విమానం గాల్లో ఉండగా.. వెలువడిన పొగలు
మొన్నటికి మొన్న అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటనలో 270 మంది దుర్మరణం పాలయ్యారు. విమానంలో ఒక్కడు మినహా మిగిలిన ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారు. దీని తరువాత ఎయిరిండియా విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తడం కనిపించింది. ప్రయాణికులను భయాందోళనలకు గురి చేసింది.
తాజాగా అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం ఇదే తరహా ముప్పును ఎదుర్కొంది. ఏ చిన్న పొరపాటు జరిగి ఉన్నా.. పెను ప్రమాదం సంభవించి ఉండేదే. ఆ సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించారు. చాకచక్యంగా ఈ ప్రమాదాన్ని తప్పించారు. సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేయగలిగారు.

ఈ ఘటన అమెరికా లాస్ వెగాస్ లో చోటు చేసుకుంది. 153 మంది ప్రయాణికులతో ఎయిర్ బస్ ఏ321 ఫ్లైట్ నంబర్ 1665.. ఇక్కడి హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నార్త్ కరోలినాకు బయలుదేరింది. ఛార్లొటె డగ్లస్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ కావాల్సి ఉంది.
టేకాఫ్ తీసుకున్న మరుక్షణమే విమానానికి చెందిన ఓ ఇంజిన్ నుంచి నల్లటి పొగ వెలువడింది. ఆ సమయంలో ఇంజిన్ లో స్వల్పంగా మంటలు సైతం చెలరేగాయి. స్పార్క్స్ కనిపించాయి. దీనితో వెంటనే పైలెట్లు విమానాన్ని వెనక్కి మళ్లించారు. లాస్ వెగాస్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
ఈ సంఘటనను అమెరికన్ ఎయిర్ లైన్స్ యాజమాన్యం ధృవీకరించింది. సురక్షితంగా ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయినట్లు తెలిపింది. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని,. ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులు కిందికి దిగారని పేర్కొంది. పైలెట్లు చాకచక్యంతో వ్యవహరించారాని అభినందించింది. ప్రయాణికులకు వీలైనంత త్వరగా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని వివరించింది.












Click it and Unblock the Notifications