మళ్లీ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ.. కేంద్రం అత్యవసర ప్రయాణ హెచ్చరికలు!
కరోనా మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం మరువక ముందే.. ప్రపంచాన్ని ఇప్పుడు మరో ప్రాణాంతక వైరస్ వణికిస్తోంది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC), ఉగాండా దేశాలలో 'బుండిబుగ్యో' (Bundibugyo) స్ట్రెయిన్ ఎబోలా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఈ తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), దీనిని 'అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి' (PHEIC)గా ప్రకటించింది. మరోవైపు ఆఫ్రికా సీడీసీ (CDC) సైతం ఈ బుండిబుగ్యో స్ట్రెయిన్ వ్యాప్తిని 'ఖండ భద్రతకు సంబంధించిన ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి' (PHECS)గా గుర్తించి అంతర్జాతీయ సమాజాన్ని అప్రమత్తం చేసింది.
ఈ ప్రమాదకర వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతానికి భారతదేశంలో ఈ బుండిబుగ్యో స్ట్రెయిన్ ఎబోలా కేసులు ఏవీ నమోదు కాలేదని స్పష్టం చేసిన ప్రభుత్వం.. ముందస్తు జాగ్రత్తగా పౌరులకు కీలక సూచనలు చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC), ఉగాండా, , వాటి సరిహద్దు దేశమైన సౌత్ సూడాన్‌లకు అనవసర ప్రయాణాలను పూర్తిగా మానుకోవాలని (ట్రావెల్ అడ్వైజరీ) భారత పౌరులను కోరింది. ఒకవేళ ఇప్పటికే ఆయా దేశాల్లో నివసిస్తున్న లేదా అత్యవసరంగా ప్రయాణించిన భారతీయులు ఉంటే.. అక్కడి స్థానిక అధికారులు జారీ చేసే ప్రజారోగ్య మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, అత్యంత జాగ్రత్తగా ఉండాలని హితవు పలికింది.

చికిత్స లేని వైరస్.. విమానాశ్రయాల్లో హై అలర్ట్!
వైద్య నిపుణుల ప్రకారం.. బుండిబుగ్యో స్ట్రెయిన్ ఎబోలా అనేది అత్యంత ప్రాణాంతకమైన 'వైరల్ హెమరేజిక్ జ్వరం'. దీనివల్ల శరీరంలో అంతర్గత రక్తస్రావం జరిగి మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. ప్రస్తుతం ఈ పర్టికులర్ స్ట్రెయిన్‌కు ఎటువంటి అధికారిక వ్యాక్సిన్‌లు గానీ, నిర్దిష్టమైన చికిత్సా విధానాలు (Specific Treatments) గానీ అందుబాటులో లేవు. దీంతో డీఆర్‌సీ, ఉగాండాలతో పాటు వాటి సరిహద్దు దేశమైన సౌత్ సూడాన్‌కు కూడా ఈ వ్యాధి వేగంగా సంక్రమించే ముప్పు పొంచి ఉందని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర కమిటీ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ప్రవేశ ద్వారాలైన విమానాశ్రయాలు, ఓడరేవుల వద్ద నిఘాను పటిష్టం చేయాలని కేంద్రం ఆదేశించింది. ముఖ్యంగా ఆఫ్రికాలోని ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులలో ఎవరికైనా జ్వరం లేదా ఇతర లక్షణాలు ఉంటే.. వారిని విమానాశ్రయాల వద్దే "గుర్తించి, పరీక్షించి, నివేదించి, ప్రత్యేకంగా నిర్వహించేలా" గట్టి నిఘా చర్యలు చేపట్టాలని డబ్ల్యూహెచ్‌ఓ ఐహెచ్‌ఆర్ (WHO IHR) కమిటీ చేసిన తాత్కాలిక సిఫార్సులను భారత్ అమలు చేస్తోంది. అంతర్జాతీయ ప్రయాణికులు కూడా స్వీయ నియంత్రణ పాటించాలని అధికారులు కోరుతున్నారు.













Click it and Unblock the Notifications