యూపీలో ఆగని అత్యాచారాలు.. కాపాడాల్సిన పోలీసే కాటేశాడు.. మరో ఘటనలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం...
మహిళలపై అత్యాచార వార్తలతో ఉత్తరప్రదేశ్ నిత్యం వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. కొద్దిరోజుల క్రితమే బదౌని జిల్లాలోని ఉఘాటిలో 50 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా జలాలాబాద్‌కి చెందిన పోలీస్ అధికారి ఒకరు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో ఘటనలో ఓ ప్రభుత్వ అధికారి అత్యాచారానికి గురైన విషయం వెలుగుచూసింది.

కేసు విషయమై పిలిచి అత్యాచారం...
బాధితురాలి కథనం ప్రకారం... షాజన్‌పూర్‌లోని కలన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ మహిళ గతేడాది వరకట్న వేధింపులపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో కలన్ సబ్ ఇన్‌స్పెక్టర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కేసును పరిష్కరిస్తానని చెప్పిన సదరు సబ్ ఇన్‌స్పెక్టర్ ఆ విషయమై మాట్లాడేందుకు రావాలని చెప్పి గతంలో ఆమెపై ఓసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై సెప్టెంబర్ 2,2020న ఆమె కలన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదైంది.

మరోసారి ఆమెపై అత్యాచారం చేసిన పోలీస్...
ఈ కేసులో పోలీసుల దర్యాప్తుపై అభ్యంతరాలను లేవనెత్తుతూ ఈ ఏడాది జనవరి 8న షాజన్‌పూర్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన బాధితురాలు... అక్కడ తన పిటిషన్‌ను సమర్పించింది. షాజన్‌పూర్ నుంచి కలన్‌కు తిరిగొచ్చే క్రమంలో మార్గమధ్యలో నిందితుడైన సబ్ ఇన్‌స్పెక్టర్ ఆమెను కలిశాడు. ఆమెను తన వెంట రావాలని తీసుకెళ్లి ఓ నిర్మానుష్య ప్రదేశంలో మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తతంగాన్ని అతను సెల్‌ఫోన్‌లో వీడియో కూడా తీశాడు. అంతేకాదు,ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. తాజాగా బాధితురాలు కలన్ పోలీసులను ఆశ్రయించి దీనిపై ఫిర్యాదు చేయడంతో అత్యాచార విషయం వెలుగుచూసింది.

ప్రభుత్వ ఉద్యోగినిపై రేప్...
ఇదే షాజన్‌పూర్ జిల్లాలో మరో అత్యాచార ఘటన కూడా వెలుగుచూసింది. బరేలీలో పనిచేసే ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు,ఆమె నగ్న ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. గత మూడేళ్ల నుంచి అతని నుంచి వేధింపులను ఎదుర్కొంటున్నట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మూడు రోజుల క్రితం గోందా జిల్లాలో...
మూడు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని గోందా జిల్లాలోనూ ఓ అత్యాచార ఘటన వెలుగుచూసింది. తన సహచర పోలీస్ అయిన శైలేష్ కుమార్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళా పోలీస్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తాను ఉంటున్న గదిని చూపిస్తానని తీసుకెళ్లి అక్కడ తనను బెదిరింపులకు గురిచేసి అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం బయటకు పొక్కితే తనను చంపేస్తానని బెదిరించినట్లు చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.