సోనియాను జైల్లో పెట్టాలి, మోడీకి ఆ దమ్ముందా?: కేజ్రీ ప్రశ్న
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై చర్యలు తీసుకునే ధైర్యం ప్రధాని నరేంద్రమోడికి లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. శనివారం జంతర్ మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న కేజ్రీవాల్ బేజీపీ, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు.
ఆగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో నిందితులపై చర్యలు తీసుకునేందుకు మోడీని ప్రజలు ప్రధానిని చేశారని అన్నారు. వీవీఐపీ చాపర్స్ కుంభకోణంగా పేరుగాంచి ఆగస్ట్ వెస్ట్ ల్యాండ్ కుంభకోణంపై శనివారం ఢిల్లీలోని రేస్ కోర్సు రోడ్డులో ఉన్న మెట్రో స్టేషన్ వద్ద ఆప్ ఆందోళన నిర్వహించింది.

ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్, బీజేపీపై నిప్పులు చెరిగారు. 'ప్లీజ్ సోనియా గాంధీ గారు.. హెలికాప్టర్ల స్కాంలో ఎంత డబ్బు తీసుకున్నారో చెప్పండి ప్లీజ్. అని అడిగితే ఆవిడ నిజం చెబుతుందా? కచ్చితంగా చెప్పదు. అందుకే సోనియా గాంధీని అరెస్ట్ చేయాలి' అని అన్నారు.
'లాకప్‌లో ఉంచి రెండంటే రెండు రోజులు విచారిస్తే నిజానిజాలు వాటంతట అవే తన్నుకొస్తాయి. కానీ సోనియాను జైల్లో పెట్టాల్సింది ఎవరు? అంత దమ్ము 56 ఇంచుల ఛాతీ ఉందని చెప్పుకునే మోడికి ఉందా?' అంటూ బీజేపీ, కాంగ్రెస్‌లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ఆగస్టా కుంభకోణంపై ఇటలీ కోర్టు ఇచ్చిన నివేదికలో కాంగ్రెస్ అధినేత్రి సోనియ గాంధీతో పాటు ఆమె రాజకీయ సలహాదారు అహ్మాద్ పటేల్ పేర్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ విషయం వెలుగులోకి వచ్చి నాలుగేళ్లు అయిందని పేర్కొన్నారు. తమకు నెల రోజుల పాటు పోలీసు యంత్రాగాన్ని అప్పగిస్తే... నిజానిజాలు వెలికి తీస్తామని ఆయన స్పష్టం చేశారు

భారత్‌ను అవినీతి రహిత దేశంగా మార్చుతామని, అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని హామీలు గుప్పించిన మోడీ రెండేళ్ల క్రితం ఎన్నికల్లో గెలిచినా ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఆగస్టా విషయంలో ఆయన ఇంతకాలం ఎందుకు సైలెంట్‌గా ఉండిపోయారని ప్రశ్నించారు.
ఆగస్టా కుంభకోణంలో అన్ని ఆధారాలు లభ్యమైనా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అలాంటప్పుడు సీబీఐ, ఈడీ, ఇతర దర్యాప్తు సంస్ధలు ఉండి లాభం ఏమిటి? అని వాటిని తక్షణమే మూసివేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు.
చిన్న వాళ్లను జైల్లో పెట్టించిన మోడీ
'చిన్నచిన్న కేసులకే ఆమ్ ఆద్మీకి చెందిన ఎమ్మెల్యేలను జైళ్లలో పెట్టించిన మోడీ... ఆగస్టా వెస్ట్ ల్యాండ్ లాంటి స్కాం విషయంలో మౌనంగా ఉండటం ఆయన చేతగాని తనానికి నిదర్శనం. ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి, భార్యతో తగువులాడాడని ఐదురోజులు కటకటాల్లోకి నెట్టారు. ఏం.. భార్యా భర్తలు కీచులాడుకోరా? రేప్ ఘటనపై ఆందోళన చేసిన మరో ఎమ్మెల్యేని నాలుగు రోజులు బొక్కలో వేశారు. లంచంపై పోరాడిన ఓ ఆర్మీ ఆఫీసర్ ను రెండు రోజులు స్టేషన్ లో ఉంచారు. అయ్యా మోడీ గారు.. మీ ప్రతాపం చిన్నవాళ్లపైనేనా? పెద్దవాళ్ల జోలికి వెళ్లరా? లేక కాంగ్రెస్ వాళ్లతో పెట్టుకుంటే మీ కూసాలు కూడా కదలిపోతాయని భయమా?' అని తీవ్ర విమర్శలు గుప్పించారు.
రాబర్ట్ వాద్రాపై ఆరోపణలు
'యూపీఏ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉంది. ఈ సమయంలో హర్యానా, రాజస్థాన్‌లలో సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా పెద్ద ఎత్తున భూములు కొన్నారు. వీటికి సంబంధించిన ఆరోపణలు ఇంకా రాబర్ట్ వాద్రా ఎదుర్కొంటున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీనే అధికారంలో ఉందని, అలాంటప్పుడు వాద్రాపై ఎంక్వైరీ ఎందుకు వేయడంలేదు' అని ప్రశ్నించారు.
మోడీవి నకిలీ డిగ్రీలు
ప్రధాని మోడీ గడచిన ఎన్నకల సమయంలో ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో గుజరాత్ వర్సిటీ నుంచి బీఏ, ఢిల్లీ వర్సిటీ నుంచి ఎమ్ఏ చదివారని అందులో పేర్కొన్నారని తెలిపారు. మోడీ తన విద్యార్హతల విషయంలో దేశ ప్రజలను మోసం చేశారని తాము సాక్ష్యాధారాలతో నిరూపిస్తుండగా, దానిపై కాంగ్రెస్ పార్టీ కానీ, సోనియా, రాహుల్ గాంధీలు కానీ కనీసం నోరు విప్పడం లేదని ఆయన విమర్శించారు. దేశ ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి అబద్ధాలు చెప్పవచ్చని దీని అర్థమా? అని ఆయన నిలదీశారు.












Click it and Unblock the Notifications