యూపీలో మహిళలే డ్రైవర్లు, కండక్టర్లుగా బస్సులు-ప్రారంభించిన యోగీ..
దేశవ్యాప్తంగా ఇప్పుడ ఎక్కడ చూసినా మహిళా మంత్రం జపిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదించాక రాష్టాల్లో దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అదే సమయంలో మహిళా సాధికారిత కోసం మరిన్ని అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం యూపీలో పూర్తిగా మహిళలే నడిపే 51 బస్సుల్ని తాజాగా సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రారంభించారు.
"మిషన్ మహిళా సారధి" పేరుతో ప్రత్యేక మహిళా బస్సుల్ని సీఎం యోగీ ఆదిత్యనాథ్ దుర్గాష్టమి సందర్భంగా అయోధ్యలో ప్రారంభించారు. ఇప్పటివరకూ మహిళా బస్సులంటే అందులో మహిళలు మాత్రమే ప్రయాణించేందుకు వీలుండేది. కానీ ఇప్పుడు ఈ బస్సుల్ని మహిళలే డ్రైవర్లు, కండక్టర్లుగా నడుపుతుండటంతో వారి భద్రతకు మరింత భరోసా కల్పించినట్లయింది. ఈ బస్సుల ప్రారంభోత్సవంలో సీఎం యోగీ కీలక వ్యాఖ్యలు చేశారు.

"మిషన్ మహిళా సారథి ప్రారంభంతో పాటు మిషన్ శక్తితో అనుసంధానం చేయడానికి 'మహా అష్టమి' కంటే సరైన సందర్భం మరొకటి ఉండదని సీఎం యోగీ ఆదిత్యనాత్ తెలిపారుప. ఈ నిర్ణయం మహిళా డ్రైవర్లు , కండక్టర్లను అనుసంధానం చేయడానికి , సాధికారత కల్పించడానికి ఉపయోగపడుతుందన్నారు. సమాజం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే మహిళలకు గౌరవం తప్పదని ముఖ్యమంత్రి అన్నారు.
మహిళల భద్రత, స్వావలంబన, గౌరవానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని సీఎం యోగీ ఆదిత్యనాథ్ వెల్లడించారు. మిషన్ శక్తి నాల్గో దశ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పిస్తుందన్నారు. మన భారతీయ సమాజం ఎప్పుడూ స్త్రీల గౌరవాన్ని కాపాడుతుందని నమ్ముతుందని యోగీ తెలిపారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మిషన్ శక్తి నాల్గవ దశలో భద్రత, గౌరవం, స్వావలంబన ఆలోచనను ప్రచారం చేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications