అమెరికా వీసా, గ్రీన్ కార్డు దరఖాస్తు దారులకు మరో షాక్..! సోషల్ పోస్టులకూ..!
అమెరికా వీసా, గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారికి ప్రభుత్వం మరో షాకిచ్చింది. ఇప్పటికే వలసదారుల్ని దేశం నుంచి సాధ్యమైనంత వేగంగా బహిష్కరించేందుకు ప్రయత్నిస్తున్న ట్రంప్ సర్కార్.. వీసా, గ్రీన్ కార్డుదారులపైనా తనిఖీలు పెంచింది. ఇదే క్రమంలో కొత్తగా వీసా, గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి మరో షాకిచ్చింది. ఈ మేరకు అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కీలక ప్రకటన చేసింది.
అమెరికా వీసాలు, గ్రీన్ కార్డులు కోరుకుంటున్న వారిని ఫిల్టర్ చేసేందుకు ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇకపై యూదులకు వ్యతిరేకంగా తీవ్రవాద సంస్థలకు మద్దతుగా ఎలాంటి సోషల్ మీడియా పోస్టులు పెట్టినా వారికి వీసాలు, గ్రీన్ కార్డులు ఇచ్చేది లేదని తేల్చిచెప్పేసింది. ఈ మేరకు దరఖాస్తుదారుల సోషల్ మీడియా హ్యాండిల్స్ పై నిఘా పెడతామని ప్రకటించింది.

ఇప్పటికే అమెరికా ఉగ్రవాద సంస్థలుగా గుర్తించిన హమాస్, హౌతీ, హెజ్బొల్లాతో పాటు మరికొన్ని సంస్థలకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వారి వీసా, గ్రీన్ కార్డు దరఖాస్తుల్ని తిరస్కరించాలని సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ నిర్ణయించింది. ఆయా గ్రూపులకు మద్దతుగా పెట్టే పోస్టుల్ని యూదు వ్యతిరేక చర్యలుగా పరిగణిస్తామని తెలిపింది. ఉగ్రవాదుల సానుభూతిపరుల్ని తమ దేశంలోకి రానివ్వాల్సిన అవసరం లేదని సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తేల్చిచెప్పేసింది.
అంతే కాదు ఇప్పటికే వీసాలు, గ్రీన్ కార్డులు ఉన్న వారు ఇలాంటి పోస్టులు పెడితే వారి నివాస హోదాను కూడా రద్దు చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే భారత్ తో పాటు పలు దేశాల వీసాలు, గ్రీన్ కార్డుదారులు ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో వారిని దేశం నుంచి బహిష్కరిస్తున్నారు. అమెరికాలో పాలస్తీనా అనుకూల నిరసనలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications