ఐసిస్ సెల్ఫీ: 22గంటల్లో హెడ్ ఆఫీస్‌ని నేలమట్టం చేసిన అమెరికా సైన్యం
వాషింగ్టన్: తమ సంస్థకు సంబంధించిన కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థల గురించి గొప్పలు చెప్పుకుంటూ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు సామాజిక మీడియాలో పెట్టిన ఓ సెల్ఫీ వారి పైన దాడికి ఉపయోగపడింది.
ఈ సెల్ఫీ ఆధారంగా 22 గంటల్లోనే అమెరికా దళాలు సిరియాలోని ఉగ్రవాద ప్రధాన కార్యాలయాన్ని గుర్తించి, నేల మట్టం చేశారు. ఉగ్రవాదుల నియామకం, అనుభవాలు పంచుకోవడానికి, విజయాలను వెల్లడి చేయడానికి సామాజిక మీడియాను ఐసిస్ ఉగ్రవాదులు ఉపయోగించుకుంటున్నారు.
ఈ సంస్థ 1700 ఫొటోలను, వీడియోలను, ఇతర పోస్ట్‌లను సామాజిక మీడియాలో ఉంచింది. దీన్ని ఆధారంగా చేసుకొని ఐసిస్ ఉగ్రవాదుల ఆచూకీని పట్టుకునేందుకు అమెరికా దళాలు ప్రయత్నిస్తున్నాయి.

ఐసిస్‌కు చెందిన ఒక నిర్దేశక, నియంత్రణ కేంద్రం ఎదుట నిలబడి తీసుకున్న సెల్ఫీని చూసిన 22 గంటలకే అమెరికా యుద్ధవిమానాలు ఆ ప్రదేశానికి చేరాయని వైమానిక పోరాట విభాగం కమాండర్ హాక్ కార్త్లెల్ తెలిపారు.
మరోవైపు, ఐసిస్‌కు చెందిన ముగ్గురు ఆత్మాహుతిదళ సభ్యులు జరిపిన దాడిలో 41 మంది ఇరాక్ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సోమవారం అన్బర్ రాష్ట్రంలోని తార్తార్‌లో జరిగింది.
పేలుడు పదార్థాలు నింపిన వాహనాలతో వచ్చిన ఉగ్రవాదులు స్థానిక పోలీస్ స్టేషన్‌పై దాడులు జరిపారు. దీంతో, ఆయుధాగారంలో కూడా భారీ పేలుడు సంభవించింది. ఈ దాడిలో 41 మంది పోలీసులు, షియా పౌర సైనికులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.












Click it and Unblock the Notifications