పార్లమెంట్ ప్రారంభోత్సవం ప్రజాస్వామ్య చరిత్రలోనే సువర్ణాధ్యాయం- యోగీ ఆదిత్యనాథ్..
భారత్ లో స్వాతంత్రం తర్వాత కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించుకోవడం దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే సువర్ణాధ్యాయంగా యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అభివర్ణించారు. ప్రధాని మోడీతో కలిసి పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న యోగీ.. అనంతరం ఈ కార్యక్రమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే వివాదం రేపిన సెంగోల్ తో పాటు పలు అంశాలపై తన అభిప్రాయాల్ని వెల్లడించారు.
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని కొత్త ఇండియా ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చే కార్యక్రమంగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. అలాగే వివాదాలు రేపిన సెంగోల్ (రాజదండం)పైనా యోగీ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. సెంగోల్ భారత న్యాయం, పారదర్శకత, సౌభ్రాతృతం, బలానికి చిహ్నంగా యోగీ అభివర్ణించారు. పార్లమెంట్ ప్రారంభం ఓ చారిత్రక ఘట్టమని యోగీ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.

ప్రధాని మోడీ కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేస్తున్న వేళ దేశ ప్రజలందరికీ యోగీ శుభాకాంక్షలు తెలిపారు.
సెంగోల్ గౌరవం యొక్క ఏకీకృత వ్యక్తీకరణ అని అన్నారు. భారత దేశ అమృతకాల వేళ ఈ కార్యక్రమం చేపట్టడం చారిత్రక ఘట్టంగా యోగీ తెలిపారు. ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్ దిశగా పడిన పెద్ద అడుగుగా దీన్ని ఆయన అభివర్ణించారు. అలాగే కొత్త పార్లమెంట్ నిర్మాణంలో పాల్గొన్న కార్మికులు, అధికారుల్ని యోగీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజాస్వామ్య చిహ్నంగా, దేశ ప్రజల ఆత్మగౌరవ సంకేతంగా దీన్ని నిర్మించారని ప్రశంసించారు.












Click it and Unblock the Notifications