ఐసీస్ కీలకనేత హతం..?: ప్రకటించిన జో బైడెన్
ఐసిస్ కీలక నేత అబు ఇబ్రహీం అల్ హషీమీ అమెరికా దళాల దాడిలో చనిపోయాడు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన చేశారు. వాయవ్య సిరియాలో జరిగిన దాడిలో అమెరికా ప్రత్యేక దళాలు హషీమీని మట్టుబెట్టాయని బైడెన్ వెల్లడించారు. 2019లో ఐసిస్ అగ్రనేత అబు బకర్ అల్ బాగ్దాదీని తుదముట్టించిన తర్వాత, సిరియాలో అమెరికా చేపట్టిన రెండో అతిపెద్ద ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ ఇదేనని ప్రకటించారు.
అమెరికా ప్రత్యేక దళాలు వాయవ్య సిరియాలో ఓ కౌంటర్ టెర్రరిజమ్ ఆపరేషన్ చేపట్టాయని బైడెన్ వివరించారు. అమెరికా పౌరులను, మిత్రదేశాలను కాపాడుకోవడానికి ఈ చర్య తప్పనిసరి అయిందని వివరించారు. ప్రపంచాన్ని సురక్షిత ప్రాంతంగా ఉంచడానికి ఇలాంటి దాడులు అవసరమేనని నొక్కి వక్కానించారు. అత్యున్నత నైపుణ్యం, తెగువ ప్రదర్శించిన బలగాలకు కృతజ్ఞతలు తెలిపారు. దాడిలో అబు ఇబ్రహీం అల్ హషీమీ అల్ ఖురేషీ మరణించాడని బైడెన్ పేర్కొన్నారు. ఈ దాడిలో పాల్గొన్న అమెరికా కమాండోలు అందరూ సురక్షితంగా తమ స్థావరాలకు తిరిగొచ్చారని బైడెన్ వెల్లడించారు.

మధ్య ప్రాచ్యంలో సైనిక కార్యకలాపాలు, ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించే అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ దాడి నిర్వహించిందని పెంటగాన్ మీడియా కార్యదర్శి జాన్ కిర్బీ తెలిపారు. సిరియా-టర్కీ సరిహద్దు ప్రాంతంలోని అట్మే వద్ద ఓ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా కమాండోలు దాడి చేశారని విశ్వసనీయంగా తెలిసింది. ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చిన తరహాలో.. అర్ధరాత్రి వేళ హెలికాప్టర్ ద్వారా కమాండోలు కిందికి దిగారు.
కొన్ని నిమిషాల్లో పేలుళ్లు, కాల్పులతో ఆ భవనం పాక్షికంగా దెబ్బతిందని.. ఈ దాడిలో 13 మంది మరణించినట్టు తెలుస్తోంది.మూడు హెలికాప్టర్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఆ భవనంలోని సాయుధులు కూడా అమెరికా హెలికాప్టర్లపై మెషీన్ గన్లతో గుళ్ల వర్షం కురిపించారు. డ్రోన్ దాడుల తరహాలో శబ్దాలు వినిపించాయని వివరించారు.












Click it and Unblock the Notifications