బంగ్లాలో హిందువులపై ఆగని దాడులు-దాడి చేసి నిప్పు పెడితే-కొలనులో..!
బంగ్లాదేశ్ లో విద్యార్థి నాయకుడి హత్య తర్వాత హిందువులపై మొదలైన దాడులు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థి నేత ఉస్మాన్ హాదీ హత్య తర్వాత అక్కడి తాత్కాలిక ప్రభుత్వాన్ని కూడా లెక్కచేయకుండా అల్లరిమూకలు రెచ్చిపోతున్నాయి. ఈ నేపథ్యంలో హిందువులపై మొదలైన దాడులకు కొనసాగింపుగా తాజాగా ఖోంకన్ దాస్ అనే మరో హిందువుపై దాడి చేసి నిప్పంటించారు.
నిన్న షరియత్‌పూర్ జిల్లాలో మెడికల్ షాప్ నిర్వహిస్తున్న 50 ఏళ్ల ఖోంకన్ దాస్ ఇంటికి వెళ్తుండగా.. ఓ గుంపు అతన్ని అడ్డగించింది. అతని కడుపు దిగువ భాగంలో పొడిచి, కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించింది. అయితే అతను సమీపంలోని చెరువులోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. దాస్ తన మెడికల్ షాపు మూసివేసి ఇంటికి తిరిగి వస్తుండగా దాడి జరిగిందని అతని భార్య తెలిపింది. ఇది ఎవరు చేశారో తనకు తెలియదని, కానీ తమకు న్యాయం కావాలని ఆమె వేడుకుంది. తన భర్త ఒక సాధారణ వ్యక్తి అని, అతను ఎవరికీ హాని చేయలేదని, ఎవరినీ బాధపెట్టలేదని తెలిపింది.

రెండు వారాల్లో బంగ్లాదేశ్‌లో హిందువుపై జరిగిన నాల్గవ దాడి ఇది. డిసెంబర్ 18న మైమెన్సింగ్‌లోని భలుకా ఉపజిల్లాలోని తన ఫ్యాక్టరీలో ఒక ముస్లిం సహోద్యోగిపై తప్పుడు దైవదూషణ ఆరోపణలపై 25 ఏళ్ల హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌ను మూక దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఆ గుంపు దాస్‌ను హత్య చేసి, ఆపై అతని మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి నిప్పంటించింది. తర్వాత డిసెంబర్ 24న బంగ్లాదేశ్‌లోని కలిమోహర్ యూనియన్‌లోని హోస్సైన్‌డంగా ప్రాంతంలో 29 ఏళ్ల అమృత్ మండల్ అనే మరో హిందూ యువకుడిని ఒక గుంపు కొట్టి చంపిందని ఆరోపణలు ఉన్నాయి.

బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మూకదాడులు, హత్యలపై భారత్ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనార్టీలపై దాడులు సరికాదని తెలిపింది. అయితే బంగ్లాదేశ్ మాత్రం భారత్ ఆందోళనలను పట్టించుకోకపోవడంతో పరిస్ధితులు మరింత దిగజారుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ దాడులపై స్పందిస్తూ.. బంగ్లాదేశ్ బహిష్కృత ప్రధాన మంత్రి షేక్ హసీనా.. అక్కడి యూనుస్ ప్రభుత్వం మతపరమైన మైనారిటీలను రక్షించడంలో విఫలమైందని ఆరోపించారు. తీవ్రవాదులు విదేశాంగ విధానాన్ని నిర్దేశించడానికి అనుమతిస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications