ప్యారిస్‌పై ఉగ్రవాదుల దాడి: 128మంది మృతి
ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 9 గంటలకు (భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారు జామున 3 గంటలకు) ప్యారిస్ నగరంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాల్పులు, ఆత్మాహుతి పేలుళ్లు సంభవించాయి.
ఈ సంఘటనల్లో ఇప్పటివరకు 128 మందికిపైగా చనిపోయినట్లు సమాచారం. మరో 300 మందికిపైగా గాయపడగా, పలువురిని ఉగ్రవాదులు బందీలు చేసుకున్నట్లు తెలిసింది. లెవెన్త్ డిస్ట్రిక్ట్ లోని ఓ రెస్టారెంట్ లోకి చొరబడ్డ ఓ దుండగుడు ఇష్టారీతిగా కాల్పులు జరిపి కొద్దిమందిని బందీలుగా చేసుకున్నాడని మొదట వార్తలు వెలువడ్డాయి.

కొద్దిసేపటికే బటాక్లాన్ ఆర్ట్ సెంటర్ ప్రాంతంలోనూ కాల్పులు జరిగాయని పోలీసులకు సమాచారం అందింది. అంతలోనే ఓ బార్‌లో పేలుడు జరిగినట్లు తెలిసింది. జర్మన్లు అధిక సంఖ్యలో వచ్చే ఈ బార్‌ను ఉగ్రవాదులు ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
కాల్పుల కలకలంతో ఉలిక్కిపడ్డ ఫ్రాన్స్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఆత్మాహుతి దాడితో ఓ మ్యాచును వీక్షిస్తున్న దేశాధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేను హుటాహుటిన సురక్షితప్రాంతానికి తరలించాయి భద్రతా దళాలు.
కాగా, కనీసం 10 మంది రోడ్డుపై చనిపోయి ఉండటాన్ని గమనించానని, కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని రెస్టారెంట్‌లో చిక్కుకుపోయిన బీబీసీ జర్నలిస్ట్ ఒకరు సమాచారం అందించారు. మొత్తం ఆరుగురు సాయుధులు నగరంలోకి చొరబడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
కొద్ది నెలల కిందట పారిస్ లోని చార్లీ హెబ్డో పత్రికా కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి, ఆ తరువాత రెండు మూడు సార్లు కాల్పులతో ఉగ్రవాదులు పారిస్‌ను లక్ష్యం చేసుకున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications