ట్రంప్ కు చైనా భారీ షాక్.. దెబ్బకు దెబ్బ తీసిన జిన్ పింగ్...!
విదేశాలను కంట్రోల్ చేసేందుకు సుంకాల పెంపును ఆయుధంగా వాడుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ కు చైనా భారీ షాకిచ్చింది. చైనా వస్తువులపై 34 శాతం సుంకాలు విధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయానికి గట్టి కౌంటర్ ఇచ్చింది. తాము కూడా అమెరికా వస్తువుల దిగుమతులపై 34 శాతం సుంకాలు విధిస్తామని ఇవాళ చైనా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఓవైపు భారత్ అమెరికా సుంకాల మోత భయంతో తమ పన్నులు తగ్గిస్తున్న వేళ చైనా సాహసోపేత నిర్ణయం తీసుకుంది.
అమెరికా దిగుమతులపై 34 శాతం సుంకాలు విధిస్తున్నట్లు చైనా ప్రభుత్వం ఇవాళ ప్రకటన చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి సుంకాల పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. అమెరికా బెదిరింపులకు కౌంటర్ గానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా వెల్లడించింది. ట్రంప్ నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్దమని చైనా ప్రభుత్వం తెలిపింది. చైనాలో టారిఫ్ చట్టం, కస్టమ్స్ చట్టం, విదేశీ వ్యాపార చట్టం, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల ప్రకారం ఈ పన్నుల పెంపు చేస్తున్నట్లు పేర్కొంది.

అయితే చైనాకు ఇప్పటికే బయలుదేరిన అమెరికా సరకులు మే 13లోపు చేరుకుంటే వాటిపై ఈ సుంకాల పెంపు ప్రభావం ఉండదని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అదే సమయంలో అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతాయని చైనా ప్రభుత్వం వెల్లడించింది. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకుంటామని తెలిపింది. చైనా నిర్ణయంపై అమెరికా ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. అయినా తాము మొదలుపెట్టిన వాణిజ్య యుద్దాన్ని చైనా అంతే దూకుడుగా కౌంటర్ ఇవ్వడం ట్రంప్ సర్కార్ కు మంటపుట్టిస్తోంది. అయినా చైనాపై వెంటనే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.












Click it and Unblock the Notifications