వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విలయంలోనూ ఎన్నికలు ఎందుకు పెట్టారు.. పశ్చిమబెంగాల్ ఎలక్షన్స్ వల్లే దేశంలో కేసులు పెరిగాయా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కరోనా వైరస్

కోవిడ్‌ నిబంధనలను పాటించడం ఎన్నికల సంఘం బాధ్యత కాదా? ఇంతకన్నా జాగ్రత్తగా ఎన్నికలను నిర్వహించలేరా ? ఇలాంటి ప్రశ్నలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఎందుకంటే బీజేపీ తాము ర్యాలీలను మానేస్తామని ప్రకటించిన తర్వాతనే ఎన్నికల సంఘం ప్రచార ర్యాలీలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.

దేశంలో కోవిడ్ రెండో వేవ్‌కు ఎన్నికల సంఘమే కారణమని ఏప్రిల్ 27న మద్రాస్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

కోవిడ్ నిబంధనలను పట్టించుకోకుండా, ఎన్నికల ర్యాలీలకు అనుమతించిందని, ఈసీ అధికారులపై హత్యా అభియోగం నమోదు చేయాలని వ్యాఖ్యానించింది.

మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యల తర్వాత ఎన్నికల సంఘం దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. మే 2న ఓట్ల లెక్కింపు తర్వాత ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేసింది.

గెలిచిన అభ్యర్ధి ధ్రువీకరణ పత్రం కోసం రిటర్నింగ్ అధికారి దగ్గరికి వెళ్లడానికి మాత్రమే అనుమతి ఉందని, ఆ అభ్యర్ధితోపాటు ఇతరులెవరూ వెంట వెళ్లడానికి వీల్లేదని చెప్పింది.

అయితే, 2005 నాటి విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం కోవిడ్ నిబంధనలను అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర విపత్తు నివారణల సంస్థలదేనని, ఎన్నికల కమిషన్‌ది కాదని ఈసీ పేర్కొంది.

కోవిడ్ నిబంధనలను పాటించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదని, వాటిని అమలు చేయాల్సింది రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీయేనని కమిషన్ పేర్కొంది.

లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ గత ఏడాది బిహార్‌లో ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని ఈసీ గుర్తు చేసింది.

కరోనా వైరస్

ఎన్నికల సంఘం మాజీ అధికారులు ఏమంటున్నారు?

కోవిడ్ సమయంలో ఎన్నికల వ్యవహారంపై లోతుగా పరిశీలించడానికి మాజీ ఎన్నికల సంఘం ముఖ్య అధికారులను బీబీసీ సంప్రదించింది. వారిలో కొందరు తమ పేరు బయట పెట్టడానికి అంగీకరించ లేదు.

మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ మాత్రమే బహిరంగంగా మాట్లాడారు. అయితే తన మాటలను మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలకు స్పందనగా భావించరాదని ఆయన అన్నారు.

''ఇది పెద్ద సమస్య కాదు. మహమ్మారి ఉన్న సమయంలో ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఎన్నికలు జరిగాయి. దీని కారణంగా వైరస్ ఉద్ధృతి పెరిగినట్లు ఎక్కడా గుర్తించ లేదు.

కరోనా వైరస్

భారతదేశంలో కూడా ఎన్నికలు, కుంభమేళా లేనప్పటికీ, మహారాష్ట్రలో విపరీతంగా కోవిడ్ కేసులు వచ్చాయి. అలాగే ఎన్నికలు లేని గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో కోవిడ్ విజృంభణ ఎక్కువగా ఉంది. ఎన్నికలు జరిగినా, పశ్చిమ బెంగాల్‌లో కేసులు ఎక్కువ రాలేదు.'' అని రావత్ అన్నారు.

''ఎన్నికల సంఘం కోవిడ్ ప్రొటోకాల్‌ను ప్రకటించింది. దాన్ని అనుసరించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. కూలీల వలస కారణంగా కేసులు పెరిగితే దాన్ని ఎన్నికలతో ఎలా ముడిపెడతారు'' అని రావత్ ప్రశ్నించారు.

''మా కాలంలో ఎన్నికల సంఘం, న్యాయస్థానాలు ఎప్పుడూ లక్ష్మణ రేఖను దాటలేదు. గతంలో రాష్ట్రాలలో ఎన్నికలను ఒకే రోజులో నిర్వహించే వారు. తీవ్రహింస జరిగేది.

కానీ నేడు ఎవరూ ఎన్నికల ప్రక్రియను పట్టించుకోవడం లేదు. అందరి దృష్టి ఫలితాలపైనే ఉంది.'' అని ఎన్నికల కమిషన్ మాజీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఆయన తన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు.

గత ఏడాది కోవిడ్‌తో పరిస్థితి క్షీణించడం మొదలు పెట్టినప్పుడే, ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న దానిపై అధికారులు దృష్టి పెట్టారని ఈసీ మాజీ అధికారులు కొందరు చెప్పారు.

'' మహమ్మారి సమయంలో కూడా దక్షిణ కొరియాలో ఎన్నిక ప్రక్రియ కొనసాగింది. ఏయే దేశం ఎలా ఎన్నికలు నిర్వహిస్తుందో, వాటి ప్రభావం ఎలా ఉందో గమనించాలని మేం సూచించాం'' అని ఓ మాజీ అధికారి వెల్లడించారు.

మహమ్మారి సమయంలో ఎన్నికల ప్రక్రియలో మార్పులు చేయాలనుకుంటే రాజ్యసభ ఎన్నికలు, రాష్ట్రాలలో జరిగే ఉప ఎన్నికల్లో ప్రయోగాలు చేసి చూడాలని అధికారులు ఎన్నికల సంఘానికి సూచించారు.

వైరస్ ప్రభావం ఉన్నా ఎన్నికలు నిర్వహించడం పెద్ద సమస్య కాదని అధికారులు అన్నారు.

బిహార్ ఎన్నికల తర్వాత ఆ రాష్ట్రంలో కేసులు పెరగకపోవడంతో, వైరస్ వ్యాప్తి గురించి కొందరు అతిగా ప్రచారం చేశారని చాలామంది భావించారు.

కరోనా వైరస్

వ్యతిరేకత

గత సంవత్సరం బిహార్ ఎన్నికలకు చాలా వారాల ముందు బీజేపీ భారీ వర్చువల్ ర్యాలీని నిర్వహించింది. అప్పుడు, మిగిలిన పార్టీలు దీనికి నిరసనగా ఈసీకి లేఖ రాశాయి.

ఇలాంటి ర్యాలీలు నిర్వహించడానికి తమ వద్ద వనరులు లేవని అందులో పేర్కొన్నాయి.

వర్చువల్ ర్యాలీ సమయంలో అయ్యే ఖర్చులను గుర్తించడం కష్టమన్నది ప్రతిపక్ష పార్టీల వాదన. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను రూపొందించి ఉండాల్సిందని కొందరు అధికారులు అన్నారు.

వర్చువల్ ర్యాలీకి ఎంత ఖర్చవుతుంది?

అయిదు రాష్ట్రాల ఎన్నికలలో వర్చువల్ ర్యాలీలను చాలా సమర్థంగా ఉపయోగించుకోవచ్చని ఎన్నికల కమిషన్ మాజీ కమిషనర్లు అభిప్రాయపడ్డారు.

''ప్రచారం కేవలం 14 రోజులు మాత్రమే ఉండాలని ప్రజాప్రాతినిధ్య చట్టం చెబుతోంది. ఎన్నికల్లో ఖర్చు మొదటి నుంచీ సమస్యే. అందువల్ల ప్రచార కాలాన్ని తగ్గించినట్లయితే వ్యయం కూడా తగ్గేది. కానీ ఈ విషయంలో ఈసీ మంచి అవకాశాన్ని జార విడుచుకుంది.’’ అని వారు అన్నారు.

మహమ్మారి కారణంగా ఎన్నికలను కొన్నాళ్లు వాయిదా వేయడానికి ఈసీకి అవకాశం ఉందని ఆ సంస్థ మాజీ అధికారులు చెబుతున్నారు.

''ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంటే, ఎన్నికలు నిర్వహించే స్థితిలో లేమని ఈసీ చెప్పవచ్చు. అయితే ఆ విషయం చెప్పగలగాలంటే, ఈసీ దీనిపై స్వతంత్రంగా అంచనా వేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు కూడా అవసరం'' అని ఎన్నికల సంఘానికి చెందిన ఓ మాజీ అధికారి అన్నారు.

ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని ఈసీ చెప్పే అవకాశం ఉందని, 2002 గుజరాత్‌లో ఇలాగే జరిగిందని వారు గుర్తుచేశారు.

''చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జె.ఎం. లింగ్డో నేతృత్వంలోని కమిషన్ బృందం.. గుజరాత్‌లో తాము ఎన్నికలు నిర్వహించలేమని చెప్పింది. చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి లేదని తాము భావిస్తున్నామని వెల్లడించింది.

ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా, ఎన్నికల కమిషన్ అధికారాలను ప్రశ్నిస్తూ గుజరాత్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. అయితే, కోర్టు.. కమిషన్‌కు మద్దతుగా తీర్పు ఇచ్చింది." అని ఎన్నికల సంఘం మాజీ అధికారి ఒకరు గుర్తు చేశారు.

ఒక శాసన సభ పదవీ కాలం ముగిసిన 180 రోజుల(ఆరు నెలలు)లోపు ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ కట్టుబడి ఉందని అధికారులు చెబుతున్నారు. మహమ్మారి సమయంలో ఈ 180 రోజుల వ్యవధిని కూడా ఉపయోగించుకోవచ్చు.

కరోనా వైరస్

మమతా బెనర్జీ కోరినట్లు ఎన్నికల తేదీలను మార్చవచ్చా ?

సాధ్యమేనని, అయితే దీనికి కొత్తగా మరో నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం మాజీ అధికారి ఒకరు చెప్పారు.

''ఎన్నికల తేదీలను మార్చే అధికారం కమిషన్‌కు ఉంది. ఆరు, ఏడు, ఎనిమిది దశల ఎన్నికలను కలిపి ఒకేసారి నిర్వహించ వచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది'' అన్నారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
elections held when Corona was at its peak
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X