పీకలదాక తాగేసింది: పోలీసులపై చిందులేసింది
ముంబై: మద్యం మత్తులో పోలీసులను అమ్మనాబూతులు తిట్టిన మహిళను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. తాను మందు తాగలేదని, అసలు తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నిస్తూ నానా రాద్దాంతం చేసిన మహిళ చివరికి పోలీసులకు చిక్కింది.
ముంబై నగరంలోని బాంద్రా ప్రాంతంలో నిత్యం మద్యం సేవించి రాత్రి పూట వాహనాలు నడిపి ప్రమాదాలు సృష్టిస్తున్నారని గుర్తించిన పోలీసు అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రతి వాహనం నడుపుతున్న వారిని పరిమితికి మించి మద్యం సేవిస్తున్నారా అని తనిఖీలు చేస్తున్నారు.
సోమవారం రాత్రి కారులో 34 సంవత్సరాల మహిళ అటు వైపు వెళ్లింది. ఆమె కారు నిలిపి పరిశీలించారు. ఆమె పరిమితికి మించి పీకలదాక మద్యం సేవించిందని గుర్తించారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొవడానికి ప్రయత్నించారు.

అయితే ఆమె తాను మద్యం సేవించలేదని, మీ అంతు చూస్తానని, తనను ఎవరనుకుంటున్నారని నానా హంగామా చేసి బూతులు తిట్టి తన కారులోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంది. అక్కడే కారులో మ్యూజిక్ పెట్టుకుని రెండు గంటల పాటు హాయిగా పాటలు వినింది.
అప్పటికే విసిగిపోయిన ట్రాఫిక్ పోలీసులు పై అధికారులకు సమాచారం ఇచ్చారు. పై అధికారుల ఆదేశాల మేరకు కారు డోర్ అద్దం పగలగొట్టి డోర్ లాక్ తీసి ఆమెను అదుపులోకి తీసుకొవడానికి ప్రయత్నించారు. అయితే ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించింది.
అక్కడి నుండి ఆటో ఎక్కింది. అయితే మీడియా ఆమెను వెంబడించడంతో వారి మీద తిట్ల పురాణం మొదలు పెట్టింది. చివరికి పోలీసులు ఆమెను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లారు. ఆమె కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత వారం మహిళ న్యాయవాది జాహ్నవి గడ్కర్ (35) మద్యం సేవించి కారు నడిపి ప్రమాదం సృష్టించడంతో ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications