పుట్టింది ఇటలీలోనే అయినా, చచ్చేది మాత్రం ఇక్కడే: సోనియా ఉద్వేగం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం ఒక్కసారిగా రాజకీయ వేడిని పుట్టించింది. పార్లమెంట్ సాక్షిగా రాజ్యసభలో బీజేపీకి చెందిన నేత సుబ్రమణ్యస్వామి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై తీవ్ర విమర్శలు చేస్తే, కాంగ్రెస్ సైతం ఆ విమర్శలను ఎదురుదాడితో తిప్పికొట్టింది.
ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనపై చేస్తున్న దాడిని తిప్పికొట్టే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సోమవారం ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. కేరళలో సోమవారం ఆమె ఎన్నికల ప్రచారాన్ని ఆమె ప్రారంభించారు. త్రిసూర్‌లోని తేనింకాడు మైదానంలో జరిగిన బహిరంగ సభలో సోనియా చేసిన ప్రసంగం ఉద్వేగభరితంగా సాగింది.
ఇటలీలోనే పుట్టిన తాను తుది శ్వాస విడిచేది మాత్రం ఇక్కడేనని ఆమె ప్రకటించారు. తన అస్థికలు కలిసేది కూడా ఇక్కడి నీటిలోనేనని ఆమె పేర్కొన్నారు. సోనియా ఇటలీ మూలాలకు సంబంధించి ప్రధాని మోడీ చెణుకులు విసిరిన నేపథ్యంలో ఆమె కూడా కాస్తంత ఘాటుగానే స్పందించారు.

''అవును. నేను ఇటలీలోనే పుట్టాను. ఇందిరా గాంధీ కోడలిగా మారిన తర్వాత గడచిన 48 ఏళ్ల నుంచి నేను ఇక్కడే ఉంటున్నా. నిజాయితీ పరులైన, గొప్ప తల్లిదండ్రులకు నేను జన్మించాను. వాళ్లు సిగ్గుపడేలా నేను ఏ పనీ చేయలేదు. అవును. ఇటలీలో నాకు బంధువులు ఉన్నారు.' అని అన్నారు.
'నాకు 93 ఏళ్ల తల్లి, ఇద్దరు అక్కచెల్లెళ్లున్నారు. అయినా సరే ఇది నా దేశం. భారతదేశమే నా ఇల్లు. ఇక్కడి ప్రజలతోనే నా రక్త సంబంధం. నేను నా చివరి శ్వాసను ఇక్కడే వదులుతా. నా అస్థికలు నేను ప్రేమించే నదుల్లో కలిసేదీ ఇక్కడే'' అని ప్రధాని మోడీని ఉద్దేశించి సోనియా ఘాటుగా, భావోద్వేగభరితంగా వ్యాఖ్యానించారు.
తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ప్రధాని మోడీ అబద్దాలు ఆడుతున్నారని, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. తన వ్యక్తిత్వాన్ని సవాల్ చేయడానికి మోడి ఎంత కిందికైనా దిగజారవచ్చని, కానీ భారత్ పై నా ప్రేమను చిత్తశుద్ధిని మాత్రం ఆయనదూరం చేయలేరని ఆమె వ్యాఖ్యానించారు.
తన జాతీయతను ప్రధాని నరేంద్ర మోడీ కానీ, బీజేపీ సిద్ధాంతకర్త ఆరెస్సెస్ కానీ అర్థం చేసుకోలేరని, వారు అర్థం చేసుకుంటారని కూడా తాను భావించడం లేదని కూడా సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాలను ప్రధాని మోడీ కుట్రలు, కుతంత్రాలతో రాజ్యాంగ విరుద్ధంగా కూల్చి వేశారని మండిపడ్డారు.
విశ్వవిద్యాలయాలు, న్యాయ వ్యవస్థ, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజానికి బీజేపీ ప్రభుత్వం పెనుముప్పుగా మారిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రాజకీయ పార్టీలు, ఇతర సంఘాలను ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఆర్భాటపు ప్రదర్శనలకు సమయం వెచ్చిస్తున్న ప్రధాని రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.












Click it and Unblock the Notifications