విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
విశాఖ సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం

విశాఖ సముద్ర తీరంలో ఆ యుద్ధ విమానాన్ని చూసిన వారికి ఉన్నఫళంగా ఎయిర్‌ఫోర్స్‌లో చేరిపోవాలన్న ఉద్వేగం కలుగుతుంది. దశాబ్దాలుగా భారత సైన్యంలో పని చేసిన ఆ విమానం ఇప్పుడు ఒక మ్యూజియంలా మారి, తన గత వైభవాన్ని నేటి తరానికి అందిస్తోంది.

భారత నౌకదళంలో ఒక యుద్ధ విమానం 30 వేల గంటలు ప్రయాణించి 29 ఏళ్ల పాటు సేవలందించింది. టర్బో ప్రొపెల్లర్ ఇంజన్లతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించగల యుద్ధ విమానం ఇది.

మూడు దశబ్ధాల సేవల్లో కనీసం చిన్న ప్రమాదానికి గురవకుండా నిరాటంకంగా సేవలందించిన ఈ యుద్ధ విమానం పేరు టీయూ-142. రష్యా నుంచి భారత ప్రభుత్వం ఈ యుద్ధ విమానాన్ని కొనుగోలుచేసింది. ఈ విమానం 1988 నుంచి 2017 వరకు నావికాదళంలో సేవలందించింది.

2017లో రక్షణ దళ సేవల నుంచి విరమణ పొంది విశాఖ సాగర తీరంలో మ్యూజియంగా కొలువుదీరింది. దీనిని కురుసుర జలాంతర్గామికి ఎదురుగానే ఏర్పాటు చేశారు. దేశంలోనే తొలి యుద్ధ విమాన మ్యూజియం టీయూ-142.

ఎయిర్ క్రాప్ట్ 7 విభాగాలుగా పని చేస్తుంది

ఈ యుద్ధ విమానం ఒక అద్భుతం

సాధారణంగా ఆకాశంలో ఎగురుతున్న విమానాలను చూస్తుంటాం. పాసింజర్ విమానాలను అయితే లోపలికి ఎక్కి చూసే అవకాశం ఉంది. కానీ, యుద్ద విమానాన్ని చూసే చాన్స్ దక్కడం చాలా అరుదు.

నిజంగా యుద్ధ విమానం లోపల ఎలా ఉంటుంది? సిబ్బంది ఎలా పని చేస్తారు? శత్రు స్థావరాలపై దాడులెలా చేస్తారు? వంటి ఆసక్తికర అంశాలు టీయూ-142 యుద్ధ విమాన మ్యూజియం సందర్శించి తెలుసుకోవచ్చు.

"యుద్ధ విమానాల కోసం సామాన్య ప్రజలు తెలుసుకునేందుకు టీయూ-142 మ్యూజియం అవకాశం కల్పిస్తోంది. దేశానికి విశేష సేవలందించిన ఈ యుద్ధ విమానం లాంగ్‌ రేంజ్‌ మారిటైమ్‌ పెట్రోలింగ్ విమానం. ఇది గంటకు 800 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించగలదు.

కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు నౌకలను, సబ్‌మెరైన్లను సైతం తన నిఘా కళ్లతో గుర్తించే ఈ విమానం ఆకాశంలో 39వేల అడుగుల ఎత్తు వరకు ఎగురుతుంది. ఆగకుండా 16 గంటల పాటు ప్రయాణిస్తుంది.

52 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు , 14 మీటర్ల ఎత్తు ఉండే ఈ విమానంలో ఏడు జోన్లు ఉండగా, ఒక్కో జోన్‌ ఒక్కో విభాగంగా పని చేస్తుంది. ఈ యుద్ధ విమానం తల నుంచి తోక భాగం వరకూ అన్నీ ప్రత్యేకతలే." అని యుద్ధ విమాన మ్యూజియం క్యూరేటర్ దిలీప్ కుమార్ బీబీసీతో చెప్పారు.

విశాఖ సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం
టీయూ-142 యుద్ధ విమానం

అత్యంత బరువైన, వేగవంతమైన విమానం

ఈ ఎయిర్ క్రాప్ట్ 7 విభాగాలుగా పని చేస్తుంది. ప్రస్తుతం ఆ ఏడు విభాగాలకు సందర్శకుల సౌకర్యార్థం పేర్లు పెట్టి చూపిస్తున్నారు. యుద్ధ విమాన లాబీ నుంచి మొదటి జోన్‌లో ప్రవేశించిన తరువాత హెరిటేజ్ జోన్‌లో యుద్ధ విమాన చరిత్ర, ట్రైనింగ్‌ జోన్‌లో యుద్ధాలకు సంబంధించి శిక్షణ, ఎక్విప్‌మెంట్‌ జోన్‌లో యుద్ధ విమాన సామగ్రి చూడొచ్చు.

ఆడియో విజువల్ జోన్‌లో యుద్ధ విమానం మొత్తాన్ని 10నిముషాల్లో వివరిస్తారు.

అలాగే రక్షణ రంగంలో ఇచ్చే వివిధ అవార్డుల ప్రదర్శన మోడల్‌ జోన్‌లో ఉంటుంది. అలాగే యుద్ధ విమానాల్లో ఉండే పైలట్, అబ్జర్వర్‌, నావిగేటర్‌, ఇంజినీరు, సిగ్నలర్‌, గన్నర్‌ వంటి సిబ్బంది బొమ్మలను కూడా ఏర్పాటు చేశారు.

"టీయూ142 యుద్ధ విమానాన్ని రష్యాకి చెందిన ఆర్మీ ఆఫీసర్, ఏరోనాటికల్ ఇంజనీరైన ఆండ్రీ తుపోలోవ్ డిజైన్ చేశారు. దీనితో పాటు తుపోలోవ్ అనేక యుద్ధ విమానాలను కూడా తయారు చేశారు.

అందుకే ఆయన తయారు చేసిన అన్ని విమానాలను టీయూ ఫ్యామిలి వార్‌ ఫ్లైట్స్‌గా పిలుస్తారు.

టర్బో ప్రొపెల్లర్ ఇంజన్లు ఉన్న యుద్ధ విమానాల్లో ఇది ప్రపంచంలోనే అత్యంత బరువైనది. అలాగే వేగవంతమైనది కూడా. ఖాళీ ఎయిర్ క్రాప్ట్ బరువు 85వేల కేజీలు. లక్ష లీటర్ల ఆయిల్‌ నింపుకున్న తరువాత దీని బరువు దాదాపు 1 లక్ష 95 వేల కేజీలు.

దీనిలో 8 టర్బో ప్రొపెల్లర్ ఇంజన్లు ఉంటాయి. ఇది గంటకు 800 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది. దేశ రక్షణ కోసం 30 వేల గంటలు పని చేసినా, కనీసం చిన్న ప్రమాదానికి కూడా గురికాకపోవడం దీని మరో ప్రత్యేకత.

ఇది యాంటీ సబ్ మెరైన్ నిఘాలో ఉంటూ నీటి లోపల ఉండే అత్యంత సునిశితమైన శబ్ధాలను కూడా పసిగట్టగలదు. 16 గంటలు ఏకబిగిన పని చేసే టీయూ-142 ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ పరాక్రమ్‌లతో పాటు శ్రీలంక, మాల్దీవులలో నిఘా కార్యకలాపాల్లో పాల్గొంది.

ఈ యుద్ధ విమానంలో నేవీ తరపున గోవాలోని ఐఎన్ఎస్ రాజాలిలో పని చేసి 29 ఏళ్ల తర్వాత విరమణ పొంది ప్రస్తుతం మ్యూజియంగా సేవలందిస్తోంది." అని టీయూ-142 మ్యూజియం అసిస్టెంట్ క్యూరేటర్ నరసింహరావు బీబీసీతో చెప్పారు.

టీయూ-142 యుద్ధ విమానం
టీయూ-142 యుద్ధ విమానం

సోనోబాయ్...బ్లాక్ బాక్స్‌లే కీలకం

ఆకాశంలో ఎగిరే ఈ విమానం సముద్ర గర్భంలో ఉన్న సబ్‌ మెరైన్లను ఎలా గుర్తిస్తుంది ? దానిని ఎలా నాశనం చేయగలుగుతుంది ? అనే విషయం ఆసక్తికరం. సముద్రంలోని శబ్ధాలను గుర్తించేందుకు విమానంలో వాడే టెక్నాలజీ ఏంటన్నది తెలుసుకునేందుకు సందర్శకులు సోనోబాయ్, బ్లాక్‌బాక్స్‌ల గురించి అడుగుతుంటారు.

"టీయూ-142 యుద్ధ విమానంలో కీలకమైనవి సోనోబాయ్, బ్లాక్‌ బాక్స్. సందర్శకులు కూడా వీటినే ఎక్కువ ఆసక్తిగా చూస్తూ అనేక ప్రశ్నలు అడుగుతుంటారు. ఈ వార్‌ ఫ్లైట్‌లో ఈ రెండు పరికరాలు కీలకం. ఎందుకంటే బ్లాక్‌బాక్స్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లోని చిన్న శబ్ధాన్ని కూడా రికార్డు చేస్తుంది.

అత్యవసర పరిస్థితుల్లో లేదా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, అలాగే ఎయిర్‌ క్రాఫ్ట్‌లో జరిగే అన్నీ సంబాషణలు, వెలుపడే శబ్ధాలను ఇది గుర్తిస్తుంది. బయట నుంచి వచ్చే శబ్ధాలు సైతం ఇందులో రికార్డు అవుతాయి.

విమానం ప్రమాదానికి గురైనప్పుడు ఏ పరికరం ఏమైనా బ్లాక్ బాక్స్ మాత్రం సురక్షితంగా ఉంటుంది. ఇది 1000 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా కరగదు. 30 వేల అడుగుల కిందకు పడినా కనీసం చిన్న పగులు కూడా ఏర్పడదు.

సముద్రంలో పడిపోయినా అక్కడి నుంచి సిగ్నల్ పంపుతూనే ఉంటుంది. చుక్క నీరు కూడా లోపలికి పోదు. అలాగే శత్రు జలాంతర్గాములు ఉనికి తెలుసుకునేందుకు సోనో బాయ్‌ అనే సెన్సర్ అవసరం.

"నీటి అడుగున ఉన్న సబ్‌మెరైన్‌ని గుర్తించడానికి ఈ సెన్సర్‌లను ఎయిర్‌ క్రాఫ్ట్‌ల నుంచి సముద్రంలోకి జారవిడుస్తాం. అసవరాన్ని బట్టి ఒకటి నుంచి రెండు, మూడు, నాలుగు ఇలా వదులుతుంటాం.

సోనోబాయ్ అక్కడ ప్రతీ చిన్న శబ్ధాన్ని టీయూ-142 యుద్ధ విమానానికి ట్రాన్స్‌మిట్‌ చేస్తుంది. దానిని అబ్జర్వర్లు డీ కోడ్ చేస్తారు. వీరిని సోనిక్స్ అంటారు.

డీకోడ్ చేసిన సమాచారం ద్వారా అక్కడ ఉన్నది ఎటువంటి సబ్ మెరైన్ ? ఎంత లోతులో ఉంది ? దానిని నాశనం చేయాలంటే బాంబు వాడాలా, మిసైల్‌ వాడాలా ? అనేది ఎయిర్‌క్రాప్ట్ ఉన్నతాధికారులు నిర్ణయించుకోగలుగుతారు." అని దిలీప్ కుమార్ తెలిపారు.

టీయూ-142 యుద్ధ విమానం

600 తూటాలు...1000 ఫొటోలు....

ప్రస్తుతం మ్యూజియంగా సేవలందిస్తున్న ఈ యుద్ధ విమానాన్ని చూస్తుంటే... యుద్ధ క్షేత్రంలో జరిగేవన్నీ మన కళ్ల ముందే జరుగుతున్న అనుభూతి కలుగుతుంది. మ్యూజియాన్ని ఆ విధంగా రూపొందించారు.

బయటి నుంచి చూస్తే మామూలు యుద్ధ విమానంలా కనిపించే ఈ విమానం లోపలికి వెళితే, ఇన్ని వ్యవస్థలుంటాయా అని ఆశ్చర్యం కలుగుతుందని'' అసిస్టెంట్ క్యూరేటర్ శ్రీనివాసరావు అన్నారు.

"ఆకారంలో 800 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ నిమిషానికి 1000 ఫొటోలను తీయడం దీని ప్రత్యేకత. సముద్రం లోపల, సముద్రతలంపై, అలాగే భూమిపై ఉన్న వస్తువులను హై రిజల్యూషన్‌తో ఫొటోలు తీయగలదు.

శత్రువులు ఎవరైనా దాడి చేస్తే వెంటనే స్పందించేందుకు ఇద్దరు గన్నర్లు ఉంటారు. వీరి వద్ద ఉన్న గన్లతో సెకనుకి 600 తూటాలను పేల్చగలరు.

టీయూ-142 ఏకబిగిన 16 గంటలు గగనంలో ప్రయాణం చేస్తూ రెండు గంటల సేపు ఆకాశంలోనే కదలకుండా ఆగి ఉండగలదు కూడా. ఇంధనం అయిపోతే మరో యుద్ధ విమాన సహాయంతో ఆకాశంలోనే నింపుకునే సదుపాయం ఉంది. ఇన్నిప్రత్యేకతలున్న యుద్ధ విమానం కాబట్టే...దేశ రక్షణలో దీని సేవలు అమోఘం." అని శ్రీనివాసరావు తెలిపారు.

టీయూ-142 యుద్ధ విమానం

'టీయూ' వీక్షణం...అద్భుతం

టీయూ 142 యుద్ధ విమాన పనితీరు, లోపలున్న వ్యవస్థలు వీటితో పాటు మ్యూజియంలో మరిన్ని అంశాలను జోడించారు. యుద్ధ విమానంలో నిజంగా ప్రయాణీస్తే ఎలా ఉంటుందో అనుభూతి పొందేందుకు స్టిమూలేటర్స్‌ని ఏర్పాటు చేశారు.

విమానంలో వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది ? గాల్లో పల్టీలు కొడుతూంటే ఎలాంటి అనుభూతి కలుగుతుంది ? అనేవి స్టిమ్యులేటర్ల ద్వారా స్వయంగా అనుభవంలోకి వస్తాయి.

అలాగే యుద్ధ విమానంలో పని చేసే సిబ్బంది యూనిఫామ్స్, ఇందులో పని చేసే సిబ్బంది అర్హతలు, రక్షణ రంగంలోని వివిధ అవార్డులు, అత్యవసర సమయాల్లో వాడే లైఫ్ సేవింగ్‌ బోట్లు, ప్యారాచూట్లు ఎలా ఉంటాయి అనేవి కూడా ప్రదర్శనలో ఉంటాయి.

"యుద్ధ విమానం చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలిగింది. ఇదోక అద్భుతం. దీనిని చూసిన తర్వాత మన రక్షణదళాల గొప్పతనం అర్థమైంది. ముఖ్యంగా పిల్లలు ఇది చూడటం చాలా అవసరం. తద్వారా దేశభక్తి పెంపొందుతుంది.

సబ్ మెరైన్, యుద్ధ విమానమే కాకుండ రక్షణ రంగానికి చెందిన మరిన్ని విశేషాలను తెలిపే మ్యూజియంలు, ప్రదర్శనలు నేటి తరానికి చాలా అవసరం" అని యుద్ధ విమానాన్ని సందర్శించిన సీనియర్ సిటిజన్ పరమేశ్వరరావు అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
VISAKHAPATNAM: A TU-142 fighter jet on the coast
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X