ఢాకాలో భారీ పేలుడు: 16 మంది మృతి, వందలాది మందికి గాయాలు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మరో భారీ పేలుడు సంభవించింది. పాత ఢాకాలోని రద్దీగా ఉండే సిద్ధిక్‌బజార్‌లోని ఏడు అంతస్తుల భవనంలో జరిగిన పేలుడులో 16 మంది మృతి చెందారు.
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మరో భారీ పేలుడు సంభవించింది. పాత ఢాకాలోని రద్దీగా ఉండే సిద్ధిక్‌బజార్‌లోని ఏడు అంతస్తుల భవనంలో జరిగిన పేలుడులో 16 మంది మృతి చెందారు. మరో వందమందికిపైగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

బంగ్లాదేశ్ కాలమానం ప్రకారం.. మంగళవారం సాయంత్రం ఈ పేలుడు సంభవించింది. క్షతగాత్రులను ఢాకా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి భవనంలోని తొలి రెండు అంతస్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. బాంబు పేలుడుతో భవనం గోడ కూలిపోయింది. అక్కడి సామాగ్రి మొత్తం వీధుల్లోకి ఎగిరిపడింది. సమీపంలోని బస్సు కూడా ధ్వంసమైంది.
మరోవైపు, పేలుడు సంభవించిన భవనంకు సమీపంలో ఉన్న బ్యాంకులో అద్దాలు పగిలిపోయాయి. ఆ గాజు పెంకులు తగిలి పలువురు ఉద్యోగులు గాయాలపాలయ్యారు. ఈ భారీ పేలుడుకు సంబంధించిన కారణాలు మాత్రం తెలియరాలేదు. కాగా, వారం రోజుల వ్యవధిలో బంగ్లాదేశ్‌లో ఇది మూడో పేలుడు ఘటన కావడం గమనార్హం. ఇటీవల ఆక్సిజన్ ప్లాంట్ తోపాటు ఢాకాలోని మిర్పూర్ రోడ్‌లోని ఓ భవనంలో పేలుళ్లు సంభవించాయి.












Click it and Unblock the Notifications