సుప్రీంకోర్టుకే ఉచిత సలహాలు.. జడ్జికి ఊహించని షాక్!
సాధారణంగా దిగువ న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు దిశానిర్దేశం చేయడం, ఆదేశాలు జారీ చేయడం చూస్తుంటాం. కానీ, ఎవరైనా ట్రయల్ కోర్టు జడ్జి దేశ అత్యున్నత న్యాయస్థానానికే సలహాలు ఇస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి అరుదైన, విస్తుపోయే ఘటనే ఇటీవలి విచారణలో చోటుచేసుకుంది. బెయిల్ ఎప్పుడు ఇవ్వాలి? ఎప్పుడు ఇవ్వకూడదు? అనే అంశంపై సుప్రీంకోర్టుకే ఉచిత సలహా ఇచ్చిన ఒక అదనపు జిల్లా కోర్టు సెషన్స్ న్యాయమూర్తిపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరహా వ్యాఖ్యలు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, దీనిపై వెంటనే తగిన వివరణ ఇవ్వాలని సదరు జడ్జిని ఆదేశించింది.
విచారణ గడువు పెంపు కోసం లేఖ..
పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ (బారాసత్) మూడో కోర్టుకు చెందిన అదనపు జిల్లా , సెషన్స్ జడ్జి ఈ వింత పరిస్థితికి కారణమయ్యారు. గత ఐదేళ్లుగా జైలులోనే విచారణ ఎదుర్కొంటున్న ఒక నిందితుడి బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు గత మే 11న తిరస్కరించింది. కేసు విచారణ చాలా నెమ్మదిగా సాగుతుండటంతో, రాబోయే మూడు నెలల్లోనే విచారణను పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. అయితే, నిర్దేశిత సమయంలో విచారణ పూర్తి కాకపోవడంతో, మరికొంత సమయం కావాలంటూ అగష్టు 11న సదరు జడ్జి సుప్రీంకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. ఆ లేఖ వరకు బాగానే ఉన్నా, అందులోని చివరి రెండు పేరాల్లో బెయిల్ సూత్రాలపై సుప్రీంకోర్టుకే సలహాలు ఇస్తూ రాయడమే వివాదానికి మూలమైంది.

మండిపడిన జస్టిస్ పార్డీవాలా బెంచ్
జస్టిస్ జె.బి. పార్డీవాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుటకు ఈ లేఖ వచ్చింది. లేఖలోని అంశాలను చదివిన ధర్మాసనం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కేసు విచారణకు అదనపు సమయం కోరుతూ ఒక జడ్జి లేఖ రాసిన తీరు తమను ఎంతగానో కలచివేసిందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ కోర్టు ఎప్పుడు బెయిల్ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వకూడదనే విషయంలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ సలహాలు ఇవ్వడం ఏమాత్రం తగదని స్పష్టం చేశారు. లేఖలోని చివరి రెండు పేరాల్లో రాసిన వ్యాఖ్యలు అసందర్భంగా, ఆమోదయోగ్యం కాని రీతిలో ఉన్నాయని వ్యాఖ్యానించారు.
న్యాయమూర్తికి సుప్రీం రిజిస్ట్రీ ఆదేశాలు
ల్యాండ్ మార్క్ తీర్పులు చెప్పే అత్యున్నత స్థానంలో ఉన్న కోర్టుకే దిగువ కోర్టు జడ్జి సలహాలు ఇవ్వడంపై సుప్రీంకోర్టు సీరియస్‌గా స్పందించింది. ఆ లేఖలోని వివాదాస్పద వ్యాఖ్యలని తీవ్రంగా పరిగణిస్తూ, అసలు అటువంటి వ్యాఖ్యలు ఎందుకు రాయాల్సి వచ్చిందో సదరు ప్రిసైడింగ్ ఆఫీసర్ నుంచి తక్షణమే తగిన వివరణ సేకరించాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ పరిణామం ఇప్పుడు న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.














Click it and Unblock the Notifications
