గోదావరికి తరచూ భారీ వరదలు ఎందుకు వస్తాయి? అంత నీరు ఎక్కడి నుంచి వస్తుంది

గోదావరి

గోదావరితో తెలుగు నేలది విడదీయలేని బంధం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ధాన్యాగారాలుగా మార్చిన రెండు ప్రధాన నదుల్లో ఇదీ ఒకటి. తెలుగు ప్రజల తాగునీరు, సాగునీరు అవసరాలను తీర్చడంతోపాటు పారిశ్రామీకీకరణలోనూ కీలకంగా మారింది గోదావరి నది. ఇదే గోదావరికి మరో పార్శ్వమూ ఉంది. అదే 'వరద గోదావరి'.

గోదావరికి తరచూ వచ్చే భారీ వరదలు ప్రాణ నష్టానికి కారణమవుతుంటాయి. పెద్దయెత్తున పంట నష్టం, ఆస్తి నష్టం కలిగిస్తుంటాయి. అలాంటి సమయాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వరద నిర్వహణ పెను సవాలుగా నిలుస్తుంటుంది.

2022 జులైలో గోదావరికి మొదలైన వరద ప్రభావం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికీ కనిపిస్తోంది.

గోదావరికి వరదలు

ఉపనదుల నుంచే అత్యధిక నీరు

మహారాష్ట్రలోని 'త్రయంబకేశ్వర్'లో పుట్టిన గోదావరి ఏపీలోని అంతర్వేది వద్ద బంగాళాఖాతంతో కలుస్తుంది.

'కేంద్ర జల సంఘం'(CWC) నిర్వహించే INDIA-WRIS వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం, గోదావరి తన 1465 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణంలో ప్రాణహిత, మంజీర, మానేరు, ఇంద్రావతి, శబరి, సీలేరు, కిన్నెరసాని లాంటి ప్రధాన ఉపనదులు, పెద్దపెద్ద వాగుల ప్రవహాలను తనలో కలుపుకుని దేశంలోనే అతిపెద్ద నదీపరివాహక (క్యాచ్ మెంట్) ప్రాంతాన్ని సృష్టించింది.

గోదావరిని స్థూలంగా ఎగువ, మధ్య, దిగువ నదీ ప్రాంతాలుగా విభజించి చూస్తే, మధ్య, దిగువ ప్రాంతాల్లో కలిసే ప్రాణహిత, ఇంద్రావతి, శబరి లాంటి ఉపనదుల నుంచే ఎక్కువ శాతం (59.7 శాతం) నీరు గోదావరిలో చేరుతుంది. గోదావరిలో ప్రవహించే ప్రతి వెయ్యి లీటర్ల నీటిలో సుమారు 600 లీటర్ల నీరు ఈ నదుల నుంచే వచ్చి చేరుతుంది.

గోదావరికి వరదలు

కృష్ణతో పోలిస్తే గోదావరికి వరదలు ఎక్కువా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ప్రధానమైన గోదావరి, కృష్ణా నదులు రెండింటికి వరదలు సాధారణమే అయినా, గోదావరికే తరచూ భారీ వరదలు వస్తుంటాయి. దీనికి కారణాలు ఏమిటి?

కృష్ణతో పోలిస్తే గోదావరి విస్తీర్ణం పెద్దది కావడం, ఈ నదిపై భారీ నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు ఎక్కువ సంఖ్యలో లేకపోవడం ప్రధాన కారణాలని నీటిపారుదల నిపుణుల అభిప్రాయం.

గోదావరి వరద ప్రభావం నదీ గమనం మొత్తంలో అన్ని ప్రాంతాల్లో ఒకే స్థాయిలో మనకు కనబడదు. ఎగువ ప్రాంతాల్లోని జిల్లాలతో పోలిస్తే తెలంగాణలో ములుగు, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లోని అవిభాజ్య గోదావరి జిల్లాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. ముంపుతో పాటు సంభవించే వివిధ రకాల నష్టాలు కూడా ఈ జిల్లాల్లోనే ఎక్కువ.

ఎగువ మహారాష్ట్రలో గోదావరిపై అంటే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పైభాగంలో, ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల నీటి వినియోగం పెరిగి, ఉత్తర తెలంగాణ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో వరదల స్వభావం మారిందని, గతంతో పోలిస్తే వరద ముప్పు తగ్గిందన్న అభిప్రాయాలూ ఉన్నాయి.

ముఖ్యంగా, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాళేశ్వరం వరకు వరదలు వచ్చే సందర్భాలు తగ్గాయి. మధ్య గోదావరి ప్రాంతంలో ముఖ్యంగా, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ప్రాణహిత కలయికతో గోదావరి వరద స్వరూపం మారుతోందని, దానికి దిగువన ఇంద్రావతి, శబరి చేరడంతో తరచూ భారీ వరదలు వస్తున్నాయన్నది నిపుణుల విశ్లేషణ.

గోదావరికి వరదలు

నీటి పారుదల రంగంలో విశేష అనుభవం ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సానా మారూతి బీబీసీ తో మాట్లాడుతూ, "మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ అటవీ ప్రాంతాల్లో రిజర్వ్ అడవులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉండటం వల్ల ఆ ప్రాంతాల్లో డ్యామ్‌ల నిర్మాణం జరగలేదు. అక్కడ కురిసిన వర్షం ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రాణహిత ద్వారా నేరుగా కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తుంది. అయితే, ప్రస్తుతం పెన్ గంగా, వార్ధా, వైన్ గంగాలపై మహారాష్ట్ర కొన్ని ప్రాజెక్టులు కడుతోంది. భవిష్యత్తులో ఈ నీరు అంతగా రాదు'' అని చెప్పారు.

''1986లో ధవళేశ్వరం వద్ద 36 లక్షల క్యూసెక్కుల రికార్డ్ వరద సమయంలో నిజామాబాద్ జిల్లాలో పెద్దగా వరద ప్రభావం లేదు. ప్రాణహిత, ఇంద్రావతి, శబరి నదుల కలయిక తర్వాతే కాళేశ్వరం, ఇచ్చంపల్లి, ఏటూరు నాగారం, భద్రాచలం ప్రాంతాల్లో గోదావరి భారీగా విస్తరిస్తుంది" అన్నారు.

స్థూలంగా చెప్పాలంటే, గోదావరితో పోలిస్తే, కృష్ణ, దాని ఉపనదులపై మహారాష్ట్ర, కర్ణాటకలు ఎక్కువగా ప్రాజెక్టులు కట్టాయి. ఆ ప్రాజెక్టులను దాటి వచ్చాక 200 టీఎంసీల పైగా సామర్థ్యంతో ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లు కృష్ణపై ఉన్నాయి. అవి పూర్తిగా నిండి కృష్ణకు వరదలు రావాలంటే ఎక్కువ సమయం పడుతుంది. గోదావరికి అత్యధికంగా నీటిని అందించే ప్రాణహిత, శబరి, ఇంద్రావతిలపై పెద్దగా ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు.

''2021 జులై వరదల సమయంలో (13,14 తేదీల్లో) కాళేశ్వరం సంగమం వద్ద గోదావరి వరద 29 లక్షల క్యూసెక్కులు పైబడింది. ఇంత వరద సామర్థ్యాన్ని తరలించే విస్తీర్ణం గోదావరి నదీ గర్భంలో లేదు. కాబట్టే నది మట్టం 108 మీటర్ల పైన చేరింది. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న వాతావరణ మార్పులను (Climatic Changes), ఈ ఏడు వచ్చిన వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావాలను (Back Water Effects) అధ్యయనం చేయాలని, తదనుగుణంగా గోదావరి తీర ప్రాంతాల రక్షణకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిమాండ్ చేస్తున్నది'' అని తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగంలో పేరు వెల్లడించడానికి ఇష్టపడని నీటిపారుదల శాఖ నిపుణుడు ఒకరు బీబీసీతో అన్నారు.

''భవిష్యత్తులో పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మద్య కోఆర్డినేషన్ అవసరం. భద్రాచలం ముంపు వెనుక కారణం అదే. రెండు రాష్ట్రాల ఇంజినీర్ల మధ్య సమన్వయం ఉంటే ముంపు నివారించవచ్చు. వర్షాలను నియంత్రించలేం కానీ సమన్వయంతో వరద నియంత్రణ చర్యలు చేపట్టి నష్టాన్ని తగ్గించవచ్చు'' అని రిటైర్డ్ ఇంజనీర్ సానా మారుతి అభిప్రాయపడ్డారు.

గోదావరి

వరదలు ఎన్ని రకాలు?

కేంద్ర జలసంఘం వర్గీకరణ ప్రకారం, వరదలు వచ్చే స్థాయిని బట్టి 1) సాధారణ(నార్మల్), 2) సాధారణంగా కంటే ఎక్కువ (అబౌవ్ నార్మల్), 3) తీవ్రమైన (సివియర్), 4) అత్యంత తీవ్రమైన (ఎక్స్‌ట్రీమ్ ఫ్లుడ్) ప్థాయిలు ఉన్నాయి.

వరద అంచనా కేంద్రాల వద్ద వరద నీటి మట్టం, హెచ్చరిక స్థాయి కంటే తక్కువగా ప్రవహిస్తే సాధారణ వరదగా, హెచ్చరిక స్థాయిని తాకినా లేదా అది దాటి ప్రమాదకర స్థాయికి దగ్గరగా చేరితే, సాధారణం కంటే ఎక్కువ వరదగా భావించి 'పసుపు రంగు' హెచ్చరికను జారీ చేస్తారు.

వరద ప్రవాహం ప్రమాదకర స్థాయిని దాటి హయ్యస్ట్ ఫ్లడ్ లెవల్‌కు దిగువన ఉన్నప్పుడు తీవ్రమైన వరదగా పరిగణించి 'ఆరేంజ్ అలర్ట్' ఇస్తారు. అలాంటప్పుడు కేంద్ర జల సంఘం ప్రతి మూడు గంటలకు ప్రత్యేక వరద సమాచారాన్ని జారీ చేస్తుంది.

అత్యంత తీవ్రమైన వరద సమయంలో, వరద అంచనా కేంద్రాల వద్ద నీటి ప్రవాహం అత్యధిక వరద స్థాయిని దాటి ప్రవహిస్తుంది. ఈ సమయంలో 'రెడ్ బులిటెన్' జారీ చేసి, ప్రతి గంటకు వరద సమాచారం అందిస్తారు.

రెడ్, ఆరెంజ్ బులెటిన్‌లు ప్రధానమంత్రి కార్యాలయం వరకు వెళ్తాయి. ఎల్లో బులెటిన్‌‌‌ను వరద నష్ట నివారణకు సంబంధించిన వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు పంపుతారు.

భారీ వర్షాలు కురిసినప్పుడు కేంద్ర జల సంఘం ఆయా రాష్ట్రాలకు హెచ్చరికలను జారీ చేస్తుంది. దీనికోసం వివిధ ప్రాంతాల్లో 'వరద అంచనా కేంద్రాలు' నిర్వహిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నదులపై శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, కాళేశ్వరం, భద్రాచలం, ధవళేశ్వరం, జూరాల, శ్రీశైలం, ప్రకాశం బ్యారేజ్, మంత్రాలయం వద్ద వరద ప్రధాన అంచనా కేంద్రాలు ఉన్నాయి.

కేంద్ర జల సంఘం వరద హెచ్చరికల నెట్వర్క్‌లో భాగంగా, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 325 వరద అంచనా కేంద్రాల నుంచి వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలను వైర్‌లెస్, ఫోన్, ఈ-మెయిల్, మీడియా, సోషల్ మీడియా, వెబ్‌సైట్ లాంటి సమాచార మార్గాల ద్వారా చేరవేస్తోంది.

కాళేశ్వరం

వరదల నిర్వహణ ఎలా జరుగుతుంది?

భారతదేశంలో వరదల నిర్వహణకు రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో రెండు అంచెల వ్యవస్థ ఉంది.

1945లో ఏర్పాటైన సెంట్రల్ వాటర్ కమీషన్ (కేంద్ర జలసంఘం - CWC) కేంద్ర స్థాయిలో వరద నియంత్రణ, డ్యామ్‌లు నదుల పరిరక్షణ, దేశవ్యాప్తంగా నీటి వనరుల అభివృద్ది, పరిశోధన, నిర్వహణ, అంతర్జాతీయ జల సంబంధాల బాధ్యతలను చూస్తుంది.

సెంట్రల్ వాటర్ కమీషన్ ప్రకారం, 2022 నాటికి భారతదేశంలో 5334 పెద్ద డ్యామ్‌లు ఉన్నాయి. వీటిలో 80 శాతం డ్యామ్‌లు 25 ఏళ్లు పాతవి. పెద్ద డ్యామ్‌లలో 227 డ్యామ్‌లు వందేళ్ల పూర్వం నిర్మించినవి.

గడగిచిన 100 ఏళ్లలో 41 డ్యామ్‌లు వరద నివారణలో విఫలం అయ్యాయి.

2021 ద్వితీయార్ధంలో ఆంధ్రప్రదేశ్‌లోని 'అన్నమయ్య డ్యామ్' వైఫల్యంతో జరిగిన నష్టం మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది.

భారత్‌లో 98 శాతం డ్యామ్‌ల నిర్వహణ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ప్రాజెక్టుల వైఫల్యాలకు ఆస్కారం లేకుండా దేశం మొత్తం మీద ఒకే రకమైన 'డ్యామ్ సేఫ్టీ ప్రోటోకాల్స్' కోసం కేంద్ర ప్రభుత్వం 'డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021'ను తెచ్చింది.

ఈ చట్టంలో భాగంగా, డ్యామ్‌ల నిఘా, పర్యవేక్షణ, నిర్వహణ, విఫలమయ్యే అవకాశం ఉన్న డ్యామ్‌ల నిర్వహణ, రాష్ట్రాల మధ్య మెరుగైన సమన్వయం కోసం ఆయా నదీ పరివాహక ప్రాంతాల వదర నిర్వహణ మాస్టర్ ప్లాన్ రూపకల్పన, సముద్ర, నదీతీర ప్రాంతాల్లో కోతలను తగ్గించే చర్యలు, వరద అంచనా వ్యవస్థ ఆధునీకరణ, కట్టలు పటిష్టపరచడం, రిజర్వాయర్ల సామర్థ్యం మెరుగుపరచడం ద్వారా దిగువ ప్రాంతాలకు వరద చేరే సమయాన్ని నియంత్రించడం లాంటి కొన్ని మార్గదర్శక సూత్రాలు, నిబంధనలు పొందుపరిచింది.

గోదావరికి వరదలు

కడెం ప్రాజెక్ట్‌కు ముప్పు పొంచి ఉందా?

భారీ ప్రాజెక్టులతో పోలిస్తే అతి చిన్నదైన 2,590 చ.కి.మీ కడెం క్యాచ్మెంట్ వరద నిర్వహణ నీటిపారుదల శాఖ అధికారులకు సవాలుగా మారుతోంది.

తెలంగాణ నీటి పారుదల శాఖ నిపుణులు చెబుతున్నట్టుగా ఎగువ ప్రాంతాలకు గోదావరి వరదల ముప్పు తగ్గితే, మరి ఇటీవల వర్షాలకు 'కడెం ప్రాజెక్ట్' ఎందుకు పొంగిపొర్లింది? ప్రతీ సీజన్‌లో కడెం ప్రాజెక్ట్ సేఫ్‌గా లేదన్న ప్రచారానికి కారణం ఏంటి?

గోదావరి ఉపనది 'కడెం వాగు' మీద నిర్మాణ సమయంలోనే అంటే,1958 ఆగస్టు నెలలో ఊహించని వరదలతో ఈ ప్రాజెక్టులో కొంత భాగం కొట్టుకుపోయింది. ఇటీవల వరదల్లో ప్రాజెక్ట్ కట్ట, కాలువకు గండ్లు పడ్డాయి.

'ఫ్లాష్ ఫ్లడ్స్' వల్ల తరచూ ఇలా పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయని, 'కడెం' లాంటి చిన్న నదులపై 'వాటర్ గేజింగ్ స్టేషన్లు' లేక డ్యామ్‌కు చేరే వరకు వరద నీరు అంచనా వేయలేకపోతున్నారని, అయితే సరైన వరద నిర్వహణ చర్యలతో దీన్ని అరికట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గోదావరి

'కుండ ఆకారంలో గుండ్రంగా ఉండే కడెం ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురిస్తే అన్ని వైపుల నుంచి ఒకేసారి నీరు వస్తుంది. కెపాసిటీ తక్కువ కావడం వల్ల (7 టీఎంసీ) వల్ల డ్యామ్ త్వరగా నిండుతుంది. గతంలో పోలిస్తే మెరుగైన సమాచార వ్యవస్థ వల్ల ముందే వాతావరణ సమాచారం ఇంజినీర్లకు అందుతోంది. ’ఇన్ ఫ్లో’ను ప్రతి 30 నిమిషాలకు బేరీజు వేసుకుని సిద్దమైతే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావు. ఇది కచ్చితంగా వైఫల్యమే. గతంలో కర్నూలు వరదలు కూడా మానవ తప్పిదం వల్లే వచ్చాయి'' అని సానా మారుతీ అన్నారు.

కడెం ప్రాజెక్టుకు ఆకస్మిక వరదలు నివారించేందుకు 'కుంటాల వాటర్ ఫాల్స్'కు ఎగువ భాగంలో 'కుప్టి' గ్రామం వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలన్న ప్రతిపాదన ఒకటి ఉంది.

"2009లో శ్రీశైలం ప్రాజెక్ట్ కు వచ్చిన విపత్తు లాంటిదే ఈ సంవత్సరం కడెం ప్రాజెక్ట్ ఎదుర్కున్నది. కుప్టి ప్రాజెక్ట్ నిర్మాణానికి గతంలోనే ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణమయితే కడెం డ్యామ్‌లోకి ఎంత వరద, ఎన్ని గంటల్లో రాబోతున్నది కచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు డ్యామ్‌లో నీటి మట్టం ఎఫ్ఆర్ఎల్ దాటకుండా చూసుకోవచ్చు'' అని తెలంగాణ ప్రభుత్వ వర్గాల నీటి పారుదల శాఖ నిపుణుడు బీబీసీకి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+