WhatsAPP:వాట్సప్ డేటా లీక్.. అమ్మకానికి 50కోట్ల నెంబర్లు!.. మనవి కూడా!!
WhatsAPP: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ నుంచి భారీగా డేటా లీకైంది. ఇది ఫేస్ బుక్ కు చెందిన సంస్థ. దాదాపు 50కోట్ల మంది వాట్సప్ యూజర్ల ఫోన్ నంబర్లు ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచారు. ఈ విషయాన్ని సైబర్‌న్యూస్ నివేదిక వెల్లడించింది. అమెరికా, రష్యా, యూకే సహా పలు దేశాలకు చెందిన యూజర్ల నెంబర్లను హ్యాకర్లు అమ్మకానికి ఉంచారు. 48.7కోట్ల వాట్సప్ యూజర్ల ఫోన్ నెంబర్లతో 2022 డేటాబేస్‌ను విక్రయిస్తున్నట్లు ఆన్‌లైన్‌లో ఓ హ్యాకర్ ప్రకటన ఇచ్చాడు.
అమెరికా, బ్రిటన్, ఇటలీ, సౌదీ అరేబియా, ఈజిప్టు సహా 84 దేశాలకు చెందిన యూజర్ల నెంబర్లను అమ్మకానికి పెట్టినట్లు సైబర్ న్యూస్ పేర్కొంది. ఓ హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరమ్ లో విక్రయానికి ఉంచారు. భారతదేశానికి చెందిన యూజర్ల నెంబర్లు కూడా ఉన్నాయని సమాచారం.

ఈజిప్టు నుంచి 4.5కోట్ల మంది, ఇటలీ నుంచి 3.5 కోట్ల మంది, అమెరికా నుంచి 3.2 కోట్ల మంది, సౌదీ అరేబియా నుంచి 2.9కోట్లు, ఫ్రాన్స్ నుంచి 2 కోట్లు, టర్కీ నుంచి 2 కోట్లు, యూకే నుంచి 1.1కోట్లు, రష్యా నుంచి దాదాపు కోటి మంది వాట్సప్ యూజర్ల నంబర్లు లీకయ్యాయి. ఒక్కో దేశానికి చెందిన యూజర్ల నెంబరుకు ఒక్కో ధరతో అమ్మకానికి పెట్టారు. అమెరికా డేటాసెట్ అయితే 7వేల డాలర్లు, జర్మనీ యూజర్ల నంబర్ల ధర 2వేల డాలర్లు, బ్రిటన్ డేటా అయితే 2500 డాలర్లుగా ఉన్నట్లు సైబర్ న్యూస్ వెల్లడించింది.
సైబర్ నేరగాళ్లు ఈ నెంబర్లను కొనుగోలు చేసి మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. గుర్తుతెలియని నెంబర్ల నుంచి కాల్స్, మెసేజ్‌లు వస్తే స్పందించొద్దని సూచించింది. మెటాకు చెందిన సంస్థల్లో డేటా తరుచుగా లీకవుతుంటుంది. గతేడాది 50కోట్ల మందికి పైగా ఫేస్‌బుక్ యూజర్ల డేటా హ్యాకర్ల చేతికి చిక్కింది. ఇప్పుడు వాట్సాప్ వంతు వచ్చింది.












Click it and Unblock the Notifications