వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్‌లో 'పేదలందరికీ ఇళ్లు' నిర్మాణం ఎందుకు ఆలస్యం అవుతోంది? ఈ ఆలస్యానికి బాధ్యులు ఎవరు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
చిత్తూరు జిల్లా కలెక్టరేట్

ఆంధ్రప్రదేశ్‌లో పేదలందరికీ ఇళ్లు పథకం అధికారులకు తలనొప్పిగా తయారైందా? అంటే అవుననే సమాధానం కలెక్టర్ ఉత్తర్వుల్లో కనిపించింది. ఇళ్ల నిర్మాణంలో జాప్యానికి కారకులంటూ సిబ్బంది వేతనాలు నిలుపుదల చేయాలనడం అందుకు తార్కాణంగా ఉంది.

'వైఎస్ఆర్ పేదలందరికీ ఇళ్లు' పథకం అమలులో ఆలస్యానికి క్షేత్ర స్థాయి అధికారులను కారకులుగా పేర్కొనడం విమర్శలకు కారణమైంది.

చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలు పట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆయన తన ఆదేశాలు ఉపసంహరించుకున్నప్పటికీ ఈ వ్యవహారం పలు ప్రశ్నలను లేవనెత్తింది.

రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరికీ ఇళ్ల కోసం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం ప్రవేశపెట్టింది. మూడేళ్లలో ఇళ్లు లేని పేదలు ఉండరంటూ ప్రకటించారు.

కానీ, వివిధ కారణాలతో ఆ ఇళ్ల నిర్మాణం వేగంగా జరగడం లేదు. ప్రభుత్వం ఆశించిన రీతిలో పనులు సాగడం లేదు. దీంతో వేగంగా ఇళ్ల నిర్మాణం చేయాలని రాష్ట్ర స్థాయి నుంచి ఒత్తిడి పెంచుతున్నారు.

ఫలితంగా చిత్తూరు జిల్లాలో ఇంజనీరింగ్ అధికారులు, హౌసింగ్ సిబ్బందికి టార్గెట్లను నిర్దేశించారు. వాటిని చేరుకోలేకపోవడంతో చివరకు జీతాలు కూడా నిలిపేస్తామంటూ రాతపూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశమైంది.

చిత్తూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ ఎన్ని సమీక్షలు నిర్వహించినా, అధికారులు ఎంత తిరుగుతున్నా క్షేత్రస్థాయిలో మార్పు కనిపించడం లేదు. దీంతో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమని కలెక్టర్ భావించారు. వెంటనే ఆయా శాఖల సిబ్బందికి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు జీతాలు నిలిపివేయాల్సిందిగా ట్రెజరీ శాఖను ఆదేశించారు. కలెక్టర్ తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది.

జిల్లా కలెక్టర్ హరి నారాయణన్

కలెక్టర్ ఉత్తర్వుల్లో ఏముంది?

చిత్తూరు జిల్లాలో 'వైఎస్‌ఆర్ పేదలందరికీ ఇళ్లు పథకం' అమలులో లక్ష్యాలు చేరుకోవడంలో విఫలమయ్యారంటూ జిల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, హౌసింగ్‌ ఏఈలు, డీఈఈలు, ఈఈల జీతాలు నిలిపేయాలని జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 21న ఉత్తర్వులు సిద్ధం చేసిన కలెక్టర్‌, 24న వాటిని ట్రెజరీకి పంపారు.

వాటి ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి, టార్గెట్లు నిర్దేశించినా వాటిని చేరుకోవడంలో చిత్తూరు జిల్లాలో అధికారులు విఫలమయ్యారని కలెక్టర్ పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం విజయవంతం చేయలేకపోయారని అన్నారు. అందుకు గాను వేతనాల నిలుపుదల చేయాలంటూ ట్రెజరీ శాఖ చిత్తూరు డిప్యూటీ డైరెక్టర్‌కి ఆదేశాలు ఇచ్చారు.

పేదలందరికీ ఇళ్లు

ఇళ్ల నిర్మాణం ఎందుకు ఆలస్యం అవుతోంది?

2021లో రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.

తొలివిడతలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తామని ప్రకటించారు. కానీ, ఆ తర్వాత దాన్ని మరింత పెంచారు. అందుకోసం రూ. 28,000 కోట్లు వెచ్చిస్తామని వెల్లడించారు.

ఈ పథకంలో భాగంగా లబ్దిదారులకు మహిళల పేరుతో పట్టాలిచ్చారు. ఇంటి స్థలంతో పాటుగా ప్రభుత్వం నుంచి రూ. 1.8 లక్షల ఆర్థిక సహాయం అందుతుంది. మిగిలిన మొత్తం లబ్దిదారులు వేసుకుని ఇంటి నిర్మాణం చేయాలి.

కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై పేరుతో అమలు చేస్తున్న పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేస్తోంది. అయితే లక్ష్యాలు చేరడంలో ఏపీ ప్రభుత్వం వెనుకబడుతున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ఈ పథకంలో భాగంగా చిత్తూరు జిల్లాలో 72,272 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో కేవలం 10 వేల ఇళ్లు మాత్రమే పూర్తయినట్టు హౌసింగ్ అధికారుల నివేదికలు చెబుతున్నాయి. మిగిలిన ఇళ్లన్నీ వివిద దశల్లో ఉన్నట్టు చిత్తూరు జిల్లా హౌసింగ్ పీడీ పద్మనాభం బీబీసీతో చెప్పారు.

''కరోనా తర్వాత ఇంటి నిర్మాణ సామగ్రి రేట్లు పెరిగాయి. లేబర్, కంకర రాయి, ఇసుక, ఇటుక ఇలా అన్ని ధరలు భారమయ్యాయి. ప్రభుత్వం నుంచి రూ. 1.8 లక్షలతో ఇంటి నిర్మాణం పూర్తికాదు. లబ్దిదారులు తమ వాటా కింద మిగతా వ్యయాన్ని భరించాలి. అదే చాలామందికి సమస్య అవుతోంది. ఇంటి నిర్మాణానికి ముందుకు రాకుండా చేస్తోంది. ప్రభుత్వం ఉచితంగా స్థలం ఇచ్చినందున త్వరగా వాటిని పూర్తి చేయాలని చెబుతున్నాం. కానీ అత్యధికులు ఆర్థిక సమస్యతో కాలయాపన చేస్తున్నారు''అంటూ పద్మనాభం వివరించారు.

పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు

'ప్రభుత్వ విధానాలే కారణం..’

నిజానికి చిత్తూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రమంతా ఈ సమస్య ఉంది. అన్ని జిల్లాల్లోనూ అధికారులు ఎంత ఒత్తిడి పెడుతున్నా క్షేత్రస్థాయిలో లబ్దిదారులు ఎక్కువ మంది ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తిచేయలేకపోతున్నారు. అందుకు ప్రభుత్వమే కారణమని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందరాపు మురళి అంటున్నారు.

"ఇల్లు నిర్మించుకోవాలంటే స్థలం నివాస యోగ్యంగా ఉండాలి. పట్టణాలు, నగరాల్లో ఒక సెంటు స్థల... గ్రామాల్లో ఒకటిన్నర సెంటు మాత్రమే ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చింది. ఇంత తక్కువ స్థలంలో ఇరుకుగా ఇళ్లు కట్టుకుని ఉపయోగం లేదని చాలామంది లబ్ధిదారులు భావిస్తున్నారు. పైగా స్మశానాలు, వాగులు, చెరువులు, కొండలు, అడవులకు సమీపంలో ఆ భూమి పట్టాలిచ్చారు. అందుకే పట్టాలిచ్చినప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదు" అని ఆయన అభిప్రాయపడ్డారు.

''తిరుపతిలో ఉంటున్న పేదలకు కాళహస్తి దగ్గరున్న వాంపల్లి విలేజ్ సమీపంలో ప్లాట్లు ఇచ్చారు. ఇక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ కట్టుకోవడం సాధ్యమా. అందుకే ఒకటి కూడా గ్రౌండింగ్ జరగలేదు. తిరుపతిలో రోజువారీ కూలీ చేసుకునే వారికి అక్కడికి వెళ్లి రావాలంటే సాధ్యమా?" అంటూ మురళి ప్రశ్నించారు.

తొలుత మూడు ఆప్షన్లు ఇచ్చి, ప్రభుత్వమే ఇళ్లు నిర్మిస్తుందని చెప్పినప్పటికీ దానిని ఉపసంహరించుకోవడం సమస్యకు అసలు కారణమంటూ అభిప్రాయపడ్డారు.

లబ్దిదారుల సమస్యలేంటి?

తమ నివాస ప్రాతాలకు దూరంగా స్థలం ఇవ్వడం, పెరిగిన ధరలతో ఇంటి నిర్మాణ వ్యయం భారం కావడంతో పాటుగా మౌలిక సదుపాయాల విషయంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదనే ప్రజలు అంటున్నారు.

"మాకు ఇంటి పట్టా ఇచ్చారు. సొంత ఇల్లు కట్టుకుందామని ఆశ పడ్డాం. కానీ మాకు స్థలం ఇచ్చిన ప్రాంతానికి వెళ్లేందుకు రోడ్డు లేదు. అక్కడ కరెంటు లేదు. మంచినీరు అందుబాటులో లేదు. వాటిని ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అవేవీ లేకుండా అక్కడ ఇల్లు కట్టుకోవడం ఎలా అన్నది అర్థం కావడం లేదు. చాలామంది ఇల్లు కట్టుకోవడానికి ఆలస్యం అవ్వడానికి ఇదొక కారణం. పైగా అంతంతమాత్రపు జీతాలతో నెట్టుకొస్తున్న మాకు ఒకేసారి ఆరేడు లక్షలు ఖర్చు చేయడం సమస్యగానే ఉంది. ప్రభుత్వం ఇచ్చే మొత్తానికి ఇంకో మూడు, నాలుగు రెట్లు అవుతుంది. రోజురోజుకీ ధరలు పెరుగుతుండడం వల్ల ఇంకా సమస్య అవుతోంది" అంటూ మునియప్ప అనే లబ్దిదారుడు వివరించారు.

పేదలందరికీ ఇళ్లు

ఉద్యోగులను బాధ్యుల్ని చేస్తారా?

సమస్యకు కారణాలు తెలుసుకోకుండా ఉద్యోగులను వేధించేందుకు సిద్ధం కావడం ఏమిటంటూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం అసలు విషయం వదిలేసి ఉద్యోగుల వేతనాలు నిలిపివేయాలనడం తగదని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు.

''కష్టపడిన కాలానికి వేతనం తీసుకోవడం రాజ్యాంగ హక్కు. దానిని కాలరాయడం సరికాదు. అందరికీ జీతాలు ఆపేయమని చెప్పడం దుర్మార్గమైన చర్య. ప్రభుత్వ అధికారికి ఒకటో తేదీన జీతం ఇవ్వడమనేది ప్రభుత్వం బాధ్యత. పనిచేయని వారు ఎవరైనా ఉంటే మెమో ఇవ్వచ్చు కానీ మొత్తంగా జీతాలు ఆపడమనేది చాలా అన్యాయం''అని ఆయన తెలిపారు.

హౌసింగ్ ఇంజనీర్లకు ఇచ్చిన టార్గెట్లు పూర్తికావడం అంత సులువు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. లబ్దిదారులు స్పందించకపోతే ప్రభుత్వ సిబ్బందిని బాధ్యుల్ని చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు.

''ఇంజనీర్లకు టార్గెట్ ఇచ్చారు. కానీ, గోడౌన్ల సమస్య తీవ్రంగా ఉంది. అందువల్ల ఎక్కడబడితే అక్కడ సిమెంటు, స్టీల్ ఉంచాల్సి వస్తోంది. సిమెంట్ గడ్డకట్టడం, స్టీల్‌ చోరీ అయ్యే అవకాశం ఉంటుంది. ముందు అలాంటి సమస్యలు తీర్చండి. లబ్దిదారులు కూడా ఇళ్లుకట్టుకోవడానికి ముందుకు రావడం లేదు. అలాంటి అసలు సమస్యలు గుర్తించాలి. పథకంలో విధానపరమైన లోపాలను సరిచేయకుండా కింది ఉద్యోగులను బలి పశువులను చేయడం తగదు'' అంటూ బీబీసీతో అన్నారు.

చిత్తూరు కలెక్టరేట్

వెనక్కి తగ్గిన కలెక్టర్

వేతనాలు ఆపాలనే ఆదేశాలతో తీవ్రంగా విమర్శలు రావడంతో కలెక్టర్ వెనక్కి తగ్గారు. సెప్టెంబర్ 24న ట్రెజరీ అధికారులకు అందిన సర్క్యులర్ అమలు చేయడం లేదని జిల్లా ట్రెజరీ అధికారి రామచంద్ర తెలిపారు. ఆ ఉత్తర్వులు పక్కన పెట్టేయాలని తమకు కలెక్టరేట్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు బీబీసీకి తెలిపారు.

అయితే, కలెక్టర్ మాత్రం పాలనా పరమైన సమస్యలతోనే అలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. వేతనాలు నిలుపుదల చేసే ఆలోచన తమకు లేదని బీబీసీకి తెలిపారు.

''మాకు కొన్ని పాలనపరమైన సమస్యలు ఉంటాయి. ఆ ఉత్తర్వులు, ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం మాత్రమే. అంతమందికి మేం వేతనాలు ఎందుకు ఆపుతాం. శాలరీలు ఇచ్చేస్తున్నాం'' అని బీబీసీకి కలెక్టర్ హరి నారాయణన్ వివరణ ఇచ్చారు.

ఇప్పటికే సెప్టెంబర్ వేతనాలు అందరికీ అందించామని, అక్టోబర్ నెలకు సంబంధించిన వేతనాల విషయంలో కూడా ఎటువటి జాప్యం లేకుండా ప్రక్రియ పూర్తవుతోందని ట్రెజరీ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why is the construction of 'houses for the poor' delayed in Andhra Pradesh? Who is responsible for this delay?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X