Year Ender 2024: 419 మందిని పొట్టనబెట్టుకున్న మహా విపత్తు
Wayanad landslide: ఈ ఏడాది- కేరళను పెను విషాదంలో ముంచెత్తింది. ఆ రాష్ట్ర చరిత్రలో చేదు సంవత్సరంగా మిగిలిపోయింది. వందలాది కుటుంబాలను అనాథలను చేసింది. ఊర్లకు ఊర్లను సైతం తుడిచిపెట్టేసిన మహా దుర్ఘటన మలయాళీలను పీడకలగా మిగిల్చింది.
419 మంది దుర్మరణం..
వాయనాడ్ జిల్లాలో ఈ ఏడాది జులై 29వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత కొండచరియలు విరిగిపడిన ఘటన తెలిసిందే. ఈ ఘటనలో పలు గ్రామాలు చిక్కుకుపోయాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బురద ప్రవాహం ఆయా గ్రామాలను ముంచెత్తింది. ఈ దుర్ఘటనలో 419 మంది సజీవ సమాధి అయ్యారు.

భారీ వర్షాలతో అల్లకల్లోలం..
అంతకుముందు కొద్దిరోజుల ముందు నుంచీ అతి భారీ వర్షాలు కేరళను ముంచెత్తాయి. భయంకపితులను చేశాయి. ప్రత్యేెకించి- కేరళ ఉత్తరప్రాంతంలో వర్షాల తీవ్రత అధికంగా కనిపించింది. దీని తాకిడికి వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. జిల్లాలోని మెప్పాడి, ముండక్కై టౌన్, చూరల్‌మాలా గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. కొండచరియలు విరిగి జనావాసాల మీద పడ్డాయి. అదే సమయంలో బురద ప్రవాహం ఆయా గ్రామాలను ముంచెత్తింది.
ముండక్కైలో తొలి ఘటన..
అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంటకు తొలి దుర్ఘటన సంభవించింది. ముండక్కై టౌన్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. తెల్లవారు జామున 4 గంటల సమయంలో చూరల్‌మాలాలో రెండో ప్రమాదం చోటు చేసుకుంది. కోజికోడ్ జిల్లా వనిమాళ్ గ్రామ పంచాయితీ పరిధిలోని విలంగాడ్ వద్దా కొండచరియలు విరిగిపడ్డాయి.
వీధుల్లో ప్రవహించిన బురద..
ఉరుట్టిలో కొత్తగా నిర్మించిన వంతెన కొట్టుకుపోయింది. అక్కడ బురద నీటితో కూడిన వరద ఉప్పెలా విరుచుకుపడటం కనిపించింది. పలు నివాసాలు ధ్వంసం అయ్యాయి. వీధుల్లో బురద ప్రవహించింది. కార్లు, జీపులు సైతం కొట్టుకుపోయాయంటే బురద ప్రవాహం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోసుకోవచ్చు.

మూడు జిల్లాలు ప్రభావితం..
మొత్తం మూడు జిల్లాలు ప్రభావితం అయ్యాయి. మెప్పాడి, ముండక్కై, చూరల్‌మాలా, ఆట్టమాలా, వెల్లారిమాల, పుంచిరిమట్టం,వనిమాల్ గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బురద ప్రవాహం ఆయా గ్రామాలను ముంచెత్తింది. ఓ మోస్తరు కట్టడాలు సైతం బురద ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
అత్యధిక మరణాలు..
చూరల్‌మాలా దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. అత్యధిక మరణాలు ఇక్కడే సంభవించినట్లు చెబుతున్నారు. కొన్ని భారీ భవనాలు మినహా మిగిలిన నివాసాలన్నీ బురద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. గ్రామం మొత్తం బురద పేరుకుపోయి కనిపించింది. వాటి మధ్యలో నుంచి మృతదేహాలను వెలికి తీశారు.
వరద తాకిడి..
ముండక్కై, మెప్పాడి, ఆట్టమాల, విలాంగాడ్ వంటి ప్రాంతాల్లో బురద తొలగించిన కొద్దీ మృతదేహాలు వెలుగులోకి వచ్చాయి. పణమారంపుజ, కరమంథోళ్, కబిని నదులు వరద తాకిడికి గురయ్యాయి. వంతెనలు ధ్వంసం అయ్యాయి. కొండచరియలు విరిగిపడటం వల్ల బురద, చెట్లు.. ఎక్కడెక్కడి నుంచో కొట్టుకొస్తోన్నాయి. తీర ప్రాంత గ్రామాలు, పట్టణాలను ముంచెత్తాయి.












Click it and Unblock the Notifications