అమెరికా వద్దు.. మా దేశానికి రండి.. భారతీయులకు 85 వేల వీసాలిచ్చిన చైనా..!
అమెరికాలో వలసదారులపై ట్రంప్ ఉరుముతున్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసదారుల్ని స్వదేశాలకు పంపేయడంతో పాటు కొత్తగా జారీ చేసే వీసాలు, గ్రీన్ కార్డులపై ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాకు వెళ్లాలంటేనే భారతీయులు భయపడుతున్నారు. ఇప్పటికే అమెరికాలో ఉన్న వారు సైతం ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో అమెరికాతో వాణిజ్య యుద్ధానికి సై అంటే సై అంటున్న మన పొరుగుదేశం చైనా మాత్రం భారతీయులకు ఆహ్వానం పలుకుతోంది.
ఈ ఏడాది ఇప్పటివరకూ చైనా.. భారతీయులకు 85 వేల వీసాలు జారీ చేసింది. ఈ విషయాన్ని భారత్ లో చైనా రాయబారి జూ ఫీహాంగ్ అధికారికంగా వెల్లడించారు. అంతే కాదు చైనాను సందర్శించడానికి మరింత మంది భారత స్నేహితులకు స్వాగతం అంటూ ఎక్స్ లో పెట్టిన పోస్టులో తెలిపారు. సురక్షిత, స్నేహపూర్వక, స్ఫూర్తివంతమైన చైనాను అన్వేషించండి అంటూ పేర్కొన్నారు. దీంతో భారతీయులు చైనాకు క్యూ కట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలోనే చైనా తమ వీసాల ధరలపై తగ్గింపును మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆటోమేటిగ్గా చైనాకు వెళ్లే భారతీయుల సంఖ్య కూడా పెరుగుతోంది. అదే సమయంలో గల్వాన్ ఘటన తర్వాత మారిన పరిస్ధితుల్లో చర్చల తర్వాత భారత్ తో స్నేహానికి ప్రాధాన్యం ఇస్తున్న చైనా.. ఇప్పుడు వీసాల జారీ విషయంలోనూ సానుకూలంగా ఉంటోంది. దీంతో భారతీయులకు జారీ చేసే వీసాల సంఖ్య కూడా పెరిగినట్లు భావిస్తున్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల పెంపుతో ఉరుముతున్న వేళ భారత్ కు చైనా స్నేహహస్తం అందించడం వ్యూహాత్మక అడుగుగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications