ఆప్ఘన్ నుంచి తెచ్చిన వారిలో 16 మందికి కరోనా-మొత్తం 78 మందీ క్వారంటైన్ కు తరలింపు
ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల దురాక్రమణతో చిక్కుకుపోయిన వారిని కేంద్రం సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తోంది. ఇప్పటికే పలు విడతలుగా కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి వీరిని స్వదేశానికి తరలించింది. కొందరిని ఆప్ఘనిస్తాన్ నుంచి గల్ఫా దేశాలకు తీసుకెళ్లి మరీ అక్కడి నుంచి భారత్ తీసుకొస్తున్నారు. ఇదే క్రమంలో వీరిలో కొందరికి కరోనా సోకడం కలకలం రేపుతోంది.
ఆప్ఘనిస్తాన్ నుంచి భారత్ కు తాజాగా తీసుకొచ్చిన 78 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో వీరిలో 16 మంది కరోనా పాజిటివ్ గా తేలారు.. దీంతో వెంటనే కేంద్రం అప్రమత్తమైంది. పాజిటివ్ గా తేలిన 16 మందితో పాటు మొత్తం 78 మందినీ కరోనా క్వారంటైన్ సెంటర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో మరో విశేషం కూడా ఉంది. ఇలా కరోనా పాజిటివ్ గా తేలిన వారంతా ఎలాంటి లక్షణాలు లేని వారే. దీంతో ఇంకెందరికి కరోనా సోకిందనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Recommended Video
ప్రస్తుతం కరోనా పాజిటివ్ గా తేలిన వారితో పాటు మిగతా ప్రయాణికులతోనూ పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ టచ్ లో ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలోని నజఫ్ ఘర్ లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లో వీరిని దేశంలో ఉన్న కరోనా మార్గదర్శకాల ప్రకారం 14 రోజుల పాటు క్వారంటైన్ కొనసాగుతుందని కేంద్రం తెలిపింది. వాస్తవానికి ఆప్ఘనిస్తాన్ ప్రస్తుత పరిస్ధితుల దృష్ట్యా విమాన ప్రయాణాలకు ముందు కరోనా పరీక్షలు నిర్వహించడం లేదు. దీంతో విమానాలు ఎక్కే వారిలో ఒకరికి కరోనా ఉన్నా మిగతా వారికి సోకే ప్రమాదం పొంచి ఉంది. ఇలా ఆప్ఘనిస్తాన్ నుంచి తాజాగా భారత్ వచ్చిన వారిలో ఎవరో కొందరి ద్వారా మిగతా వారికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి 16 మందికే పాజిటివ్ గా తేలినా మరికొందరికి కూడా వైరస్ సోకి ఉండొచ్చని తెలుస్తోంది. అందుకే వీరికి క్వారంటైన్ సమయం ముగిసేవరకూ అప్రమత్తంగా ఉండాలని అధికారుల్ని కేంద్రం ఆదేశించింది.












Click it and Unblock the Notifications