈ పొగమంచు కొండకు పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉంది.

పాడేరుకు పది కిలోమీటర్ల దూరంలోనే ఉండటం, ట్రెక్కింగ్ కూడా ఎక్కువగా చేయవలసిన అవసరం లేకపోవడంతో వంజంగికి పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తున్నారు.

ఇక్కడ గిరి శిఖరాలను తాకుతూ అలుముకున్న దట్టమైన పొగమంచు...పాలసముద్రాన్ని తలపించే విధంగా ఉండటంతో ఇక్కడకు వచ్చే వారి సంఖ్య పెరిగింది.

శీతాకాలం సమయంలో అరకు ప్రాంతానికే టూరిస్టులు ఎక్కువగా వెళ్తుంటారు. అక్కడ వలిసె పువ్వులు, పద్మావతి గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, బొర్రా కేవ్స్ వంటి టూరిస్టు స్పాట్లు ఉన్నాయి. పాడేరుకు సాధారణంగా టూరిస్టులు ఎక్కువగా రారు.

కానీ వంజంగి కొండపై మేఘాలు పాలసముద్రం వలె కనిపిస్తున్నాయంటూ వీడియోలు హాల్‌చల్ చేయడంతో ఇక్కడికి టూరిస్టుల రాక మొదలైంది.

"గత మూడు నెలలుగా పాడేరులో లాడ్జ్‌లో రూం దొరకడం కూడా కష్టంగానే ఉంది. రాత్రి ఎనిమిదైతే చాలు ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు పాడేరుకు వస్తున్నారు. తెల్లవారు జామున మూడు గంటలకే లేచి వంజంగి కొండకు బయలు దేరుతున్నారు. మళ్లీ 11 గంటలకు పాడేరు ఖాళీ అయిపోతోంది” అని పాడేరులో హోటల్ నిర్వహిస్తున్న కిల్లో జోషి చెప్పారు.

'5800 అడుగుల ఎత్తులో...త్రివర్ణ పతాకం’

చెరువుల వేనం, వంజంగి తరహాలోనే ఏజెన్సీలోని హుకుంపేట మండలం ఓలుబెడ్డ గ్రామ పరిధిలోని కొండపై మేఘాలు నిత్యం కనువిందు చేస్తున్నాయి. ఈ కొండ సముద్రమట్టానికి 5,800 అడుగులు ఎత్తులో ఉంది. ఉత్తరాంధ్రలో అత్యంత ఎత్తైన కొండ ఇదేనని చెబుతారు.

ఈ కొండపైకి చేరుకోవాలంటే ఆరు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. అక్కడికి చేరుకోగానే త్రివర్ణపతాకం రెపరెపలాడుతూ స్వాగతం పలుకుతుంది. అక్కడ నిలబడి ఎటు చూసినా మేఘాల వరుసలే కనిపిస్తాయి. ఈ కొండను స్థానికులు జెండాకొండ అంటారు.

“వంజంగి, చెరువులవేనం గత నెలలో చూశాం. ఇప్పుడు ఈ కొండను చూసేందుకు వచ్చాం. మిగతా వాటితో పోలిస్తే ఈ కొండపైకి చేరడానికి ఎక్కువ సమయం పట్టింది. మేఘాల కొండ అని తెలిసి వచ్చాం. ముందు చూసిన వాటి కంటే ఇది బెటర్ ప్లేస్” అని టూరిస్ట్ చందు చెప్పారు.

జమీందార్లు, సంస్థానాలు, బ్రిటిషర్లు అంతా కూడా ఈ కొండపై తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారని తన పూర్వీకులు చెప్పినట్లు ఆయన వెల్లడించారు.

''ఇక్కడ నుంచి చూస్తే దిగువ ప్రాంతమంతా స్పష్టంగా కనిపిస్తుండటంతో ఇక్కడకు వచ్చి వారు బస ఏర్పాటు చేసుకుని రోజుల తరబడి ఇక్కడే ఉండేవారని...వారు ఉన్నారనేందుకు గుర్తుగా ఒక జెండా ఎగురవేసేవారని...అందుకే ఈ ప్రాంతాన్ని జెండాకొండ అంటారని చెప్పేవాళ్లు’’ అని చందు వెల్లడించారు.

"ప్రస్తుతం దీనిపై జాతీయ జెండా మేమే ఎరగవేశాం. ఈ జెండా కొండ, ఇక్కడ మేఘాలను చూసేందుకు హైదరాబాద్, విశాఖపట్నం నుంచి నిత్యం టూరిస్టులు వస్తూనే ఉన్నారు. ఈ కొండ కారణంగా మారుమూల ఉన్న మా గ్రామానికి నిత్యం టూరిస్టులు రావడం ఆనందంగా ఉంది” అని ఓలుబెడ్డ గ్రామవాసి జానకిరామ్ అన్నారు.

జెండా కొండ మీద త్రివర్ణ పతాకం

ఆధ్మాత్మికతకు పర్యటకం బోనస్

పాలసముద్రాన్ని తలపించే ఈ మేఘాల వరుసలు ఇప్పటి వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే కనిపించేవి. వాటిని చూసేందుకు టూరిస్టులు ముందు రోజు రాత్రే ఆ ప్రాంతాలకు చేరుకుని బస చేసి వేకువజామున సూర్యోదయం, కాలు దగ్గరి వరకు చేరే మేఘాలను చూసేవారు.

అయితే ఇప్పుడు అంత ప్రయాస లేకుండా నగరంలో ఉన్న సింహాచలం కొండపై కూడా ఈ పాలసముద్రాన్ని తలపించే విధంగా పొగమంచు ఏర్పడుతోంది. దీంతో ఇక్కడికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక యాత్రకు బోనస్‌గా పొగమంచు అందాలు కనువిందు చేస్తున్నాయి.

“వంజంగి, లంబసింగి వంటి ప్రాంతాలను చూడలేకపోయినా...అలాంటి ప్రదేశాల్నే నగరంలో చూడటం ఆనందంగా ఉంది. సింహాచలం ఎన్నోసార్లు వచ్చాం. మంచు ఎక్కువగా పడటం చూశాం కానీ...ఇలా పాల సముద్రంలా కనిపించే దృశ్యాల్ని మాత్రం చూడలేదు" అని అరుణ అనే భక్తురాలు తెలిపారు.

ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి పాలసముద్రం వంటి పొగమంచు అందాలను చూడలేకపోయామని అనుకునేవాళ్లం. ఇప్పుడు నగరంలోనే అదే తరహా పాల సముద్రాన్ని చూడడంతో ఎంతో ఆనందంగా ఉంది. దేవుడి దర్శనానికి వచ్చాం. ఇక్కడ పొగమంచు చూడటంతో సెలవుల్లో మంచు ప్రదేశానికి వెళ్లిన అనుభూతి కలుగుతుంది” అని ఆమె అన్నారు.

ఉదయం కనిపించే ఈ మేఘాలను చూసేందుకు తెల్లవారుజామున 3 గంటలకే టూరిస్టులు ట్రెక్కింగ్‌కు బయలుదేరుతున్నారు

'గోల చేస్తే పాలసముద్రంలో పడేస్తా’

విశాఖ ఏజెన్సీలోని కొండల మధ్య కనిపిస్తున్న పాలసముద్రాల లాంటి అద్భుత దృశ్యాలను తాము ఎప్పుడూ చూడలేదని...ఇక్కడ తీసుకున్న ఫొటోలు, పొందిన ఆనందం జీవితకాల జ్ఞాపకాలంటూ టూరిస్టులు చెప్తున్నారు.

స్థానిక గిరిజనులు మాత్రం చిన్నతనం నుంచి ఇలాంటివి చూస్తూనే ఉన్నామని అంటున్నారు.

“ఇప్పుడు నా వయసు 54 ఏళ్లు. నేను నా జీవితంలో ఎక్కువ సమయం ఈ కొండపైనే గడిపాను. మా నాన్న కూడా ఇక్కడే మేకలు కాయడం, పొలం పనులు చేసేవారు. అప్పుడు నేను ఈ కొండపైనే నిత్యం ఆడుకునేవాడ్ని. అప్పుడు కూడా ఇలాగే పాలసముద్రంలాగే కనిపించేది.

నిజానికి అప్పుడే ఎక్కువ కనిపించేది. ఇప్పుడు అంత ఎక్కువ రావడం లేదు. అయినా కూడా వీటిని చూసేందుకు టూరిస్టులు ఎక్కడెక్కడ నుంచో రావడం మాత్రం ఆశ్చర్యంగా ఉంది. మా దగ్గర అప్పట్లో సెల్ ఫోన్లు లేకపోవడంతో వీటిని షూట్ చేయలేకపోయాం. లేకపోతే నేను నలభై ఏళ్ల క్రితమే వీటిని అందరికి చూపించేవాడిని. నేను గోల చేస్తే మా నాన్న ఆ మేఘాల్లో, అదేనండీ పాలసముద్రంలో పడేస్తానని భయపెట్టేవారు” అని ఓలుబెడ్డ గ్రామవాసి కొండలరావు చెప్పారు.

టెంట్లు, క్యాంప్ ఫైర్‌తో కల్పించే పనులతో స్థానికులకు ఉపాధి దొరుకుతోంది

ఉపాధి దొరికింది

పేరు ఏదైనా పొగమంచు మేఘాలు ఇప్పడు విశాఖ టూరిజానికి అదనపు ఆకర్షణగా మారాయి. టూరిస్టులు అంతా కొండకు దిగువ భాగంలోనే రాత్రుళ్లు గడిపి...వేకువజామునే లేచి కొండపైకి ట్రెక్కింగ్ చేస్తున్నారు.

“వంజంగి వంటి అద్భుతమైన ప్రదేశాన్ని చూసేందుకు టూరిస్టులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వారికి బస, ఆహారం ఏర్పాటు చేస్తూ స్థానికులం ఉపాధి పొందుతున్నాం. గతేడాది, ఈ ఏడాది కూడా మంచి వ్యాపారం సాగింది.

టెంట్లు అద్దెకు ఇవ్వడం, వారికి కావలసిన ఫుడ్ ఏర్పాటు చేయడం, క్యాంప్ ఫైర్లు వేయడం, వారి వాహనాలను భద్రంగా చూడటం ఇలా రకరకాలైన పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నాం” అని వంజంగి కొండపై టెంట్లను ఏర్పాటు చేసే రామూర్తి చెప్పారు.

విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద

'అది పాలసముద్రం, మేఘాల పల్లకి కాదు’

విశాఖలో పలు చోట్ల పాలసముద్రాల్ని తలపించే విధంగా ఏర్పడుతున్న ఈ పొగమంచును పాలసముద్రం, మేఘాల పల్లకి, మేఘాల వరుస అని పిలుస్తున్నారు. ఈ తరహా పొగమంచు సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి వరకు కనిపిస్తుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు.

ఇలా పొగమంచు అంతా ఒకే చోట చేరి పాలసముద్రాల్లా కనిపించడం కొత్తకాదంటున్నారు వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద. ఈ పొగమంచు ఏర్పడటానికి గల కారణాలను ఆమె వివరించారు.

“ఈ తరహా పొగమంచు స్థానిక వాతావరణ సర్ధుబాట్లు కారణంగా ఏర్పడుతుంది. ఇది కొత్తేమీ కాదు, కాకపోతే టూరిస్టు స్పాట్లు ఉన్న ప్రదేశాల్లో ఈ పొగమంచు కనపడటంతో చూసేవారు ఆకర్షితులవుతున్నారు. ఇంతకు ముందు ఇది ఏజెన్సీ ప్రాంతాల్లోనో, గ్రామీణ ప్రాంతాల్లోనే కనిపించేది. ఇప్పుడు నగరంలో కూడా ఇలాంటివి ఏర్పడుతున్నాయి” అని సునంద తెలిపారు.

మంచులో సింహాచలం కొండ

“సముద్రం నుంచి భూమి మీదకు వీచే తేమతో కూడిన గాలులు సాధారణంగా వేడిగా ఉంటాయి. ఈ గాలులు ఎప్పుడైతే చల్లటి ప్రాంతాలకు చేరుకుంటాయో...అంటే కొండ ప్రాంతాలను చేరుకోగానే తేమ అంతా కూడా అతి సూక్ష్మ నీటి బిందువుల్లా మారిపోతుంది. అప్పుడు వాటిలోని నీటి అణువులు ఒకదానినొకటి పట్టుకుని ఉండటం వలన కదలకుండా ఒకే చోట ఉంటూ మేఘాల వరుసలా కనిపిస్తాయి” అన్నారామె.

“నిజానికి ఇది పొగమంచు. ఈ పొగమంచు సూర్యోదయం సమయంలో బాగా ఎక్కువగా ఉండి, సమయం గడుస్తున్న కొద్ది తగ్గిపోతూ ఉంటుంది. అందుకే ఈ పాలసముద్రం వంటి దృశ్యం వేకువ జామున కొండపై కనిపిస్తుంది. సింహాచలం చుట్టూ కూడా కొండలు ఉండటం, విశాఖ అంతా కూడా ఎక్కువగా కొండలే ఉండటంతో పాలసముద్రాన్ని తలపించే పొగమంచు తరచూ కనిపిస్తుంది” అని సునంద వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Visakha: The fog that lingers like a sea of milk, why is it forming here
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X